కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఆరోగ్యశ్రీ నిధులే పెద్ద దిక్కయ్యాయి. శనివారం ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు అధ్యక్షతన ఆసుపత్రిలోని మోర్టాన్‌హాలులో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ హాజరయ్యారు. ఆసుపత్రిలో రోజువారీ నిర్వహణ పనులకు అధిక ప్రాధాన్యతనిచ్చి మరమ్మతులు చేయించాలని సూచించారు.
పారిశుద్ధ్యం మెరుగు పరచాలని సూచించారు. ఆరోగ్యశ్రీ నిధులతో పెద్ద భవనాలు నిర్మించకుండా నిర్వహణ పనులకు ప్రాధాన్యక్రమంలో అమలు చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని ఏపీఎంఎస్‌ఐడిసి ఈఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్యాలమ్మ సత్రం నుంచి ఆదాయం చాలా తక్కువగా వస్తోందని, వెంటనే కమిటీని పిలిపించి మాట్లాడి అద్దెలు పెంచాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సూచించారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లోని గదులన్నీ ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు.
కోడుమూరు ఎమ్మెల్యే మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఆసుపత్రిలోని నాలుగు గేట్ల ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీ వెళ్లడానికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసి 15 రోజుల్లో కమిటీకి సమర్పించాలని ఈఈకి సూచించారు. ఆసుపత్రిలో షైన్‌శాంతి ద్వారా ఆరోగ్యశ్రీ నిర్వహణ సరిగ్గా లేదని, వెంటనే ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి టెండర్లను పిలవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. ఉమామహేశ్వర్‌కు జాయింట్ కలెక్టర్ కన్నబాబు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ జీఎస్ రాంప్రసాద్, ఆర్‌ఎంవో శివప్రసాద్, వైద్యులు జోజిరెడ్డి, శంకరశర్మ, శ్రీహరి, విజయశంకర్, జిక్కి, ఏడీ మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ నిధులే‘పెద్ద’ దిక్కు
Published Sun, Nov 10 2013 3:07 AM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM
Advertisement