T.G venkatesh
-
వలస నేతలు.. ఓటమిపాలు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: అధికార దాహంతో కండువాలు మార్చే నేతలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయించిన నాయకులు రాష్ట్ర విభజనలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీలో ఉంటే మనుగడ లేదనే అంచనాకు వచ్చిన పలువురు నేతలు ‘పచ్చ’ పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి ఈ కోవలోనే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం తాము చెప్పాలనుకున్న తీర్పును చెప్పేశారు. కర్నూలులో తనకు ఎదురు లేదని భావించిన మాజీ మంత్రి టీజీ.. వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్వీ మోహన్‌రెడ్డి చేతిలో 3,685 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. శ్రీశైలం నియోజకవర్గాన్ని వీడి పాణ్యంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన మరో మాజీ మంత్రి ఏరాసు కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు. పాణ్యం వైఎస్సార్సీపీ అభ్యర్థి గౌరు చరిత ఆయనపై 11,661 ఓట్ల తేడాతో గెలుపొందారు. నంద్యాలలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 2,973 ఓట్ల తేడాతో శిల్పాను మట్టికరిపించారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఐజయ్య చేతిలో 21,705 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన తిక్కారెడ్డిని అక్కడి ఓటర్లు ఆదరించలేదు. మొన్న టి వరకు కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో నిలిచిన తిక్కారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి చేతిలో 7,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన ప్రజాగర్జనలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన కూడా ఆళ్లగడ్డలో ఓటమిని తప్పించుకోలేకపోయారు. వైఎస్ఆర్సీపీ తరఫున బరిలో నిలిచిన దివగంత నేత భూమా శోభానాగిరెడ్డి ఇక్కడ 15,158 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ స్వార్థంతో పార్టీలు మారిస్తే ప్రజలు ఆదరించరని ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. -
గోడ మీద పిల్లులు.. బిల్లుపైనే ఆశలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్, టీడీపీ నేతల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారే విషయమై తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్న నిర్ణయం వీరిని డైలమాలో పడేసింది. రాష్ట్రాన్ని ముక్కలు చేసే పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్‌లో కొనసాగేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. వీరంతా పక్క చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా మోహ న్‌రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. మంత్రులు టీజీ, ఏరాసు, ఎమ్మెల్యేలు కాటసాని, లబ్బివెంకటస్వామి, నీరజారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డిలు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపైనా హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు జనవరి 17, 23 తేదీలను ముహూర్తాలుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు, తాను సమైక్య హీరోను అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగడలో ఆ పార్టీ జిల్లా నాయకులు సైతం చిక్కుకున్నారు. ఫలితంగా పార్టీ మారాలని భావించిన వీరి అంచనాలు తలకిందులయ్యాయి. దిక్కుతోచని పరిస్థితిలో కిరణ్‌తో పాటు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలంతా ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో టీ బిల్లు పాస్ చేస్తారా, లేదా అనే విషయంపైనే వీరి భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇదిలాఉంటే కొద్ది రోజులుగా సీఎం కిరణ్ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చర్చ కూడా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను సందిగ్ధంలోకి నెట్టుతోంది. రోజురోజుకు మారుతున్న పరిణామాలతో కాంగ్రెస్ నేతలు డైలమాలో కొట్టుమిట్లాడుతున్నారు. టీడీపీలో గుబులు అధినేత చంద్రబాబు నాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో జిల్లాలో దాదాపు కనుమరుగైన పార్టీకి ఊపిరి పోసేందుకు రాష్ట్రస్థాయి నేతలు పథకం రచించారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో గోద మీద పిల్లుల్లా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను గుర్తించి మంతనాలు సాగించారు. బేరసారాలతో దారిలోకి తెచ్చుకున్నట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామం తెలుగుతమ్ముళ్లను మరోసారి నైరాశ్యంలోకి నెట్టింది. రాష్ట్రం విడిపోతే లాభపడవచ్చని భావించిన వీరు ప్రస్తుతం ఢిల్లీ తీర్పు కోసం వేచిచూస్తున్నారు. కర్నూలులో కాలుదువ్వుతున్న విష్ణు కాంగ్రెస్, టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే.. మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలో దుర్వాసన కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై పోరాటానికి సిద్ధమయ్యారు. మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన పరిశ్రమలే ఇందుకు కారణమంటూ ఆయన హైదరాబాద్ స్థాయిలో తన వాణి వినిపించారు. ఆ తర్వాత కూడా ప్రజాగ్రహాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు విష్ణు తెర వెనుక పావులు కదుపుతున్నారు. -
కార్యాలయాన్నే తగులబెట్టించావు
ఎంపీ టిక్కెట్ రాలేదనే అక్కసుతో సొంత పార్టీ కార్యాలయాన్నే తగులబెట్టించిన సంస్కృతి నీదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టి.జి.వెంకటేష్ మండిపడ్డారు. ఆదివారం కర్నూలులో మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి చేసిన విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. కోట్ల అభద్రతా భావానికి లోనవుతున్నారన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయనకు ఓట్లు పడవని.. గెలవడం కష్టమవుతుందని భావించి ఎవరుపడితే వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పార్టీ వీడతానన్న మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ప్రజల మనోభావాలే ముఖ్యం తప్ప పార్టీ కాదని తేల్చి చెప్పారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలు ఆ శాఖ మంత్రిగా తన చేతుల మీదుగా జరగడం సహజమని, అది ఆయనకు సంబంధించిన విషయం కాదని ఒక ప్రశ్నకు సమాదానంగా బదులిచ్చారు. ఒకవేళ ఆయనను(కోట్ల) పిలిచినా పెద్దగా స్పందించడన్నారు. కార్యక్రమానికి పిలవలేదని అధికారులను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారని, ఈ మేరకు పలువురు అధికారులతో తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. అధికారుల వద్ద పెద్ద తరహాగా ఉండాలే తప్ప గౌరవం పోగొట్టుకునేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. -
ఆరోగ్యశ్రీ నిధులే‘పెద్ద’ దిక్కు
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఆరోగ్యశ్రీ నిధులే పెద్ద దిక్కయ్యాయి. శనివారం ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు అధ్యక్షతన ఆసుపత్రిలోని మోర్టాన్హాలులో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఆసుపత్రిలో రోజువారీ నిర్వహణ పనులకు అధిక ప్రాధాన్యతనిచ్చి మరమ్మతులు చేయించాలని సూచించారు. పారిశుద్ధ్యం మెరుగు పరచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ నిధులతో పెద్ద భవనాలు నిర్మించకుండా నిర్వహణ పనులకు ప్రాధాన్యక్రమంలో అమలు చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఏపీఎంఎస్ఐడిసి ఈఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్యాలమ్మ సత్రం నుంచి ఆదాయం చాలా తక్కువగా వస్తోందని, వెంటనే కమిటీని పిలిపించి మాట్లాడి అద్దెలు పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లోని గదులన్నీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని నాలుగు గేట్ల ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీ వెళ్లడానికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసి 15 రోజుల్లో కమిటీకి సమర్పించాలని ఈఈకి సూచించారు. ఆసుపత్రిలో షైన్శాంతి ద్వారా ఆరోగ్యశ్రీ నిర్వహణ సరిగ్గా లేదని, వెంటనే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి టెండర్లను పిలవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ఉమామహేశ్వర్‌కు జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జీఎస్ రాంప్రసాద్, ఆర్ఎంవో శివప్రసాద్, వైద్యులు జోజిరెడ్డి, శంకరశర్మ, శ్రీహరి, విజయశంకర్, జిక్కి, ఏడీ మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ అధికారులే మేలు..
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘కర్నూలు జిల్లాలో అధికారులు పనులు చేయరేమోగానీ హైదరాబాద్‌లో నాకు బాగా పనులవుతాయి. మీకేదైనా కావాలంటే నన్ను ఉపయోగించుకోండి’ అంటూ రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ మరోసారి జిల్లా అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్క్లబ్లోని యోగా, ధ్యాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా అధికారులపై తన అక్కసును వెళ్లబోసుకున్నారు. అవుట్డోర్ స్టేడియంలో రూ.25లక్షలతో మరమ్మతులు చేశారని, అవి చాలా నాసిరకంతో ఉన్నాయన్నారు. వెంటనే ఆ పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లు ఆపేయాలని అధికారులను ఆదేశించారు. తాను చిన్నతనంలో కర్రసాము, యోగాభ్యాసం చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. కర్నూలు నగరంలో 12 చోట్ల యోగా, ధ్యాన కేంద్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాయకులను ప్రజలు బలోపేతం చేస్తే ప్రభుత్వం నుంచి పనులు, నిధులు కూడా అలాగే తీసుకొస్తామని చెప్పారు. డీఐజీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. యోగా, ధ్యాన కేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే విధంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వారు ఇలాంటి ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ భవానీప్రసాద్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తొందరపాటుకు గురయ్యారు. రహదారి వెడల్పు పనుల్లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్థానచలనం చెందిన గాంధీ విగ్రహం మార్పు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అయితే విగ్రహం తరలింపు కార్యక్రమం అప్పటికి పూర్తికాలేదు. అయినా సరే తాను ప్రారంభించి వెళతానని మంత్రి పట్టుబట్టి మరీ విగ్రహానికి పూలదండ వేసి మరీ వెళ్లడం చర్చనీయాంశమైంది.