బార్ల పాలసీ వాయిదా!
- సర్కార్‌కు ఆబ్కారీ శాఖ సిఫారసు... త్వరలో ఉత్తర్వులు
- సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు ప్రయత్నాల్లో భాగంగానే వాయిదా
సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి అమల్లోకి రానున్న‘2016-17 బార్ల పాలసీ’ నెలరోజుల పాటు వాయిదా పడనుంది. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నూతన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనల నుంచి మినహాయింపు పొందే చర్యల్లో భాగంగా బార్ల పాలసీని వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న బార్ల లెసైన్సులను మరో నెలరోజుల పాటు రెన్యువల్ చే యాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ప్రభుత్వానికి సోమవారం సిఫారసు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావలసి ఉంది.
లెసైన్సు ఫీజుల మీద పన్ను భారంతోనే!: కేంద్ర ప్రభుత్వ నూతన సర్వీస్‌ట్యాక్స్ నిబంధనల్లో భాగంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జరిగే ఎలాంటి సేవకైనా కేంద్రానికి 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1 నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో బార్ల పాలసీని ప్రకటిస్తే లెసైన్సు ఫీజుల రూపంలో వసూలు చేసే వందల కోట్ల రూపాయల నుంచి కేంద్రానికి 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్వీస్ ట్యాక్స్ వర్తించకుండా ఎక్సైజ్ చట్టంలోనే మార్పులు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో బార్ల పాలసీని ప్రకటించి నష్టపోకూడదని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా గత శనివారం ఆబ్కారీ శాఖ కమిషనర్‌ను వివరణ కోరుతూ లేఖ రాశారు. బార్ల లెసైన్సు ఫీజులు, బార్ల కొత్త పాలసీకి సంబంధించి ఏంచేయాలన్న విషయమై తగిన సిఫారసులు పంపాలని కోరారు. ఈ మేరకు సోమవారం కమిషనర్ చంద్రవదన్ టీఎస్‌బీసీఎల్ జీఎం సంతోష్‌రెడ్డితో కలసి అజయ్ మిశ్రాతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొనసాగుతున్న 804 బార్ల లెసైన్సులను నెలరోజుల పాటు పొడిగిస్తూ రెన్యువల్ చేయాలని సూచించినట్లు తెలిసింది.
ఫీజులను పన్నులుగా మార్చేందుకు కసరత్తు: సర్కార్‌కు భారీగా ఆదాయాన్నిచ్చే ఆబ్కారీ శాఖను పన్నుభారం నుంచి కాపాడేందుకు ఆబ్కారీ చట్టానికే మార్పులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులను పన్నులుగా మారుస్తూ కొత్త చట్టం రూపొందించే పనిలో ఉన్నారు. జూలై నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేస్తే ఆగస్టు నుంచి కొత్త బార్ల పాలసీ అమలులోకి రానుంది.