Temporary registration
-
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఉదంతంలో పోలీసులు గుర్తించిన ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)పైనే తిరుగుతున్నట్లు నిర్ధారించారు. అదొక్కటే గ్రేటర్లో వేలకొద్దీ వాహనాలు తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే తిరుగుతూ గందరగోళానికి కారణమవుతున్నాయి. సాధారణంగా బండి కొనుగోలు చేసిన 30 రోజుల లోపు వాహన యజమాని తన పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అపరాధ రుసుముతో 6 నెలల్లోపు కూడా శాశ్వతంగా నమోదు చేసుకొనేందుకు రవాణాశాఖ వెసులుబాటు కల్పించింది. కానీ.. కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంతో కాలయాపన చేయడం గమనార్హం. మరోవైపు మరికొందరు ద్విచక్ర వాహనదారులు సంవత్సరాలు గడిచినా శాశ్వత నమోదు చేసుకోకుండా తాత్కాలిక రిజిస్ట్రేషన్లపైనే రహదారులపై పరుగులు తీస్తున్నారు. దీంతో అనూహ్యమైన పరిస్థితుల్లో వాహనాల గుర్తింపులో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. ఇలా తాత్కాలిక నమోదుపై ఉన్న వాహనాల విషయంలో రవాణాశాఖ కేవలం అపరాధ రుసుముకే పరిమితం కావడంతో వాహనదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. నచ్చిన నంబర్ కోసం ఎదురు చూపులు.. ► అదృష్ట సంఖ్యలుగా భావించే ప్రత్యేక నంబర్ల కోసం ఎదురు చూస్తూ కొందరు వాహనదారులు తాత్కాలిక నమోదుపైనే బండ్లను నడుపుతున్నారు. మూడు నెలలకోసారి వచ్చే సిరీస్‌లో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా నచ్చిన నంబర్ లభించకపోతే మరో 3 నెలలు ఆగాల్సిందే. కొంతమంది తమకు నచ్చిన నంబర్ లభించే వరకు ఈ తరహా కాలయాపన చేస్తున్నారు. దీంతో వాహనాలపైన అతికించిన టీఆర్ నంబర్ స్టిక్కర్లు కూడా చిరిగిపోయి తాత్కాలిక గుర్తింపు కూడా కనిపించకుండా మాయమవుతోంది. గ్రేటర్లో ప్రతి రోజూ సుమారు 1650కిపైగా వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వీటిలో 500 వరకు కార్లు ఉంటే మరో 1100కుపైగా బైక్‌లు, ఇతర వాహనాలు ఉంటాయి. సాధారణంగా అన్ని రకాల రవాణా వాహనాలు కచ్చితంగా నిర్ణీత గడువు మేరకు శాశ్వత నమోదుపైనే తిరుగుతాయి. వ్యక్తిగత వాహనాల విషయంలోనే ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది. చిరునామా మార్పు అవసరమే.. ► కొందరు వాహనదారులు తాము ఇల్లు మారిన వెంటనే వాహనాలను కూడా కొత్త చిరునామాకు మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలా మార్చుకోకపోవడంతో ప్రమాదాల బారినపడినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాహనదారులను గుర్తించడం కష్టంగా మారుతోంది. వాహన యాజమాన్య బదిలీ, చిరునామా మార్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ హెచ్చరించారు. ‘మార్పు’ మరిచిపోతే కష్టమే.. ► మరోవైపు చాలా మంది తమ పాత బండ్లను అమ్ముకొని కొత్తవి కొనుగోలు చేస్తారు. అలా విక్రయించే సమయంలో బండి యాజమాన్య మార్పిడి కూడా తప్పనిసరి. కానీ ఇటు విక్రయించిన వారు, అటు కొనుగోలు చేసిన వారు సకాలంలో యాజమాన్య మార్పు చేసుకోవడం లేదు. బండి మాత్రం ఒకరి నుంచి మరొకరికి అనధికార యాజమాన్య మార్పిడికి గురవుతుంది. ఇలాంటి వాహనాలు తరచుగా ప్రమాదాలకు పాల్పడినప్పడు సదరు వాహనాలు ఎవరి పేరిట నమోదై ఉంటే వారే మూల్యం చెల్లించవలసి వస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలపైనా భారీ ఎత్తున జరిమానాలు నమోదు కావడం గమనార్హం. ► అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు వినియోగించే వాహనాల్లోనూ వాటి అసలైన యజమానులే నష్టపోవాల్సివస్తుంది. బండిని విక్రయించినప్పుడే యాజమాన్యం కూడా బదిలీ చేసుకోకపోవడం వల్ల అప్పటి వరకు ఎవరి పేరిట నమోదై ఉంటే వారే ఆ పరిణామాలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం. గతంలో నగరంలో కొన్ని చోట్ల చోటుచేసుకున్న హత్యలు, తదితర నేరాల్లో ఇలాంటి గుర్తుతెలియని వాహనాలతో వాటి మొదటి యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భాలు ఉన్నాయి. చదవండి: బాబాయ్ అంటే భయం.. అదే అలుసుగా తీసుకుని మూడు రోజులుగా.. -
వాహన విక్రయాల్లో అక్రమాలకు చెక్
సాక్షి, గుంటూరు: నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో గత మంగళవారం రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై గుంటూరు నుంచి వస్తుండగా రవాణా శాఖ అధికారి ఆపారు. ఆ వ్యక్తి బైక్‌ను మూడు రోజుల క్రితమే కొనుగోలు చేశాడు. అయితే ఆ బైక్‌కు టీఆర్ లేదు. టీఆర్ లేకపోవడంపై బైక్ యజమానిని ప్రశ్నించగా షోరూమ్ డీలర్ వారం రోజుల తర్వాత టీఆర్ చేస్తానని చెప్పాడని బైక్ యజమాని సమాధానం ఇచ్చాడు. ఆ బైక్‌ను ఏ షోరూమ్‌లో కొనుగోలు చేశాడో ఆరా తీసిన రవాణా శాఖ అధికారులు ఆ షోరూమ్ లైసెన్స్‌ను బ్లాక్ చేశారు. లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. జిల్లాలో చాలా వరకూ షోరూమ్‌లు ఇదే రీతిలో టీఆర్ లేకుండా వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి విడుదల చేస్తున్నారు. దీంతో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పారదర్శకంగా ప్రజలకు రవాణా శాఖ సేవలు అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ సేవల పేరుతో గత ప్రభుత్వ హయాంలో క్షేత్ర స్థాయిలో వినియోగదారులను అడ్డంగా దోచుకున్నారు. జిల్లాలోని వాహనాల షోరూమ్‌లపై రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వాహన షోరూమ్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వాహనాల విక్రయాలు జరపడమే కాకుండా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేరుతో వినియోగదారులను అడ్డంగా దోచుకుంటున్నారు. టీఆర్ లేకుండానే అమ్మకాలు జిల్లాలో 35 టూవీలర్, 7 ఫోర్ వీలర్ వాహన షోరూమ్‌లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా 100కు పైగా సబ్ డీలర్ షోరూమ్‌లు నడుస్తున్నాయి. ఆయా డీలర్లు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) లేకుండానే వాహనాలను డెలివరీ చేసేస్తున్నారు. ఇలా వాహనాలు విక్రయించడం వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక వాహనం బయట తిరగాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. కొత్తగా కొనుగోలు చేసిన వాహనమైతే తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతే వాహనాన్ని రోడ్డు మీదకు వదలాలి. అయితే జిల్లాలోని పలు షోరూమ్‌ల నిర్వాహకులు టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) లేకుండానే వాహనాలను రోడ్లపైకి విడుదల చేస్తున్నారు. ఇటీవల టీఆర్ లేకుండా టూవీలర్‌ను విక్రయించిన నరసరావుపేట పట్టణంలోని యర్రంశెట్టి మోటర్స్ షోరూమ్ లైసెన్స్‌ను రవాణా శాఖ అధికారులు బ్లాక్ చేశారు. కొందరు డీలర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వాహన కొనుగోలు సమయంలో ఇన్వాయిస్ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిఫ్టింగ్ చార్జీలు, అదనపు చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు షోరూమ్ నిర్వాహకులు చిల్లు పెడుతున్నారు. టూ వీలర్‌కు రూ.2 నుంచి 5 వేలు, ఫోర్ వీలర్‌కు రూ. 5 నుంచి 50వేల వరకూ అదనంగా వసూళ్లు చేస్తున్నారు. పండుగలు, ప్రత్యేక దినాల్లో షోరూమ్ నిర్వాహకులు వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇకపై ఇలాంటి వసూళ్లకు పాల్పడే డీలర్లపై కొరడా ఝుళిపించనుంది. ప్రత్యేక నిఘా గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలోని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇటీవల విజయవాడ, విశాఖపట్టణం, అనంతపురం జిల్లాల్లో భారీ కుంభకోణాన్ని ఆ శాఖ అధికారులు వెలికి తీసిన విషయం తెలిసిందే. వాహనాల విక్రయ ధరలను అమాంతం తగ్గించి లైఫ్ ట్యాక్స్ ఎగవేసినట్లు రవాణా శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో జరిపిన సోదాల్లో వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.250–300కోట్ల వరకూ లైఫ్ ట్యాక్స్ ఎగవేతకు గురైనట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లలో జిల్లాలో జరిగిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, షోరూమ్‌లలో రికార్డులపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు షోరూమ్ నిర్వాహకులు టీఆర్ లేకుండా వాహనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇన్వాయిస్ ధరల కంటే తక్కువ ధరలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తే అటువంటి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తాం. వాహన షోరూమ్‌లపై ఆకస్మిక తనిఖీలు చేపడతాం. షోరూమ్ నిర్వాహకులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, లిఫ్టింగ్ చార్జీల పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడితే వినియోగదారులు మాకు ఫిర్యాదు చేయండి. – ఈ.మీరాప్రసాద్, డీటీసీ గుంటూరు -
31,1 తేదీల్లో ’రవాణా’ సేవలు బంద్
సాక్షి, కర్నూలు: విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ రెండు రోజుల పాటు రవాణా సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం త్రీ టైర్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ విధానం ద్వారా రవాణాశాఖ ఆన్లైన్లో సేవలు అందిస్తోంది. దీని ప్రధాన సర్వర్ హైదరాబాద్ కేంద్రంగా ఉంది. జూన్ 2వ తేదీ ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించడంతో ఆ రోజు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వర్ల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 31, జూన్ 1 తేదీల్లో ప్రధాన సర్వర్‌ను పూర్తిగా ఆపేయనున్నారు. దీంతో డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. దీంతోపాటు వాహనాల విక్రయ సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ సంఖ్య(టీఆర్ నంబరు)ను జారీ చేయాలన్నా రవాణాశాఖ ప్రధాన సర్వర్‌తో అనుసంధానం కావాల్సి ఉండడం, ఆ నంబరు లేకుండా వాహనాలు రోడ్డెక్కే అవకాశం లే కపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రెండు రోజులపాటు షోరూములో వాహనా విక్రయాలు కూడా సాగే పరిస్థితి లేదు. వాహనాలకు సంబంధించి వివిధ రకాల పన్ను, లెర్నింగ్, డ్రైవింగ్ లెసైన్సుల రుసుములకు సంబంధించి ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా చెల్లింపులు కూడా ఆగిపోతాయి. 29, 30 తేదీల్లో అదనపు పని గంటలు మే 31, జూన్ ఒకటో తేదీల్లో సేవలు నిలిచిపోనున్నందునా అందుకు ప్రతిగా మే 29, 30 తేదీల్లో అదనపు గంటలు పని చేసేందుకు రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కౌంటర్లో సేవలు అందిస్తారు. మే 29, 30 తేదీల్లో మాత్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సిబ్బంది కౌంటర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.