పెట్టినవి పైపు బాంబులు.. సిరియాకు ఆ ఫొటోలు!
భారతదేశంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వేళ్లూనుకోడానికి ప్రయత్నిస్తోందన్న సూచనలు ఇప్పటికే వచ్చాయి. వాటిని బలపరిచేలా మరిన్ని అంశాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైల్లో పేలుడు కోసం ఉగ్రవాదులు ఉపయోగించినవి పైపు బాంబులని, వాటి ఫొటోలను వాళ్లు సిరియాకు కూడా పంపారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అదృష్టవశాత్తు అది ఎవరికీ కనపడకుండా ఉండాలని వాళ్లు పై బెర్తులో పెట్టడంతో బాంబు పేలుడు వల్ల రైలు పైకప్పు మాత్రం ధ్వంసమైందని, అదే లోయర్ బెర్తు కింద పెట్టి ఉంటే చాలా పెద్ద నష్టమే సంభవించి ఉండేదని చౌహాన్ అన్నారు.
కాన్పూర్, కనౌజ్ల నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడ బాంబులు పెట్టిన వెంటనే లక్నో వెళ్లిపోదామని ప్లాన్ చేసుకున్నారని, వాళ్లు లక్నో నుంచి మధ్యప్రదేశ్‌కు పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారని సీఎం చౌహాన్ వివరించారు. వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల మీద 'ఐసిస్.. మేం ఇండియాలో ఉన్నాం' అని రాసి ఉందని తెలిపారు. ఉగ్రవాదులు తాము రైల్లో పెట్టిన పైపు బాంబు ఫొటోలు తీసి, వాటిని సిరియాకు పంపారని కూడా ఆయన వివరించారు. దాన్ని బట్టి చూసినా.. వాళ్లు ఐసిస్‌కు చెందినవారేనని స్పష్టం అవుతోందన్నారు.
ఉదయం 7.30 గంటల సమయంలో వాళ్లు బాంబు పెట్టి, రెండు గంటల తర్వాత పేలేలా టైం సెట్ చేశారని, మధ్యప్రదేశ్ ఏటీఎస్ బృందాలు కేంద్ర నిఘా సంస్థలను సంప్రదించి, ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పట్టుకున్నాయని ఆయన తెలిపారు. అతీఫ్ ముజఫర్ అనే వ్యక్తి కుట్రకు సూత్రధారి అని, అతడితో పాటు మహ్మద్ డానిష్, సయ్యద్ మీర్ హుస్సేన్ అనే ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకున్నారన్నారు. పేలుడు సంభవించిన కొద్దిసేపటి తర్వాత ఈ ముగ్గురినీ పిపారియా బస్ స్టాప్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రైల్లోకి అనుమానిత వస్తువులతో వీళ్లు ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాళ్ల వద్ద రైలు టికెట్లతో పాటు పేలుడుకు సంబంధించిన వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇదే పేలుడుకు సంబంధించి మరో ఉగ్రవాది సైఫుల్లా లక్నోలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన విషయం తెలిసిందే.