‘తెలుగునాడు’గా సీమాంధ్ర: డొక్కా
అసెంబ్లీ సీట్లను 175నుంచి 225కు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ పేరును ‘తెలుగు నాడు’గా మార్చాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. సీమాంధ్ర పరిధిలోని 175 అసెంబ్లీ స్థానాలను 225కు, తెలంగాణలోని 119 సీట్లను 153కు పెంచాలని కూడా కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఈ మేరకు మార్పులు కోరుతూ మంత్రి మాణిక్యవర ప్రసాద్ శుక్రవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు సవరణలను ప్రతిపాదించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలిపేసి, ‘రాయల తెలంగాణ’ను ఏర్పాటు చేయాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని సూచించారు. తాను సూచించిన సవరణలను సభ పరిగణనలోకి తీసుకోని పక్షంలో విభజన బిల్లును వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు.