‘సాఫ్ట్’ రంగంపై ‘సేవా’ కన్ను | The central government under the service tax department | Sakshi
Sakshi News home page

‘సాఫ్ట్’ రంగంపై ‘సేవా’ కన్ను

Published Thu, Dec 3 2015 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

‘సాఫ్ట్’ రంగంపై ‘సేవా’ కన్ను - Sakshi

‘సాఫ్ట్’ రంగంపై ‘సేవా’ కన్ను

సాక్షి, హైదరాబాద్: నగరంలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సేవల పన్ను విభాగం కన్నేసింది. మల్టీ నేషనల్ కంపెనీలు విదేశాల నుంచి పొందుతున్న సర్వీసులకు సంబంధించి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఆదాయపు పన్ను శాఖకు ఆయా కంపెనీలు సమర్పించిన వార్షిక నివేదికల్ని పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ కమిషనరేట్ లోతుగా ఆరా తీస్తోంది. రివర్స్ చార్జ్ మెకానిజం ప్రకారం లెక్కలేస్తున్న అధికారులు అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు రూ.వందల కోట్లు బకాయిపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. త్వరలోనే కొన్ని సంస్థలకు తాఖీదులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 వాణిజ్య సేవలపై 14 శాతం పన్ను...
 వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ కేంద్రం విధించే సేవల పన్ను పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సంస్థలు, హోటళ్లు తదితర సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా సర్వీసు ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సేవల పన్ను విభాగానికి చెల్లించాలి. ఈ పన్ను గత ఆర్థిక సంవత్సరం వరకు 12.36 శాతం ఉండగా... ఈ ఏడాది నుంచి 14 శాతానికి పెరిగింది. హైదరాబాద్, సైబరాబాదుల్లో అనేక స్థానిక, మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. కొన్నేళ్లుగా దేశవిదేశాల్లోని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వివిధ రకాలైన సేవలు అందించడం (సర్వీస్ ఎక్స్‌పోర్ట్) ద్వారా వ్యాపారం కొనసాగిస్తున్న ఈ సంస్థలకు పన్ను మినహాయింపు ఉంది. సాఫ్ట్‌వేర్ రంగ ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

 రివర్స్ చార్జ్ మెకానిజం వర్తిస్తుందని...
 దేశంలో ఉన్న సంస్థ విదేశాల్లో ఉన్న కంపెనీల నుంచి వాణిజ్య అవసరాలకు సేవలు పొందితే... సేవల పన్నును విదేశీ సంస్థ చెల్లించాలి. అయితే ఇది ప్రాక్టికల్‌గా సాధ్యం కాని నేపథ్యంలోనే సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రివర్స్ చార్జ్ మెకానిజం వర్తింపజేస్తుంది. దీనిప్రకారం విదేశీ సంస్థ నుంచి సేవలు పొందే దేశీయ సంస్థే సేవా పన్ను మొత్తాన్ని తాను చేస్తున్న చెల్లింపుల నుంచి మినహాయించి, దాన్ని సర్వీస్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు జమ చేయడం కచ్చితం చేశారు. దీని విధానం ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్‌ల్లోని అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు సేవల పన్ను పరిధిలోకి వస్తాయని కమిషనరేట్ గుర్తించింది. ‘గ్రేటర్’లో ఉన్న సంస్థల జాబితాను సేకరించిన సర్వీస్ ట్యాక్స్ అధికారులు అధ్యయనం ప్రారంభించారు.
 
 తాఖీదులు ఇవ్వడానికి సన్నాహాలు...

  కొన్ని  కంపెనీల ఐటీ రిటర్స్న్‌ను పరిశీలించిన అధికారులు రివర్స్ చార్జ్ మెకానిజం పద్ధతిలో రూ.వందల కోట్లు సర్వీసు ట్యాక్స్ బకాయి ఉన్నట్లు గుర్తించారు. వీటికి పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ తాఖీదులు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్థిక చట్ట ప్రకారం రూ.50 లక్షల కంటే ఎక్కువ సర్వీసు ట్యాక్స్ బకాయి ఉన్న సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడానికి, అనుమతులతో అరెస్టు చేయడానికి సేవలపన్ను విభాగానికి అధికారం ఉంది. ఈ విషయాన్నీ తాఖీదుల్లో కంపెనీల దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement