అక్షరం అపహాస్యం
►మొక్కుబడిగా సాక్షర భారత్ పరీక్షలు
►అన్నీ కాకి లెక్కలే..
చీరాల టౌన్ : దేశంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన వయోజన విద్యా విధానం అమలు అపహాస్యంగా మారింది. దేశవ్యాప్తంగా ఆదివారం ఎన్ఐఓఎస్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్స్ స్కూలింగ్) అక్షరాస్యతా పరీక్ష నిర్వహించారు. చీరాల నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో 268 మంది పరీక్ష రాయవలసింది. అయితే ఈ పరీక్షలు మొక్కుబడిగా కొనసాగాయి.
నియోజకవర్గంలోని 24 గ్రామ పంచాయతీల్లోని వయోజన విద్యాకేంద్రాల్లో 268 మందికిగాను 218 మంది మాత్రమే రాశారు. కొన్ని పంచాయతీల్లోని పరీక్షను మొక్కుబడిగా నిర్వహించగా మరికొన్ని చోట్ల అసలు వయోజన విద్యాకేంద్రాల్లో పరీక్షలే నిర్వహించలేదు. ఆయా గ్రామ పంచాయతీల సాక్షర భారత్ కోఆర్డినేటర్లు మొక్కుబడిగా జవాబు పత్రాలు నింపి, పరీక్షలు రాసినట్లు లెక్కలు చూపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
కొన్ని చోట్ల సాక్షర భారత్ పరీక్షను నిర్వహించకుండానే నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. వీటిని పర్యవేక్షించాల్సిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన అంగన్వాడీ టీచర్లు పత్తాలేకుండా పోయారు. గ్రామ కోఆర్డినేటర్లు రాసిన పేపర్లకు అంగన్వాడీ ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో ఆమోదం తెలిపి అన్నీ సక్రమమే అని తేల్చేశారు. నిరక్ష్యరాస్యులకు విద్యను బోధించాల్సిన కోఆర్డినేటర్లు.. చదువుకున్న వారితో పరీక్షలు రాయించి మమ అనిపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన మండల, జిల్లా కోఆర్డినేటర్లు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వయోజనా విద్యా కార్యక్రమ లక్ష్యం నీరుగారుతోంది. వయోజనులకు విద్య దూరమవుతోంది.
ఎన్ఐఓఎస్ పరీక్షకు 218 మంది హాజరు
చీరాల టౌన్ : వయోజన విద్యా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్షకు చీరాల నియోజకవర్గంలో 218 మంది హాజరయ్యారు. చీరాల మండలంలో 209 మందికిగాను 189 అభ్యాసకులు పరీక్ష రాసినట్లు సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్ జి.జగన్మోహన్రావు తెలిపారు. వేటపాలెం మండలంలోని 57 మందికిగాను 29 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరయ్యారని మండల కోఆర్డినేటర్ టి.ఎఫ్రాయిం తెలిపారు.