సర్వీస్ బకాయిలపై ‘ఎక్సైజ్’ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: పులి మీద పుట్రలా వచ్చి పడుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల బకాయిల దెబ్బతో ఎక్సైజ్ శాఖ తర్జనభర్జన పడుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం తయారీ, విక్రయాలు, బాట్లింగ్‌లకు సంబంధించిన సేవా పన్నును 2010 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చెల్లించలేదని సెంట్రల్ ఎక్సైజ్ తేల్చింది. ఈ సేవా పన్ను రెండు రాష్ట్రాలకు వర్తింపజేసేందుకు రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఆదాయపు పన్ను విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో విధించిన పన్నులను వసూలు చేసినట్టే ఇప్పుడు కూడా తమనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. ఏపీబీసీఎల్‌కు కొనసాగింపుగా టీఎస్‌బీసీఎల్ అని సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చి బకాయిలను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వసూలు చేయాలని సెంట్రల్ ఎక్సైజ్ భావిస్తోందని ఆరోపిస్తోంది.
ఏపీబీసీఎల్ సంస్థ లేనప్పుడు దాని నుంచి బకాయిలు వసూలు చేయలేం కాబట్టి,అందుకు ప్రత్యామ్నాయంగా వచ్చిన టీఎస్‌బీసీఎల్ నుంచి పొందేలా కేంద్ర పన్నుల సంస్థ ప్రణాళికలు వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దీని నుంచి బయట పడేందుకు ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో చర్చలు జరిపింది.
ఉదయం నుంచి ఇదే పనిలో
ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, టీఎస్‌బీసీఎల్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ సురేష్ ఓట్కర్, మరో జీఎం సంతోష్ రెడ్డి తదితరులు రోజంతా సమావేశాలతో బిజీగా గడిపారు. ఆదాయపు పన్ను కేసులను పరిశీలిస్తున్న ఇతర కన్సల్టెన్సీలతో పాటు లాయర్లతో కూడా సమావేశ మయ్యారు. సర్వీస్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆబ్కారీ భవన్‌కు పిలిపించిన కమిషనర్ చంద్రవదన్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, ప్రభుత్వ నేతృత్వంలో పనిచేసే కార్పొరేషన్‌ల విధివిధానాలను వివరించారు.
ఆ చట్టంలోని 9,10 షెడ్యూళ్ల బాధ్యతలు చూస్తున్న షీలాభిడేతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపినట్లు సమాచారం. సాంకేతిక కారణాలను చూపి ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని పన్నుల భారాన్ని తెలంగాణపై వేసేలా వ్యవహరిస్తోందని, దీనిపై స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదాయపన్ను శాఖ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 1,274 కోట్లను లాగేసుకొని ఏపీ ప్రభుత్వం జోలికి వెళ్లలేదని తెలంగాణ ప్రభుత్వం షిలాభిడేకి తెలియజేసింది.
సర్వీస్ టాక్స్ విషయంలో తెలంగాణ, ఏపీ వాటాలను విభజించాలని, జనాభా ప్రాతిపదికన ఏ కార్పొరేషన్ ఎంత చెల్లించాలో తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , అడ్వొకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.