కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ‘కర్నూలు జిల్లాలో అధికారులు పనులు చేయరేమోగానీ హైదరాబాద్‌లో నాకు బాగా పనులవుతాయి. మీకేదైనా కావాలంటే నన్ను ఉపయోగించుకోండి’ అంటూ రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ మరోసారి జిల్లా అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎ.క్యాంపులోని హెల్త్‌క్లబ్‌లోని యోగా, ధ్యాన కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా అధికారులపై తన అక్కసును వెళ్లబోసుకున్నారు. అవుట్‌డోర్ స్టేడియంలో రూ.25లక్షలతో మరమ్మతులు చేశారని, అవి చాలా నాసిరకంతో ఉన్నాయన్నారు.
వెంటనే ఆ పనులను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లు ఆపేయాలని అధికారులను ఆదేశించారు. తాను చిన్నతనంలో కర్రసాము, యోగాభ్యాసం చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. కర్నూలు నగరంలో 12 చోట్ల యోగా, ధ్యాన కేంద్రాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. నాయకులను ప్రజలు బలోపేతం చేస్తే ప్రభుత్వం నుంచి పనులు, నిధులు కూడా అలాగే తీసుకొస్తామని చెప్పారు. డీఐజీ మురళీకృష్ణ మాట్లాడుతూ.. యోగా, ధ్యాన కేంద్రాల ఏర్పాటుతో ప్రజలకు ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే విధంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వారు ఇలాంటి ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ సెక్రటరీ డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ భవానీప్రసాద్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ తొందరపాటుకు గురయ్యారు. రహదారి వెడల్పు పనుల్లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్థానచలనం చెందిన గాంధీ విగ్రహం మార్పు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అయితే విగ్రహం తరలింపు కార్యక్రమం అప్పటికి పూర్తికాలేదు. అయినా సరే తాను ప్రారంభించి వెళతానని మంత్రి పట్టుబట్టి మరీ విగ్రహానికి పూలదండ వేసి మరీ వెళ్లడం చర్చనీయాంశమైంది.
హైదరాబాద్ అధికారులే మేలు..
Published Sun, Nov 10 2013 3:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement