ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ
► అందుకు అందరం భాగస్వాములవుదాం: హరీశ్
► దేవీప్రసాద్‌కు ఘన సత్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం కోసం పోరాడిన స్ఫూర్తితో ఉద్యోగులందరం కలసి సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణను సాధిం చుకుందామని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కలసికట్టుగా కృషిచేసి, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసుకుందామన్నారు. తెలంగాణ నాన్గెజిటె డ్ అధికారుల కేంద్ర సంఘం (టీఎన్జీఓ) గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుక్రవారం రవీంద్రభారతిలో ఆయన్ను సన్మానించారు.
పదవి పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదని, ఉద్యమంలో దేవీ ప్రసాద్ పోరాటానికి మించిన పదవి ఏదీ ఉండదని హరీశ్ అన్నారు. ఉద్యమ కాలంలో స్వామి గౌడ్, దేవీప్రసాద్, శ్రీని వాస్‌గౌడ్, విఠల్ చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. ఉద్యమంలో ముందున్న అన్ని వర్గాలు, విభాగాల వారిని సీఎం కేసీఆర్ దశలవారీగా సముచిత స్థానం కల్పించి గౌరవించుకొంటున్నారని చెప్పారు.
టీఎన్జీవోస్ని ఏకతాటిపైన నడిపిన ఘనత దేవీప్రసాద్దే అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి న్నారు. మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, ఎంపీ పల్లా రాజేశ్వర్, ఎమ్మెల్యేలు శ్రీని వాస్ గౌడ్, బాబూమోహన్, ఎమ్మెల్సీలు పురా ణం సతీష్, గంగాధర్, సాహిత్య అకాడమీ చైర్మన్ సిధారెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్ సభ్యుడు విఠల్ పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదాం
30 ఏళ్లు ఉద్యోగుల కోసం కృషి చేశానని, ఎన్ని పదవులు నిర్వహించినా తెలంగాణ ఉద్యమాల సమయంలో వచ్చిన పేరే గొప్పగా భావిస్తానని దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగులంతా ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధిలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులు దేవీప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.