వలస నేతలు.. ఓటమిపాలు | congress party got nill seats in kurnool district | Sakshi
Sakshi News home page

వలస నేతలు.. ఓటమిపాలు

Published Sat, May 17 2014 1:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

congress party got nill seats in kurnool district

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: అధికార దాహంతో కండువాలు మార్చే నేతలకు ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయించిన నాయకులు రాష్ట్ర విభజనలో తమ వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీలో ఉంటే మనుగడ లేదనే అంచనాకు వచ్చిన పలువురు నేతలు ‘పచ్చ’ పార్టీలో చేరిపోయారు. రాష్ట్ర మాజీ మంత్రులు టి.జి.వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌రెడ్డి, లబ్బి వెంకటస్వామి ఈ కోవలోనే కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పేశారు.
 
 అయినప్పటికీ ప్రజలు మాత్రం తాము చెప్పాలనుకున్న తీర్పును చెప్పేశారు. కర్నూలులో తనకు ఎదురు లేదని భావించిన మాజీ మంత్రి టీజీ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎస్‌వీ మోహన్‌రెడ్డి చేతిలో 3,685 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. శ్రీశైలం నియోజకవర్గాన్ని వీడి పాణ్యంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించిన మరో మాజీ మంత్రి ఏరాసు కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు. పాణ్యం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గౌరు చరిత ఆయనపై 11,661 ఓట్ల తేడాతో గెలుపొందారు.
 
 నంద్యాలలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి 2,973 ఓట్ల తేడాతో శిల్పాను మట్టికరిపించారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి.. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఐజయ్య చేతిలో 21,705 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన తిక్కారెడ్డిని అక్కడి ఓటర్లు ఆదరించలేదు. మొన్న టి వరకు కాంగ్రెస్‌లో ఉంటూ ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం పుచ్చుకుని అసెంబ్లీ బరిలో నిలిచిన తిక్కారెడ్డి కూడా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి చేతిలో 7,396 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
 
 ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డి సైతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన ప్రజాగర్జనలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన కూడా ఆళ్లగడ్డలో ఓటమిని తప్పించుకోలేకపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున బరిలో నిలిచిన దివగంత నేత భూమా శోభానాగిరెడ్డి ఇక్కడ 15,158 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ స్వార్థంతో పార్టీలు మారిస్తే ప్రజలు ఆదరించరని ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement