మద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనను నిరోధించడంతో పాటు, అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ‘లిక్కర్ ప్రైస్’అనే కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో కలసి ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 880 లిక్కర్ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సీసా మీద ఎంత ఎమ్మార్పీ ఉంది? క్వాటర్‌కు ఎంత? ఫుల్ బాటిల్‌కు ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒక వేళ దుకాణదారు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 7989111222కు గానీ, 18004252523 టోల్ ఫ్రీ నంబర్‌కుకానీ ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత సమయం దాటిన తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా కూడా ఈ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలను, 5 బీరు బ్రాండ్ల ధరలను దుకాణాలవద్ద ప్రామాణిక పట్టిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఎమ్మార్పీ ఉల్లంఘనలను పూర్తిగా నిరోధించవచ్చని పద్మారావు గౌడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment