Telugu year
-
మలేషియాలో ఘనంగా ఉగాది వేడుకలు
కౌలాలంపూర్, మలేసియా : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు మలేషియాలోని మరిడేక స్క్వేర్లో అట్టహాసంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా(టామ్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, ఫెడరల్ టెరిటోరిస్ మంత్రి తంకూ అద్నాన్ మన్సూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల సందర్భంగా చిన్నారుల ఆట పాటలు, హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు అందర్ని ఆకట్టుకున్నాయి. టామ్ అధ్యక్షులు డీఆర్ అచ్చయ్య కుమార్ మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
వందే ఉగాది కోకిలమ్
వందే వాల్మీకి కోకిలమ్. వాల్మీకి కోకిలకు వందనం అని అర్థం. త్రేతాయుగం నాడు వాల్మీకి మహర్షి ఆలపించిన రామాయణ కథా గానాన్ని ఆలకించిన భారతీయులు ‘‘ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ‘‘ ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్‘‘ అని ఆయనను కోకిలగా అభివర్ణించారు. కోకిల కారణంగా ఆయనకు గౌరవం దక్కిందా, ఆయన కారణంగా కోకిలకు ప్రాధాన్యత వచ్చిందా అనే సందేహం కలిగింది షడ్రుచులకి. మనలో మనం తర్కించుకోవడం ఎందుకు, నేరుగా వాల్మీకి దగ్గరకు వెళ్లి, ఆయననే ప్రశ్నిద్దాం అని బయలుదేరాయి.. వేపపువ్వు, మామిడికాయ, చెరకుగడ, చింతపండు.. ఉప్పును వెంటబెట్టుకుని. అప్పటికే పుంస్కోకిల అక్కడకు చేరుకుని, మహర్షితో తీయగా సంభాషిస్తోంది. ‘మహర్షీ! నువ్వు ఎంతో అందంగా, తీయగా రామాయణ గానం చేశావు. రామ రామ అంటూ మధురంగా, మధురమైన అక్షరాలతో పలుకుతూ, కవితా శాఖలను అధిరోహిస్తూ, అందరిచేత ‘వాల్మీకి కోకిలమ్’ అని ప్రణతులు అందుకున్నావు. నాకు ఎంతో సంతోషంగా ఉంది స్వామీ, మీ కారణంగా నా పేరు చిరస్థాయిగా కోకిలగా కాకుండా వాల్మీకి కోకిలగా నిలబడిపోయింది’ అంటూ ఆనంద పారవశ్యంతో, తన మనసు పొరలలో వాల్మీకి మహర్షి మీద దాగున్న అభిమానాన్ని మధుర గంభీర కంఠస్వరంతో కలస్వనం చేసింది. మహానుభావుడైన వాల్మీకి, వినమ్రంగా, ‘ఓ కోకిలా! నీ కంఠమాధుర్యంలా నా కవిత్వం ఉందన్నారే కాని, నా కవిత్వంలా నీ కంఠం ఉంది అనలేదు, గమనించావా. నీ తీయని స్వరం ఈ సృష్టిలో లేకపోతే, నాకు అంతటి మధురమైన ఉపమానం వచ్చి ఉండేది కాదు’ అంటూ కోకిలను ఆప్యాయంగా నిమిరి, మళ్లీ, ‘కోకిలమ్మా. నువ్వు కుహూకుహూ అని పలకగానే, వసంతం వచ్చిందని, ఉగాది సంబరాలు జరుపుకోవాలని ఒక్కసారిగా అందరూ సంసిద్ధులవుతారు. నీకు అంత ప్రత్యేకత ఉంది’ అంటుంటే కోకిల తన కుహూరవాలకు ఇంత ప్రాధాన్యత ఉందా అనుకుంటూ బిడియపడిపోయింది. అక్కడే ఉన్న మావి చిగురు, ‘చెరుకుబావా. ఈ మహర్షి మాటలు విన్నావా. కేవలం కోకిల వల్లే వసంతం వచ్చిందని తెలుస్తుందట. అసలు ఆ కోకిల నా చిగుళ్లు తినకుండా గొంతు విప్పగలదా. మండుటెండలు ప్రవేశిస్తుంటే, నేను ఎర్రటి చిగుళ్లను చిగురించి, కోకిలను ఆకర్షిస్తాను. తన పదునైన ముక్కుతో నన్ను పొడిచి పొడిచి తింటుంది. నేను ఏ మాత్రం బాధ పడకుండా, నా బిడ్డకు ఆహారం పెడుతున్నట్టు భావిస్తాను. అలాంటి నన్ను విడిచిపెట్టి, నా ఆహారంతో కమ్మని స్వరంతో కుహుకుహూరవాలు చేసే కోకిలను పొగుడుతుంటే, నాకు బాధ వేస్తోంది’ అంది. పక్కనే ఉన్న వేప పువ్వు, చింతపండు తమ తమ గొంతులు కూడా విప్పాయి. ‘నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడరేం. వేప పూత వస్తోందంటే, కొత్త సంవత్సరం వస్తోందని నవ్వుల పువ్వులు పూయిస్తాను కదా. నన్ను గుర్తించకపోతే బాధగా ఉండదా...’ అంటుంటే పక్కనే చింతపండు చిరుచిరు నవ్వులు పండిస్తూ... ‘మనం ఇలా అనుకోవడం సరి కాదు, మనమందరం కలిస్తేనే ఉగాది పండుగ. నన్ను పిండి రసం తీస్తారు, దానికి మిరియాల పొడి జత చేస్తారు. అందులో చెరుకు ముక్కలు, అరటి పండు ముక్కలు, వేప పువ్వు... ఇన్ని కలిస్తేనే కదా ఉగాది పచ్చడి అవుతుంది. కాని కోకిల స్వయంగా కూస్తుంది, ఆ కుహూరవాలకు దేనితోను సంబంధం లేదు. అలాగే మహర్షి వాల్మీకి కూడా. ఆయన స్వయంగా పలికినవాడే కాని ఎవరో పలికిన పలుకులను అక్షరీకరించలేదు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆయనను మనం వాల్మీకి కోకిలమ్ అని అక్కున చేర్చుకుంటున్నాం కదా. మనం ఎంత మంది ఉన్నా లేకున్నా... కోకిల, వాల్మీకి కోకిల... వీరిద్దరే అసలైన ఉగాది ప్రతీకలు’... అంటూ వాల్మీకి పాదాలకు, కోకిల గళానికి నమస్కరించాయి.‘వసంత ఋతువు, ఉగాది, కోకిల కలస్వనాలు, ఎర్రటి మావి చిగుళ్లు... ఇవే పండుగకు ప్రకృతిలో కనిపించే చిహ్నాలు. మనమందరం కలిసి, మానవ జీవితంలో షడ్రుచులు ఉంటాయని, జీవితం ఒకసారి తియ్యగా ఉంటుందని, మరోసారి చేదుగా, ఒక్కోసారి వగరుగా... ఇలా ఆరు రుచుల సమ్మేళనం జీవితం అని తెలియచెబుతాం. అందరం ఉంటేనే పండుగ అందంగా, ఆనందంగా ఉంటుంది’... అంటూ చెరకు ఆ సమావేశానికి ముగింపు పలికింది. – పురాణపండ వైజయంతి -
విళంబికి స్వాగతం
తెలుగువారు ఉత్సాహంతో, ఉల్లాసంతో, ప్రేమతో జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి దీనికే సంవత్సరాది అని కూడా పేరు. ఈ వేళ ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దైవారాధన చేసి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించడం సంప్రదాయం. గుడికి వెళ్లి, దేవుణ్ణి సందర్శించి, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణ ం చేయడం ఆచారం. ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. నిజానికి ఉగాది అనేది పూర్తి తెలుగుమాట కాదు. దీనికి సంస్కృత మూలం ‘యుగాది‘. అలా పలకలేక, ఉగాది అనే వికృతి రూపం సంతరించుకుంది. (ప్రకృతి– వికృతిలలో వికృతి. అంతేకాని, వికృత కాదు). బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేశాడట. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ‘ అని పేరు. అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ‘ అంటే నాశనం అని అర్థం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడ ‘క్షయ‘ సంవత్సరంలోనే. సృష్టి ఆరంభమైన శుభదినం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని, మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాలను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. వసంత ఋతువు అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సంప్రదాయాలు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) సంప్రదాయం. పంచాంగ శ్రవణం మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది పూజ అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు. ఉగాది పచ్చడి ‘ఉగాది పచ్చడి‘ ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని, ఖాళీ పొట్టతో తీసుకోవడం మరీ మంచిదనీ అంటారు. నిజానికి ఈ వేపపూత పచ్చడిని శ్రీరామనవమి వరకూ సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. ఒక్కో రుచీ ఒక్కో అనుభవం షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఉంది. బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం ఉప్పు – జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం వేప పువ్వు – చేదు –బాధకలిగించే అనుభవాలు చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు. మీకు తెలుసా? ♦ ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం శుభప్రదం. ♦ కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున, త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు, ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజునా ఉగాది జరుపుకునే వారు. ♦ శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. ♦ వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. ♦ పంచాంగ శ్రవణం చేస్తే గంగాస్నానం చేసినంత పుణ్యం. ♦ ‘పంచాంగం‘ అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. విళంబి అంటే ఆలస్యమని, జాగు అనే అర్థాలున్నాయి. జీవితంలో ఏది∙ఆలస్యం చేయాలో, ఏది తొందరగా చేయాలో తెలుసుకోవడం ప్రధానం. విళంబికి స్వాగతం పలుకుదాం. – డి.వి.ఆర్. -
తెలుగుదనం ‘జయ’హో...!
‘జయం’ వచ్చింది. తెలుగు లోగిళ్లలోకి ఆశల పల్లకిని మోసుకొచ్చింది. మామి చిగుళ్లరుచి చూసిన కోయిల కూస్తుండగా కొత్త సందడిని తెచ్చింది. పంచాంగాలు శుభాలు పలికాయి. రాశుల గతి, గ్రహాల స్థితి అనకూలమనీ..అక్కడక్కడా..దారితప్పినా అధిగమించే శక్తి లభిస్తుందని చెప్పాయి. పిల్లాది మొదలు ఉగాది పచ్చడి రుచిని ఆత్మీయంగా ఒకరికొకరు తినిపించుకొని జీవన సారాన్ని తెలుసుకున్నారు. ఆలయాలు దేవుళ్ల దీవెనలకోసం కిటకిట లాడాయి. ఇదీ పాలమూరు వాకిట జిల్లా వ్యాప్తంగా సాగిన నవ వసంత ఆగమన వేడుక. వెల్లివిరిసిన తెలుగుదనం. కొత్త సంవత్సరానికి జనం పలికిన స్వాగతం. తెలుగు సంవత్సరం కొంగొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కొత్త సంవత్సరం పాలమూరు జిల్లా పురోగతిలో దశలో నడుస్తోందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. శ్రీ జయ నామ సంవత్సరం పంచాంగం ఆధారంగా చంద్రుడు రాజు స్థానంలో నిలవడం వల్ల జిల్లా ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తారని, జిల్లాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఉంటుందని, ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని స్థానిక జ్యోతిష్య పండితుడు రామ్మోహనాచార్య వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట తిరుమలనాథస్వామి ఆలయంలో ఆయన పంచాంగ పఠనం చేశారు. కొత్త పంచాంగం ఆధారంగా ఈ ఏడాది ఆయా రంగాల్లో చోటుచేసుకునే పరిస్థితులను వివరించారు. జిల్లా స్థితి.. రాశి ఫలాలు, గ్రహ స్థితుల ఆధారంగా చూస్తే ఈ ఏడాది పాలమూరు జిల్లా అభివృద్ధి దశలో ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంగా ప్రశాంతంగా ఉంటుంది. జిల్లా ఫలితాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలతో ఉంటారు. కళలను ఆదరిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు సమృద్ధిగా పడటంతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పారదర్శక పరిపాలన కొనసాగుతుంది.