తాగినోళ్లకి తాగినంత.. | Alcohol shops allocation has been completed | Sakshi
Sakshi News home page

తాగినోళ్లకి తాగినంత..

Published Wed, Jul 1 2015 4:18 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

తాగినోళ్లకి తాగినంత.. - Sakshi

తాగినోళ్లకి తాగినంత..

- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
- జిల్లాలో తెరుచుకుంటున్న 326 షాపులు
- ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం
- ఇక షాపింగ్‌మాల్స్‌లో అమ్మకాలు
- అందుబాటులో టెట్రా ప్యాకెట్లు
సాక్షి, విశాఖపట్నం:
మద్యం షాపుల కేటాయింపు పూర్తయింది. జిల్లాలో 326 షాపులకు లెసైన్సులు వచ్చేశాయి. షాపింగ్ మాల్స్.. టెట్రా ప్యాకెట్లలో సైతం మద్యం అందుబాటులోకి రానుంది. బుధవారం నుంచి ఈ కొత్తషాపులు అందుబాటులోకి వస్తాయి. గతంలోకంటే ఈ ఏడాది మద్యంషాపుల లాటరీలోనూ.. అనంతరం భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని వల్ల అతి సామాన్యులకు కూడా మద్యం అందుబాటులోకి రానుంది. కూల్‌డ్రింక్ తాగినంత సులువుగా మద్యం తాగేందుకు వెసులుబాబు కలగనుంది. మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగింది. మద్యం షాపులు పొందిన వారికి మంగళవారం తాత్కాలిక ప్రొవిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చారు.

జిల్లాలో మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. వీటి ద్వారా ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ముందుగా మూడవ వంతు ఫీజు  చెల్లించాలనే నిబంధన మేరకు వచ్చిన ఆదాయం రూ.47.66 కోట్లు. మద్యం షాపులు దక్కించుకున్నవారికి అధికారులు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేశారు. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. ఒకటి కంచరపాలెంలో ఉండగా, రెండవది నరవ సమీపంలోని జెర్రిబోతులపాలెంలో ఉంది. మద్యం షాపులకు అవసరమైన మేరకు ఇక్కడ సరుకు అందుబాటులో ఉంచామని ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు.

తాత్కాలిక లెసైన్సు పొందిన వారు 15 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీలు చూపించి రెండేళ్ల కాలానికి లెసైన్సు పొందవచ్చు. ఈ ఏడాది నుంచి కొత్తగా షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాల నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా షాపింగ్ మాల్స్‌లోనూ తాగుబోతుల బెడద ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మద్యం షాపులు నడపడంతోపాటు ప్రతి ప్రైవేటు షాపులోనూ టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించింది. కేవలం రూ.20, రూ.30లో ప్యాకెట్లు లభించనుండటంతో చేతిలో ఆ మాత్రం చిల్లర ఉన్నవారెవరైనా మద్యం దుకాణాల వైపు అడుగులేసే అవకాశం ఉంది. సామాన్యుల ఇల్లు, ఒళ్లు గుల్లచేసి ఖజానా నింపుకుందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా నేతలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement