Tetra packs
-
‘క్రీమ్‌లైన్’ ఏటా రూ.40 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ జెర్సీ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తుల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ ఏటా రూ.30–40 కోట్ల దాకా పెట్టుబడి చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు రూ.200 కోట్లు ఖర్చు చేశామని కంపెనీ సీఈవో భూపేంద్ర సూరి వెల్లడించారు. సీవోవో ప్రమోద్ ప్రసాద్‌తో కలిసి మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ సమీపంలోని కేశవరం వద్ద ఉన్న ప్లాంటు విస్తరణకు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. టెట్రా ప్యాక్‌లో పాలు, పాల పదార్థాలు ఇక్కడ తయారవుతాయి. విస్తరణ పూర్తి అయితే ఈ కేంద్రం సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 22,000 నుంచి 70,000 లీటర్లకు చేరుతుంది. 10 ప్లాంట్లలో కలిపి రోజుకు 13.6 లక్షల లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేయగలిగే సామర్థ్యం ఉంది’ అని వివరించారు. రవాణా వ్యయాలు, పాల సేకరణ ఖర్చు అధికం అయినందున ధర పెరిగే అవకాశం ఉందన్నారు. -
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
సాక్షి, అమరావతి: టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. ఈమేరకు మహారాష్ట్రలోని పుణేలో మద్యం ప్యాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించేందుకు అడిషనల్, జాయింట్ కమిషనర్లు ఆదివారం అక్కడికి వెళ్లారు. చీప్ లిక్కర్‌ను 180 ఎం.ఎల్ ప్యాకెట్లలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలు అవుతున్న ప్యాకెట్ విధానం విజయవంతం కాకపోవడంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు పాల ప్యాకెట్ తరహా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తలుస్తోంది. -
తాగినోళ్లకి తాగినంత..
- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ - జిల్లాలో తెరుచుకుంటున్న 326 షాపులు - ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం - ఇక షాపింగ్‌మాల్స్‌లో అమ్మకాలు - అందుబాటులో టెట్రా ప్యాకెట్లు సాక్షి, విశాఖపట్నం: మద్యం షాపుల కేటాయింపు పూర్తయింది. జిల్లాలో 326 షాపులకు లెసైన్సులు వచ్చేశాయి. షాపింగ్ మాల్స్.. టెట్రా ప్యాకెట్లలో సైతం మద్యం అందుబాటులోకి రానుంది. బుధవారం నుంచి ఈ కొత్తషాపులు అందుబాటులోకి వస్తాయి. గతంలోకంటే ఈ ఏడాది మద్యంషాపుల లాటరీలోనూ.. అనంతరం భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని వల్ల అతి సామాన్యులకు కూడా మద్యం అందుబాటులోకి రానుంది. కూల్‌డ్రింక్ తాగినంత సులువుగా మద్యం తాగేందుకు వెసులుబాబు కలగనుంది. మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగింది. మద్యం షాపులు పొందిన వారికి మంగళవారం తాత్కాలిక ప్రొవిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. వీటి ద్వారా ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ముందుగా మూడవ వంతు ఫీజు చెల్లించాలనే నిబంధన మేరకు వచ్చిన ఆదాయం రూ.47.66 కోట్లు. మద్యం షాపులు దక్కించుకున్నవారికి అధికారులు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేశారు. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. ఒకటి కంచరపాలెంలో ఉండగా, రెండవది నరవ సమీపంలోని జెర్రిబోతులపాలెంలో ఉంది. మద్యం షాపులకు అవసరమైన మేరకు ఇక్కడ సరుకు అందుబాటులో ఉంచామని ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. తాత్కాలిక లెసైన్సు పొందిన వారు 15 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీలు చూపించి రెండేళ్ల కాలానికి లెసైన్సు పొందవచ్చు. ఈ ఏడాది నుంచి కొత్తగా షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాల నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా షాపింగ్ మాల్స్‌లోనూ తాగుబోతుల బెడద ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మద్యం షాపులు నడపడంతోపాటు ప్రతి ప్రైవేటు షాపులోనూ టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించింది. కేవలం రూ.20, రూ.30లో ప్యాకెట్లు లభించనుండటంతో చేతిలో ఆ మాత్రం చిల్లర ఉన్నవారెవరైనా మద్యం దుకాణాల వైపు అడుగులేసే అవకాశం ఉంది. సామాన్యుల ఇల్లు, ఒళ్లు గుల్లచేసి ఖజానా నింపుకుందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా నేతలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.