హై సెక్యూరిటీ ప్లేట్లపై కౌంటర్లు వేయండి
ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆ ఆదేశాల్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంత్రరాయ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.