ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
భరతనాట్యానికి సరికొత్త సొబగులద్ది, దాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసిన ఘనత నాట్యమయూరి సవితా శాస్త్రికే దక్కుతుంది. కేవలం నృత్యభంగిమలతో ఎన్నో హావభావాలను వ్యక్తపరిచి కళాభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన రెవల్యూషనరీ డ్యాన్సర్. తన నాట్యంతో మహిళా సమస్యలను కథలుగా చెబుతున్న ఆమె తాజాగా ‘చైన్స్- లవ్ స్టోరీస్ ఆఫ్ షాడోస్’ ప్రదర్శనతో ప్రేక్షకులను మైమరపింపజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డ్యాన్సింగ్ స్టోరీ టెల్లర్ సవితాశాస్త్రిని ఈ సందర్భంగా సిటీప్లస్ పలకరించింది. ఆ పరిచయం ఆమె మాటల్లోనే...
నేను పుట్టింది హైదరాబాద్లోనే... కానీ పెరిగింది చెన్నై, ముంబైలలో. బాల్యం నుంచే డ్యాన్స్ అంటే ఇష్టం. ముంబైలోని గురు మహాలింగం పిళ్లై దగ్గర నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. తరువాత చెన్నైలో అడయార్ కె.లక్ష్మణ్, ధనంజయన్ గార్ల దగ్గర సాధన కొనసాగించాను. ఆ నాట్యంపైన ఉన్న ప్రేమతో... నా ఆలోచనలను గౌరవించే స్నేహితుడినే పెళ్లి చేసుకున్నాను. నా ప్రదర్శనలకు మూల కథలు అందించేది నా భర్త ఏకే శ్రీకాంత్. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను నాకు తెలిసిన కళ ద్వారా తెలియజెప్పాలనుకున్నాను. భరతనాట్యం మూలాలకు ఆటంకం కలగకుండా కేవలం హావభావాలతో, నృత్య భంగిమలతో చక్కగా ఆవిష్కరించడం అంటే అంత సులువుకాదు. కానీ సాధనతో సాధ్యం కానీదేదీ ఉండదు. కళ్లుచెదిరే నాట్య భంగిమలకు, భావోద్వేగాలు తోడైతే... ప్రేక్షకుల మనసులు కదిలించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ రెండింటినీ సునాయాసంగా పలికించగలగడం నా అదృష్టంగా భావిస్తాను.
పునరుజ్జీవమే లక్ష్యంగా...
ప్రేక్షకులు ప్రశంసించినా, తిరస్కరించినా నేను నాకు నచ్చింది చేయడానికే ఇష్టపడతా. నామీద నాకున్న నమ్మకమే నా బలం. నాట్యాన్ని నాట్యంలాగానే కాకుండా... ప్రస్తుత పరిస్థితులను మేళవిస్తే నాట్యం బతుకుతుంది. భరతనాట్య పునరుజ్జీవమే నా లక్ష్యం. ముంబైలో సాయి శ్రీ ఆర్ట్ ఏర్పాటు చేశాను. ఇదే బ్యానర్లో గతంలో ‘సోల్ కేజెస్’, ‘యుద్ద్’, ‘ద ప్రొఫెట్’ ‘మ్యూజిక్ వితిన్’ అనే విభిన్న కళాప్రధానమైన నాట్య ప్రదర్శనలు ఇచ్చాను.
చైన్స్...
ఇక ‘చైన్స్-లవ్ స్టోరీస్ ఆఫ్ షాడోస్’ ప్రదర్శన గురించి చెప్పాలంటే ఇది ఒక యథార్థ గాథ. తన ఇష్టాలను బయటకు చెప్పలేని ఓ యువతి తనకోసం బతకాలా? లేక కుటుంబం, సమాజంకోసం రాజీపడాలా? అన్న మీమాంసలో కలిగే భావోద్వేగాలే దీని ఇతివృత్తం. ప్రతి మనిషి సంఘంలో మంచిగా బతకడం కోసం తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖానికి ముసుగు కప్పుకుని బతుకుతాడు. బయటకు కనిపించని ఆ ముసుగులో ఉండేది మనోవేదనే తప్ప మరోటి కాదు. ఆ ఆవేదనే ఈ ‘చైన్స్’.
- ఎస్.శ్రావణ్జయ