థియెరీ డెలాపోర్ట్ విప్రో కొత్త సీఈవో
సాక్షి, ముంబై: బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో కొత్త సీఈవో థియెరీ డెలాపోర్ట్ అత్యధిక పారితోషికం అందుకునే సీఈవోగా నిలవనున్నారు. అంతేకాదు భారతీయ ఐటీ పరిశ్రమలో బెస్ట్ పెయిడ్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకోనున్నారు. జూలై 6 నుండి సీఈవో, ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్న థియరీ, ఈ ఏడాది స్టాక్ ఆప్షన్ ప్రయోజనాలతోపాటు దాదాపు 50 కోట్ల రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. 2025, జూలై 5 వరకు ఐదేళ్లపాటు కంపెనీ సీఈవోగా ఆయనను నియమించినట్లు తాజా కంపెనీ ఫైలింగ్ లో విప్రో తెలిపింది.
విప్రో మొట్టమొదటి భారతీయేతర సీఈవో థియరీ వేతనంలో కంపెనీలు సీఈవోకు ఇచ్చే సాధారణ నగదు, స్టాక్ ఆప్షన్స్ మాత్రమే కాకుండా అనేక భాగాలు ఉంటాయి. ప్రాథమిక(బేసిక్) వేతనం 9.12-11.9 కోట్లు (సంవత్సరానికి 1.07 మిలియన్ -1.4 మిలియన్ యూరోలు) రూపాయలు, టార్గెట్ వేరియబుల్ పే ఏడాదికి 14.4-21.3 కోట్లు (1.7-2.5 యూరోలు) రూపాయలు. దీంతోపాటు 3.6-4.7 కోట్ల రూపాయల ప్రవాస భత్యాన్ని కూడా కంపెనీ చెల్లించనుంది. అలాగే వన్-టైమ్ క్యాష్ అవార్డు కింద 3 మిలియన్ డాలర్లు లేదా 22.8 కోట్ల రూపాయలు (జూలై 31, 2020న, జూలై 31, 2021 రెండుసార్లు) అందిస్తుంది. కాగా మాజీ సీఈవో అబిద్ అలీ జెడ్ నీముచ్ వాలా 2020 సంవత్సరానికి స్టాక్ ఆప్షన్లతో సహా రూ .32.28 కోట్ల వేతనాన్ని అందుకున్నారు.
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ సీఈవోకు చెల్లించే వార్షికవేతనం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువట. కాగా ఫ్రాన్స్‌లో జన్మించిన థియరీ డెలాపోర్ట్ విప్రోలో చేరకముందు కాప్ జెమినిలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
ఇతర దేశీయ ఐటీ కంపెనీల సీఈవోల వేతనాలు :
- టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ జీతం గత ఆర్థిక సంవత్సరంలో 16.04 కోట్ల నుంచి 13.3 కోట్ల రూపాయలకు తగ్గింది.
- ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ ఈ ఆర్థిక సంవత్సరం జీతం 34.27 కోట్ల రూపాయలు.
- టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నాని గతేడాది 22.3 కోట్ల రూపాయల జీతం తీసుకున్నారు. 2018 లో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న ఐటీ సీఈవో ఈయన.
Comments
Please login to add a commentAdd a comment