తెలుగువారు ఉత్సాహంతో, ఉల్లాసంతో, ప్రేమతో జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి దీనికే సంవత్సరాది అని కూడా పేరు. ఈ వేళ ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, దైవారాధన చేసి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించడం సంప్రదాయం. గుడికి వెళ్లి, దేవుణ్ణి సందర్శించి, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల వంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాంగ శ్రవణ ం చేయడం ఆచారం.
ఈ పండుగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగానూ, తమిళులు పుత్తాండు అనే పేరుతోనూ, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. నిజానికి ఉగాది అనేది పూర్తి తెలుగుమాట కాదు. దీనికి సంస్కృత మూలం ‘యుగాది‘. అలా పలకలేక, ఉగాది అనే వికృతి రూపం సంతరించుకుంది.
(ప్రకృతి– వికృతిలలో వికృతి. అంతేకాని, వికృత కాదు). బ్రహ్మ కల్పం ఆరంభమయే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ) లో మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం) లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేశాడట. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ‘ అని పేరు. అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ‘ అంటే నాశనం అని అర్థం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడ ‘క్షయ‘ సంవత్సరంలోనే.
సృష్టి ఆరంభమైన శుభదినం
చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించాడని, మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాలను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. వసంత ఋతువు అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
ఉగాది సంప్రదాయాలు
ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు, ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం) సంప్రదాయం.
పంచాంగ శ్రవణం
మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించాలని వ్రతగ్రంథ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.
ఉగాది పూజ
అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు.
ఉగాది పచ్చడి
‘ఉగాది పచ్చడి‘ ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్ధతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని, ఖాళీ పొట్టతో తీసుకోవడం మరీ మంచిదనీ అంటారు.
నిజానికి ఈ వేపపూత పచ్చడిని శ్రీరామనవమి వరకూ సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. ఉగాది పచ్చడి తిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరమంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం.
ఒక్కో రుచీ ఒక్కో అనుభవం
షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవాలు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఉంది.
బెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
ఉప్పు – జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం
వేప పువ్వు – చేదు –బాధకలిగించే అనుభవాలు
చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు – వగరు – కొత్త సవాళ్లు
మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు.
మీకు తెలుసా?
♦ ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం శుభప్రదం.
♦ కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున, త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు, ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజునా ఉగాది జరుపుకునే వారు.
♦ శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
♦ వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే.
♦ పంచాంగ శ్రవణం చేస్తే గంగాస్నానం చేసినంత పుణ్యం.
♦ ‘పంచాంగం‘ అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. విళంబి అంటే ఆలస్యమని, జాగు అనే అర్థాలున్నాయి. జీవితంలో ఏది∙ఆలస్యం చేయాలో, ఏది తొందరగా చేయాలో తెలుసుకోవడం ప్రధానం. విళంబికి స్వాగతం పలుకుదాం.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment