ఆసారాం బాపు (ఫైల్ ఫోటో)
జైపూర్: అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 77 ఏళ్ల ఆసారాం బాపు ఆడియో సంభాషణ క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ‘త్వరలో మంచి రోజులు వస్తాయి’ అని ఆసారాం అవతలి వ్యక్తికి చెప్పటం ఉంది. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న ఆ టేపు ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో జోధ్‌పూర్ సెంట్రల్ జైల్ సిబ్బందిపై విమర్శలు మొదలయ్యాయి. అత్యాచార కేసు : ఆసారాం దోషి
‘వ్యవస్థ పట్ల మనం గౌరవంతో నడుచుకోవాలి. నన్ను చూసేందుకు జైలుకు ఎవరూ రావొద్దు. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించకండి. కింది కోర్టులు తప్పు చేస్తే పైకోర్టులు ఆ తప్పులను సరిదిద్దుతాయి. త్వరలో మంచి రోజులు వస్తాయన్న నమ్మకం ఉంది. ఆశ్రమంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారం నాకు అందింది. ఆ విషయంలో శ్రద్ధ వహించండి. నా సంగతి తర్వాత.. ముందు శిల్పి-శరత్ చంద్రల బెయిల్ కోసం ప్రయత్నించండి. గురువుగా నా భక్తుల విషయంలో శ్రద్ధ చూపటం నా కర్తవ్యం’ అంటూ ఆసారాం ఆ వ్యక్తితో చెప్పటం ఉంది. అవతలి వ్యక్తి మాత్రం మౌనంగా ఆ మాటలన్ని విన్నాడు. ఈ క్లిప్ బయటకు ఎలా వచ్చిందో తెలీదుగానీ వైరల్ అవుతోంది.
నిబంధనల ప్రకారమే ఫోన్ చేశారు... ఈ ఆడియో క్లిప్‌పై జైళ్ల డీఐజీ విక్రమ్ సింగ్ స్పందించారు. శిక్ష ఖరారైన రెండు రోజుల తర్వాత.. అంటే శుక్రవారం ఈ ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘సాధారణంగా ఖైదీలకు ఒక నెలలో.. రెండు ఫోన్ నంబర్లకు సుమారు 80 నిమిషాలపాటు మాట్లాడుకునేందుకు అనుమతి ఉంటుంది. దానిని అనుసరించే సబర్మతి ఆశ్రమంలోని సాధక్‌తో శుక్రవారం సాయంత్రం ఆసారాం మాట్లాడారు. బహుశా ఆ ఆడియో క్లిప్ లీక్ అయ్యి ఉంటుంది’ అని విక్రమ్ సింగ్ తెలిపారు. అయితే ఆ క్లిప్ ఎలా బయటకు పొక్కి ఉంటుందన్న విషయంపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
ఆశ్రమంతో నాకు సంబధం లేదు... గత కొంత కాలంగా ఆసారాం కూతురు భారతి మీడియా కంటపడకుండా తిరుగుతున్నారు. ఆసారాం అత్యాచారం చేశాడంటూ మరో మహిళ దాఖలు చేసిన కేసులో భారతితోపాటు ఆసారాం భార్య లక్ష్మీ నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు కోసం శుక్రవారం భారతి గాంధీనగర్ కోర్టుకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘ఆశ్రమంలో జరిగే ప్రతీ వ్యవహారంలో నా హస్తం ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, 17 ఏళ్ల నుంచి ఆశ్రమానికి నేను దూరంగా ఉంటున్నా. ఈ విషయాన్ని ఆశ్రమ నిర్వాహకులను అడిగినా చెబుతారు. నా తండ్రి చేసిన అకృత్యాలకు నాకు సంబంధం లేదు’ అని ఆమె వివరణ ఇచ్చారు.
ఆసారాం కూతురు భారతి(పాత చిత్రం)
Comments
Please login to add a commentAdd a comment