సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాంగ్రెస్, టీడీపీ నేతల్లో సందిగ్ధం నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారే విషయమై తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్న నిర్ణయం వీరిని డైలమాలో పడేసింది. రాష్ట్రాన్ని ముక్కలు చేసే పాపం మూటగట్టుకున్న కాంగ్రెస్‌లో కొనసాగేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. వీరంతా పక్క చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శిల్పా మోహ న్‌రెడ్డి మొదటి వరుసలో ఉన్నారు. మంత్రులు టీజీ, ఏరాసు, ఎమ్మెల్యేలు కాటసాని, లబ్బివెంకటస్వామి, నీరజారెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డిలు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది.
ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపైనా హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు జనవరి 17, 23 తేదీలను ముహూర్తాలుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు, తాను సమైక్య హీరోను అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి వేసిన ఎత్తుగడలో ఆ పార్టీ జిల్లా నాయకులు సైతం చిక్కుకున్నారు. ఫలితంగా పార్టీ మారాలని భావించిన వీరి అంచనాలు తలకిందులయ్యాయి. దిక్కుతోచని పరిస్థితిలో కిరణ్‌తో పాటు ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర నేతలంతా ‘జై సమైక్యాంధ్ర’ నినాదాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో టీ బిల్లు పాస్ చేస్తారా, లేదా అనే విషయంపైనే వీరి భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇదిలాఉంటే కొద్ది రోజులుగా సీఎం కిరణ్ పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చర్చ కూడా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను సందిగ్ధంలోకి నెట్టుతోంది. రోజురోజుకు మారుతున్న పరిణామాలతో కాంగ్రెస్ నేతలు డైలమాలో కొట్టుమిట్లాడుతున్నారు.
టీడీపీలో గుబులు
అధినేత చంద్రబాబు నాయుడు రెండుకళ్ల సిద్ధాంతంతో జిల్లాలో దాదాపు కనుమరుగైన పార్టీకి ఊపిరి పోసేందుకు రాష్ట్రస్థాయి నేతలు పథకం రచించారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌లో గోద మీద పిల్లుల్లా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను గుర్తించి మంతనాలు సాగించారు. బేరసారాలతో దారిలోకి తెచ్చుకున్నట్లు పార్టీ వర్గీయుల్లో చర్చ జరిగింది. అసెంబ్లీలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ పరిణామం తెలుగుతమ్ముళ్లను మరోసారి నైరాశ్యంలోకి నెట్టింది. రాష్ట్రం విడిపోతే లాభపడవచ్చని భావించిన వీరు ప్రస్తుతం ఢిల్లీ తీర్పు కోసం వేచిచూస్తున్నారు.
కర్నూలులో కాలుదువ్వుతున్న విష్ణు
కాంగ్రెస్, టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే.. మాజీ ఎంపీపీ ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నగరంలో దుర్వాసన కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై పోరాటానికి సిద్ధమయ్యారు. మంత్రి టీజీ వెంకటేష్‌కు చెందిన పరిశ్రమలే ఇందుకు కారణమంటూ ఆయన హైదరాబాద్ స్థాయిలో తన వాణి వినిపించారు. ఆ తర్వాత కూడా ప్రజాగ్రహాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు విష్ణు తెర వెనుక పావులు కదుపుతున్నారు.
గోడ మీద పిల్లులు.. బిల్లుపైనే ఆశలు
Published Sun, Feb 9 2014 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement