Thierry Delaporte
-
కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియా రాకతో ‘విప్రో’లో సీను మారింది
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విప్రో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్ పల్లియా.. రెండు నెలలు లోపే సంస్థ మాజీ సీఈఓ థియరీ డెలాపోర్టే సీఈఓగా పని చేసే సమయంలో పలు విభాగాల్లో ముఖ్యపాత్ర పోషించిన టాప్ మేనేజ్మెంట్ను ఇతర విభాగాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.విప్రోను ముందుకు నడిపించే తన నమ్మకస్తుల్ని అక్కున చేర్చుకుంటున్నారు పల్లియా. ఇందులో భాగంగా థియరీ డెలాపోర్టేకు నమ్మకస్తులైన ముగ్గురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు బదిలి చేశారు. ఇక విప్రో వ్యాపారం పుంజుకునేలా శ్రీనివాస్ పల్లియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విప్రోలో ప్రముఖ పాత్ర పోషించే ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్, ఇంజనీరింగ్ ఎడ్జ్ అండ్ కన్సల్టింగ్ విభాగాల్లో మార్పులు చేశారు.సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎకోసిస్టమ్స్ & పార్ట్నర్షిప్ గ్లోబల్ హెడ్, జాసన్ ఐచెన్‌హోల్జ్ వ్యాపార కార్యకలాపాల గురించి ఇప్పుడు విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ బిజినెస్ లైన్ హెడ్ జో డెబెకర్‌కి రిపోర్ట్ చేయాలి. ఐచెన్‌హోల్జ్ ఆగస్ట్ 2021లో విప్రోలో చేరగా, డెబెకర్ జనవరి 2022లో విప్రోలో బాధ్యతలు చేపట్టారు.విప్రో ఆసియా పసిపిక్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా (APMEA) స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్‌కు సీఈఓగా వినయ్ ఫిరాకే కొద్ది రోజుల క్రితం నియమించింది. ఆయన నియమాకం తర్వాత విప్రో కంపెనీ బెనెలక్స్, నార్డిక్ దేశాలు కార్యకలాపాలను కలిపి ఒకే ఉత్తర ఐరోపా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది .ప్రస్తుత బెనెలక్స్ దేశ విప్రో మేనేజింగ్ డైరెక్టర్ శరత్ చంద్ కొత్త ఉత్తర ఐరోపా ప్రాంతానికి నాయకత్వం వహిస్తారని కంపెనీ తెలిపింది.దీంతో పాటు విప్రో ఉనికి ఎక్కువగా ఉన్న యూరోపియన్ దేశాల్లో తన వ్యాపారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు యూకే, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, నార్డిక్స్, బెనెలక్స్, దక్షిణ ఐరోపాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తన డెలివరీ లొకేషన్లను ఏర్పాటు చేయనుంది.విప్రో ఇంజినీరింగ్ ఎడ్జ్‌లో, నోకియాతో ప్రైవేట్ వైర్లెస్ జాయింట్ సొల్యూషన్ కోసం విప్రో ఎంగేజ్మెంట్ లీడర్‌గా శ్రేయాస్ భోసలే నియమించింది.ఇలా విప్రో కంపెనీ తన యూనిట్లలో భారీ మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
థియరీ డెలాపోర్టే రాజీనామా, విప్రో కొత్త సీఈఓగా శ్రీనివాస్ పల్లియా
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రోలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విప్రో సీఈఓ థియరీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన స్థానంలోశ్రీనివాస్ పల్లియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఏప్రిల్ 6న థియరీ డెలాపోర్టే తన పదవికి రాజీనామా చేసినట్లు విప్రో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. మే 31,2024 వరకు ఆయన పదవిలోనే కొనసాగుతారని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుతం అమెరికాస్ 1 ఏరియా సీఈఓగా ఉన్న శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో సీఈఓ పదవికి రాజీనామా చేసిన డెలాపోర్టే జూలై 2020లో విప్రో సీఈఓగా, ఎండీగా నియమితులయ్యారు. అంతకు ముందు క్యాప్‌జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా పనిచేశారు. విప్రో సీఈఓ జీతం ఎంత? గత డిసెంబరులో, డెలాపోర్టే సంవత్సరానికి రూ. 82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని అందించినట్లు విప్రో నివేదించింది. తద్వారా డెలాపోర్టే భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా పేరు సంపాదించారు. డెలాపోర్టే సైన్సెస్పో ప్యారిస్ నుండి ఆర్థిక, ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని, సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్‌ను పూర్తి చేశారు. -
భారత్‌లో ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓ ఎవరో తెలుసా?
భారత్‌లో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో ఫ్రాన్స్‌కు చెందిన థియరీ డెలాపోర్టే అగ్రస్థానంలో నిలిచారు. 2020 నుంచి విప్రో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న డెలాపోర్టే .. వేతనాల విషయంలో దేశీయ మిగిలిన టెక్ కంపెనీలు హెచ్‌సీఎల్, టీసీఎస్ సీఈఓలను వెనక్కి నెట్టారు. ఏడాదికి రూ.82 కోట్ల వేతనాన్ని పొందుతున్నారు. ఈ సందర్భంగా ఫోర్బ్స్తో డెలాపోర్టే మాట్లాడుతూ.. ‘‘ విప్రో సీఈఓ పదవికి అర్హులైన వారి కోసం అన్వేహిస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీని, ప్రస్తుత ఛైర్మన్ అజీమ్ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీని కలిశాను. వారితో మాట్లాడక ముందు భవిష్యత్‌పై నాకు అనేక ప్రతికూల ఆలోచనలు ఉన్నాయి. కానీ అజీమ్, రిషద్‌తో మూడు, నాలుగు గంటలు గడిపిన తర్వాత నా ఆలోచన ధోరణి పూర్తిగా మారింది. వారి ఇద్దరి మాటల్లో విలువలతో కూడిన ఆశయాలు, ప్రాధాన్యతల గురించి విన్న తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను’’ అని డెలాపోర్టే అన్నారు. డెలాపోర్టే తర్వాత ఎవరంటే? ఇక డెలాపోర్టే తర్వాత ఇన్ఫోసిస్‌కు చెందిన సలీల్ పరేఖ్ దేశంలోనే అత్యధిక చెల్లింపులు జరుపుతున్న రెండవ సీఈఓగా అవతరించారు. ఎకనామిక్ టైమ్స్ నివేదికలో స్టాక్ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 500 కంపెనీల విశ్లేషణలో తేలింది. పరేఖ్ ఈ ఏడాది రూ. 56.45 కోట్ల జీతం తీసుకున్నారు. రూ. 30 కోట్ల వేతనంతో టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ మూడో స్థానంలో నిలిచారు. నాల్గవ స్థానంలో మాజీ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ రూ. 29 కోట్లకు పైగా సంపాదించారు రేసులో కామత్ సోదరులు ఈ ఏడాదిలో అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ డైరక్టర్, సీఈఓగా జీరోధా సోదరులు నిలిచారు. జీరోధార ఫౌండర్ నితిన్ కామ్, నిఖిల్ కామత్‌లు ఇద్దరూ అత్యధిక వేతనం పొందుతున్న స్టార్టప్ సీఈఓలుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరి వేతనం ఏడాది రూ.72కోట్లుగా ఉంది. -
రోజుకి రూ. 22.7 లక్షలు.. భారత్‌లో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓ
Wipro CEO Thierry Delaporte: ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'థియరీ డెలాపోర్టే' (Thierry Delaporte) గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచంలోని అనేక దిగ్గజ కంపెనీలలో పనిచేస్తున్న సీఈఓలలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓగా ఈయన ప్రసిద్ధి చెందారు. 2022-23 ఆర్ధిక సంవత్సరం వార్షిక వేతనంలో 5శాతం తగ్గినప్పటికీ భారీ ప్యాకేజి తీసుకునే సీఈఓలలో ఇప్పటికీ ఒకరుగా ఉన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో డెలాపోర్టే 10 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం కలిగి ఉన్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ. 83 కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈయన వార్షిక వేతనం రూ. 79.66 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈయన వేతనం రోజుకి రూ. 22.7 లక్షలు కావడం కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఏఐ టెక్నాలజీపై సంచలన వ్యాఖ్యలు చేసిన గూగుల్ మాజీ సీఈఓ..) గత సంవత్సరంలో డెలాపోర్టే మాత్రమే కాకుండా ఎక్కువ జీతం తీసుకునే భారతీయ సీఈఓల జాబితాలో ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ (రూ. 71.02 కోట్లు), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ (రూ. 34 కోట్లు) ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ 17.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 144 కోట్లు), 'జూలీ స్వీట్' యాక్సెంచర్ (Accenture) సీఈఓ 23 మిలియన్ డాలర్ల జీతం (దాదాపు రూ. 189 కోట్లు) తీసుకుంటోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
విప్రో లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 3,075 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,087 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ. 23,190 కోట్లను అధిగమించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం విప్రో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పైగా ఎగసి రూ. 90,488 కోట్లను తాకింది. క్యూ4లో 1,823 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,56,921కు పరిమితమైంది. అంచనాలు వీక్..: 2023–24 తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఐఎస్ఆర్ఈ సహా.. ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి ఆదాయం త్రైమాసికవారీగా 3–1% మధ్య క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 275.3–281.1 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం సాధించవచ్చని గైడెన్స్ ప్రకటించింది. బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో మందగమన పరిస్థితులున్నా, డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ పేర్కొన్నారు. షేర్ల బైబ్యాక్‌కు సై: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 445 ధర మించకుండా 26,96,62,921 షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇవి కంపెనీ ఈక్విటీలో 4.91 శాతం వాటాకు సమానంకాగా..ఇందుకు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది. -
నాలుగు విభాగాలపై విప్రో ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: క్లయింట్ల వ్యాపార అవసరాలకు అనుగుణంగా మెరుగైన సర్వీసులు అందించడంపై, అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై విప్రో మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా నాలుగు వ్యూహాత్మక వ్యాపార విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టనుంది. క్లౌడ్, ఎంటర్ప్రైజ్ సాంకేతికత .. వ్యాపార పరివర్తన, ఇంజినీరింగ్, కన్సల్టింగ్ వీటిలో ఉంటాయి. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ తెలిపింది. నిర్ణయాల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, పెట్టుబడుల విషయంలో సమర్ధమంతంగా వ్యవహరించేందుకు ఇవి తోడ్పడగలవని విప్రో ఎండీ థియెరీ డెలాపోర్ట్ తెలిపారు. క్లౌడ్ సామరధ్యలన్నింటినీ విప్రో ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ విభాగం కిందికి తేనున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇన్ఫ్రా సర్వీసుల విభాగానికి హెడ్‌గా ఉన్న జో డెబెకర్ దీనికి సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం విప్రో ఐకోర్ వ్యాపార హెడ్‌గా ఉన్న నాగేంద్ర బండారు .. విప్రో ఎంటర్ప్రైజ్ ఫ్యూచరింగ్కు గ్లోబల్ హెడ్‌గా ఉంటారు. క్యాప్కో, డిజైనిట్ మొదలైనవన్నీ విప్రో కన్సల్టింగ్ విభాగం కింద ఉంటాయి. -
విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజ సంస్థ విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) థియరీ డెలాపోర్ట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64.3 కోట్ల (దాదాపు 8.7 మిలియన్ డాలర్లు) వేతన ప్యాకేజ్ అందుకున్నారు. 2020 జూలై 6 నుంచి 2021 మార్చి 31వ తేదీ మధ్య కాలానికి డెలాపోర్ట్ ఈ వేతనాన్ని అందుకున్నట్లు సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇందులో ఒన్‌టైమ్ క్యాష్, స్టాక్ గ్రాంట్, ఆర్ఎస్యూ (రిస్ట్రక్టెడ్ స్టాక్ యూనిట్స్) ఒన్‌టైమ్ గ్రాంట్ కలిసి ఉన్నాయని తెలిపింది. అబిదాలి నీముచ్వాలా వారసునిగా జూలై 6వ తేదీన విప్రోలో చేరారు. అంతకుముందు ఆయన క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటవ్‌గా పనిచేశారు. భారత్ ఐటీ సేవల రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2020-21లో రూ.49.68 కోట్లు. 2019-20లో ఈ ప్యాకేజ్ రూ.34.27 కోట్లు. ఇక టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపాలన్ వేతనం 2020-21లో రూ.20.36 కోట్లు. కాగా, విప్రో చైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 1.61 మిలియన్ డాలర్ల వేతనం తీసుకుంటే, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అందుకున్న మొత్తం 1.01 మిలియన్ డాలర్లు. చదవండి: కోవిడ్ పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్ -
విప్రో కొత్త సీఈవో వేతనం ఎంతో తెలుసా?
సాక్షి, ముంబై: బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో కొత్త సీఈవో థియెరీ డెలాపోర్ట్ అత్యధిక పారితోషికం అందుకునే సీఈవోగా నిలవనున్నారు. అంతేకాదు భారతీయ ఐటీ పరిశ్రమలో బెస్ట్ పెయిడ్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. జూలై 6 నుండి సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న థియరీ, ఈ ఏడాది స్టాక్ ఆప్షన్ ప్రయోజనాలతోపాటు దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. 2025, జూలై 5 వరకు ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా ఆయనను నియమించినట్లు తాజా కంపెనీ ఫైలింగ్ లో విప్రో తెలిపింది. విప్రో మొట్టమొదటి భారతీయేతర సీఈవో థియరీ వేతనంలో కంపెనీలు సీఈవోకు ఇచ్చే సాధారణ నగదు, స్టాక్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా అనేక భాగాలు ఉంటాయి. ప్రాథమిక(బేసిక్) వేతనం 9.12-11.9 కోట్లు (సంవత్సరానికి 1.07 మిలియన్ -1.4 మిలియన్ యూరోలు) రూపాయలు, టార్గెట్ వేరియబుల్ పే ఏడాదికి 14.4-21.3 కోట్లు (1.7-2.5 యూరోలు) రూపాయలు. దీంతోపాటు 3.6-4.7 కోట్ల రూపాయల ప్రవాస భత్యాన్ని కూడా కంపెనీ చెల్లించనుంది. అలాగే వన్-టైమ్ క్యాష్ అవార్డు కింద 3 మిలియన్ డాలర్లు లేదా 22.8 కోట్ల రూపాయలు (జూలై 31, 2020న, జూలై 31, 2021 రెండుసార్లు) అందిస్తుంది. కాగా మాజీ సీఈవో అబిద్ అలీ జెడ్ నీముచ్ వాలా 2020 సంవత్సరానికి స్టాక్ ఆప్షన్లతో సహా రూ .32.28 కోట్ల వేతనాన్ని అందుకున్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈవోకు చెల్లించే వార్షికవేతనం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువట. కాగా ఫ్రాన్స్‌లో జన్మించిన థియరీ డెలాపోర్ట్ విప్రోలో చేరకముందు కాప్ జెమినిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇతర దేశీయ ఐటీ కంపెనీల సీఈవోల వేతనాలు : టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 16.04 కోట్ల నుంచి 13.3 కోట్ల రూపాయలకు తగ్గింది. ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ ఆర్థిక సంవత్సరం జీతం 34.27 కోట్ల రూపాయలు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని గతేడాది 22.3 కోట్ల రూపాయల జీతం తీసుకున్నారు. 2018 లో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటీ సీఈవో ఈయన.