ముందుగానే శీతాకాల సమావేశాలు!
- నవంబర్ మొదట్లోనే నిర్వహించే యోచన
- జీఎస్‌టీ ఆమోదమే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ని ఏప్రిల్ 1 నుంచే అమలులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జీఎస్‌టీ మద్దతు బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను పక్షం రోజులు ముందుగానే, అంటే నవంబర్ మొదట్లోనే ప్రారంభించాలని అనుకుంటోంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబరు మూడవ లేదా నాల్గవ వారంలో ప్రారంభమవుతాయి. సీజీఎస్‌టీ (సెంట్రల్ జీఎస్‌టీ), ఐజీఎస్‌టీ (ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ) బిల్లులు వీలైనంత త్వరగా పార్లమెంట్ ఆమోదం పొందితే, నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారానికల్లా జీఎస్‌టీకి మార్గం సుగమం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
జీఎస్‌టీ కోసం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతుగా సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీ బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. జీఎస్‌టీ కోసం పార్లమెంటు ఆమోదించిన రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారేందుకు 31 రాష్ట్రాలలో సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పటికే పలు రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ రెండోవారం కల్లా మిగిలిన శాసనసభలు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే అవకాశాలున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.