ఇతర రాష్ట్రాలకు తరలిపోయేనా?
అగమ్యగోచరంగా మారిన బులెట్ రైలు ప్రాజెక్టు భవితవ్యం
సాక్షి, ముంబై: ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బులెట్ రైలు టెర్మినస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అందుకు అవసరమైన స్థలమిచ్చేందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెమ్మార్డీయే తన పట్టువిడవని పక్షంలో ఈ రెండు నగరాల మధ్య బులెట్ రైలు నడపడం సాధ్యం కాదని రైల్వే పరిపాలనా విభాగం స్పష్టం చేసింది.
వ్యాపార లావాదేవీల కోసం ప్రతిరోజూ ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ఈ రెండు నగరాల మధ్య ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అయితే టెర్మినస్ నిర్మాణం కోసం అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలను వెతుక్కోవాల్సి ఉంటుందని తెలిపింది.
బీకేసీలో స్థలాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లు విలువచేసే స్థలాన్ని టెర్మినస్ కోసం ఇవ్వడం కుదరదంటూ ఎమ్మెమ్మార్డీయే తేల్చిచెప్పిన విషయం విదితమే. దీంతో బాంద్రా రైల్వే స్టేషన్‌కు, టెర్మినస్‌కు ఆనుకుని ఉన్న తమ సొంత స్థలాల్లో బులెట్ రైలు టెర్మినస్‌ను నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే ఆ స్థలం అనుకూలంగా లేకపోవడమేకాకుండా సానుకూలంగా ఉండదని భావించి..బీకేసీలోనే స్థలం కావాలని డిమాండ్ చేస్తోంది.
ఈ స్థలమిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన ఎమ్మెమ్మార్డీయే అందుకు నిరాకరిస్తోంది. టెర్మినస్ నిర్మాణానికి అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రైల్వే అధికారులు త్వరలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. అప్పటికీ ఎమ్మెమ్మార్డీయే తన పం తాన్ని వీడని పక్షంలో ఈ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించడం తప్ప మరో మార్గం లేదని రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి.