తాత్కాలిక జేడీఏగా చంద్రానాయక్
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి వెన్నునొప్పి, రక్తపోటుతో ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో భూసార సంరక్షణ విభాగం డీడీఏ చంద్రానాయక్కు తాత్కాలిక జేడీఏ బాధ్యతలు అప్పగించారు. శనివారం కూడా శ్రీరామమూర్తికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. ఆయన మరో రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండే అవకాశముంది. శనివారం కొన్ని ఫైళ్లపై ఆస్పత్రిలోనే సంతకాలు చేశారు.
వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో అప్పటివరకు తాత్కాలిక బాధ్యతలు చంద్రానాయక్కు అప్పగించారు. కాగా.. జేడీఏ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆ శాఖ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పరామర్శకు వచ్చారు. ఇతర శాఖల అధికారులు ఫోన్లో పరామర్శించారు.