Tenth class Question papers Leakage
-
వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు
సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సింధూర, శరణి, అల్లుడు కె.పునీత్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు అసలు విచారణార్హతే లేదని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. నారాయణ విద్యా సంస్థపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వివరాలన్నింటినీ కోర్టు ముందుంచుతామని ఆయన వివరించారు. ప్రశ్నాపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పిటిషనర్లు అసలు నిందితులు కాదని, అలాంటప్పుడు వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడంలో అర్థం లేదన్నారు. కేవలం ఆందోళన ఆధారంగా దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు.. పదవ తరగతి ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీస్ కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు సునీత, పొంగూరు శరణి, అల్లుడు కె.పునీత్, నారాయణ మామ రాపూరు కోటేశ్వరరావు, నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ డిప్యూటీ జనరల్ మేనేజర్ జె.కొండలరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలేపాటి కిషోర్, సొసైటీ సభ్యులు వీపీఎన్‌ఆర్ ప్రసాద్, మరో ఆరుగురు హైకోర్టులో వేర్వేరుగా గత ఆదివారం పిటిషన్లు దాఖలు చేశారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయమూర్తి, పిటిషనర్ల విషయంలో ఎలాంటి కఠిన చర్యలేవీ తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు ఐపీసీ వర్తించదు.. బుధవారం ఈ వ్యాజ్యాలు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావు ఎదుట విచారణకు రాగా పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రత్యేక చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు తిరిగి ఐపీసీ కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని ఇదే హైకోర్టు చెప్పిందన్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (మాల్ ప్రాక్టీస్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక ) చట్టం కింద కేసు నమోదు చేశారని, ఇది ప్రత్యేక చట్టమని తెలిపారు. అందువల్ల ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు. సెక్షన్ 41ఎ ప్రకారం నడుచుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనిని పోలీసుల తరఫున హాజరైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అదనపు పీపీ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, కౌంటర్‌ను పరిశీలించాక పిటిషన్లపై నిర్ణయం వెలువరిస్తామని తెలుపుతూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
నారాయణ లేకుండా ష్యూరిటీలా?
చిత్తూరు అర్బన్: పది ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంలో నిందితుడు మాజీ మంత్రి నారాయణను తమ ముందు హాజరుపరచాలని చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. నారాయణ లేకుండా జామీనుకు ష్యూరిటీలు తీసుకోవడం కుదరదన్నారు. మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంలో గతవారం చిత్తూరు పోలీసులు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేసి ఇన్చార్జి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడం తెలిసిందే. రిమాండ్‌ను తిరస్కరించిన ఇన్చార్జి మేజిస్ట్రేట్.. నారాయణను సొంత పూచీకత్తుపై విడుదల చేస్తూ ఇద్దరు జామీను ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు నారాయణ న్యాయవాదులు 5 రోజుల గడువు తీసుకున్నారు. సోమవారం చిత్తూరులోని నాలుగో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో ఇద్దరు వ్యక్తులను జామీనుగా నారాయణ న్యాయవాదులు హాజరుపరిచారు. దీనిపై మేజిస్ట్రేట్ శ్రీనివాస్ స్పందిస్తూ నిందితుడు రాకుండా ష్యూరిటీలను తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ విషయమై నారాయణ న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను నివేదించడానికి సమయం కోరడంతో మేజిస్ట్రేట్ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారమే: గంటా
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ దుష్ప్రచారం మాత్రమేనని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న గంటా మంగళవారం స్పందించారు. నెల్లూరులోని నారాయణ కళాశాలలో పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత అక్కడి అటెండర్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్టు ప్రచారం జరుగుతోందన్నారు. పరీక్ష ప్రారంభం కాకముందే ప్రశ్నపత్రం బయటకు వస్తే అది లీకేజీ అవుతందని, కానీ ఇక్కడ పరీక్ష ప్రారంభమైన కొంతసేపటి తరువాత బయటకు వచ్చిందని చెప్పారు. ఏదేమైనా ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించినట్టు తెలిపారు. -
అక్కడ మా విద్యార్థులుండరు కదా!
పది ప్రశ్నపత్రాల లీకేజీపై మంత్రి నారాయణ వింత వాదన సాక్షి, అమరావతి: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో నారాయణ విద్యాసంస్థల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఈ విషయాన్ని ఎలా కప్పిపుచ్చాలో తెలియక మంత్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నారు. మొదట అసలు ప్రశ్నపత్రం లీక్ కాలేదని దబాయించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనంతరం వాట్సాప్‌లో ప్రశ్నపత్రం వస్తే మంత్రి నారాయణకేం సంబంధం అంటూ వితండవాదం చేస్తున్నారు. మరోవైపు మంత్రి నారాయణ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థల్లో మా విద్యార్థులు పరీక్ష రాయరు కదా.. అక్కడ ప్రశ్నపత్రం లీకైతే మాకేం సంబంధం? అని చెబుతున్నారు. దీనిపై విచారణ చేస్తామని, ఇప్పటికే విచారణ జరిపించాం.. అంటూ రకరకాల సమాధానాలు ఇస్తున్నారు. లీకేజీ వ్యవహారంపై నారాయణ, పల్లె మంగళవారం మీడియా పాయింట్లో మాట్లాడారు.