మద్యం పాలసీని అమలు చేయగలమా?
ఎక్సైజ్‌శాఖ తర్జనభర్జన
కీలకపోస్టుల్లో ఇన్‌చార్జీల పాలన
220 ఎస్‌ఐ, 340 కానిస్టేబుళ్లను నియమించాలని వినతి
హైదరాబాద్: తెలంగాణ పల్లెల్లో గుడుంబాను అరికట్టి దానిస్థానంలో చీప్‌లిక్కర్‌ను తీసుకొచ్చేందుకు రూపొందిస్తున్న మద్యం పాలసీ విధివిధానాల కోసం ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత దృష్ట్యా మద్యం పాలసీని తక్షణం అమలు చేయగలమా? అనే సందేహం ఎక్సైజ్‌శాఖను పట్టి పీడిస్తోంది. మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లను జారీ చేసి, సదరు లెసైన్స్‌దారునికే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా యూనిట్‌గా ఉన్నప్పుడే నకిలీమద్యం, అధిక ధరలను నియంత్రించలేకపోయిందనే అపఖ్యాతి మూటగట్టుకున్న ఎక్సైజ్‌శాఖ, చీప్‌లిక్కర్ పాలసీని మండల, గ్రామస్థాయిలో ఎలా పర్యవేక్షిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.
వేధిస్తున్న సిబ్బంది కొరత!
ఖజానాకు భారీగా ఆదాయాన్ని సాధించిపెట్టే శాఖల్లో ప్రధానమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఏడాదిగా ఇన్‌చార్జీల పాలన కొనసాగుతోంది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు దాదాపు 200 పోస్టుల్లో అధికారులు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అడిషనల్ కమిషనర్, రెండు జాయింట్ కమిషనర్, మూడు డిప్యూటీ కమిషనర్ పోస్టులతోపాటు 12 అసిస్టెంట్ సూపరింటెండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 45మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లలో 15 ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో మూడు జిల్లా ఎస్పీ పోస్టులు ఉండగా.. ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి పోస్టులు ప్రమోషన్లతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ ఏడాదికాలంగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే 220 ఎస్సై, 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది.