తెలుగుదనం ‘జయ’హో...!
‘జయం’ వచ్చింది. తెలుగు లోగిళ్లలోకి ఆశల పల్లకిని మోసుకొచ్చింది. మామి చిగుళ్లరుచి చూసిన కోయిల కూస్తుండగా కొత్త సందడిని తెచ్చింది. పంచాంగాలు శుభాలు పలికాయి. రాశుల గతి, గ్రహాల స్థితి అనకూలమనీ..అక్కడక్కడా..దారితప్పినా అధిగమించే శక్తి లభిస్తుందని చెప్పాయి. పిల్లాది మొదలు ఉగాది పచ్చడి రుచిని ఆత్మీయంగా ఒకరికొకరు తినిపించుకొని జీవన సారాన్ని తెలుసుకున్నారు. ఆలయాలు దేవుళ్ల దీవెనలకోసం కిటకిట లాడాయి. ఇదీ పాలమూరు వాకిట జిల్లా వ్యాప్తంగా సాగిన నవ వసంత ఆగమన వేడుక. వెల్లివిరిసిన తెలుగుదనం. కొత్త సంవత్సరానికి జనం పలికిన స్వాగతం.
తెలుగు సంవత్సరం కొంగొత్త ఆశలను చిగురింపజేస్తోంది. కొత్త సంవత్సరం పాలమూరు జిల్లా పురోగతిలో దశలో నడుస్తోందని జ్యోతిష్య పండితులు పేర్కొన్నారు. శ్రీ జయ నామ సంవత్సరం పంచాంగం ఆధారంగా చంద్రుడు రాజు స్థానంలో నిలవడం వల్ల జిల్లా ప్రజలు ప్రశాంత జీవనం కొనసాగిస్తారని, జిల్లాలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లోనూ అభివృద్ధి ఉంటుందని, ఈ ఏడాది వర్షాలు అధికంగా ఉండటం వల్ల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని స్థానిక జ్యోతిష్య పండితుడు రామ్మోహనాచార్య వెల్లడించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట తిరుమలనాథస్వామి ఆలయంలో ఆయన పంచాంగ పఠనం చేశారు. కొత్త పంచాంగం ఆధారంగా ఈ ఏడాది ఆయా రంగాల్లో చోటుచేసుకునే పరిస్థితులను వివరించారు.
జిల్లా స్థితి..
రాశి ఫలాలు, గ్రహ స్థితుల ఆధారంగా చూస్తే ఈ ఏడాది పాలమూరు జిల్లా అభివృద్ధి దశలో ఉంటుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంగా ప్రశాంతంగా ఉంటుంది. జిల్లా ఫలితాన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలతో ఉంటారు. కళలను ఆదరిస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు సమృద్ధిగా పడటంతో జిల్లా సస్యశ్యామలం అవుతుంది. పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పారదర్శక పరిపాలన కొనసాగుతుంది.