రెక్కలు తెగిన లోహవిహంగాలు!
మూడు రోజులుగా ఎగరని విమానాలు
లక్షలాది మంది ప్రయాణికుల గగ్గోలు
ఐటీ వ్యవస్థ కుప్పకూలడమే కారణం
బీఏ బ్యాకప్ వ్యవస్థ పునరుద్ధరణలో
భారత ఐటీ నిపుణులు వైఫల్యమంటూ విమర్శలు
(సాక్షి నాలెడ్జ్ సెంటర్): బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానాలు మూడు రోజులుగా ఎగరలేకపోతున్నాయి. ప్రధానంగా లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం, గాట్విక్ విమానాశ్రయాలకు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాల రాకపోకలు శనివారం అకస్మాత్తుగా నిలిచిపోయాయి. వేయికి పైగా విమానాల రెక్కలు విచ్చుకోలేదు. దీనికి కారణం.. కంప్యూటర్ వ్యవస్థలు మొరాయించడమే. విద్యుత్ సరఫరాలో లోపాల కారణంగా కంప్యూటర్ వ్యవస్థలు విఫలమయ్యాయని.. దీంతో విమాన సర్వీసులు రద్దయినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ (బీఏ) శనివారం ప్రకటించింది. బీఏ ఐటీ ఉద్యోగాలను భారతదేశానికి ఔట్‌సోర్స్ చేయడం వల్ల.. అక్కడి అనుభవరహిత ఉద్యోగులు సమస్యను తక్షణమే పరిష్కరించలేకపోయారని బీఏ ఉద్యోగ సంఘం తప్పుపట్టింది. ఈ ఆరోపణను బీఏ తిరస్కరించింది.
బ్రిటిష్ ఎయిర్వేస్లో భారీస్థాయి ఐటీ వ్యవస్థ వైఫల్యం ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ విమానాల రాకపోకలపై పెను ప్రభావం చూపింది. బ్రిటన్ రాజధాని లండన్ సహా ప్రపంచ వ్యాప్తంగా విమానాలు మూడు రోజులుగా నింగిలోకి ఎగరలేకపోతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాల్లో కంప్యూటర్ వ్యవస్థలు మొరాయించడమే దీనికి కారణం. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్తున్నారు. కానీ విద్యుత్ పునరుద్ధరణ జరిగిన తర్వాత కంప్యూటర్లలోని సమాచారమంతా గందరగోళంగా మారడంతో వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది.
విమాన ప్రయాణికుల వివరాలు, విమాన రాకపోకల వివరాలు, లగేజీ కదలికలు వంటి వివరాలన్నీ తారుమారయ్యాయి. దీంతో విమానాలు ఎగరలేదు. ఒక్క హీత్రూ విమానాశ్రయంలో శనివారం నాడే వేయికి పైగా విమానాలు రద్దయ్యాయ. హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాలు.. ప్రయాణికులతో నిండిపోయాయు. దాదాపు మూడు లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. సుదీర్ఘ వారాంతం, పాఠశాలలకు మధ్యంతర సెలవులు కావడంతో శనివారం ఉదయం వేలాదిమంది విదేశీ ప్రయాణాలకు సంసిద్ధమయ్యారు.
కానీ విమానయాన సంస్థ వెబ్సైట్, మొబైల్ అప్లికేషన్లు కూడా పనిచేయలేదు. విమానాలు మళ్లీ ఎప్పుడు బయల్దేరుతాయో, తమకు ఏ విమానంలో సీట్లు ఇస్తారో తెలియక ప్రయాణికులు మూడు రోజులుగా టెర్మినళ్లలోనే పడిగాపులు కాస్తున్నారు. టెర్మినళ్లు విపరీతమైన రద్దీతో ఇరుకుగా మారాయని, ప్రయాణికులు ఎవరూ రావద్దని విమానయాన సంస్థ విజ్ఞప్తులు జారీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. తాజా సమాచారం కోసం తమ ట్విటర్‌ను అనుసరించాలని కోరింది. శనివారం, ఆదివారం కూడా విమానాలు రద్దయ్యాయి. సోమవారం పాక్షికంగా విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. తీవ్ర నిస్పృహకు లోనైన వారందరూ సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
బీఏ 2016లో వందలాది మంది ఐటీ సిబ్బందిని తొలగించి, ఆ ఐటీ ఉద్యోగాలను భారతదేశానికి ఔట్ సోర్స్ చేస్తూ తీసుకున్న నిర్ణయమే.. ఈ పరిస్థితికి కారణమని సంస్థ జీఎంబీ యూనియన్ ఆరోపించింది. ఇలా ఔట్‌సోర్స్ చేయవద్దని తాము 2016 ఫిబ్రవరి 29న బ్రిటిష్ ఎయిర్ వేస్ను హెచ్చరించామని పేర్కొంది. విమానయాన సంస్థ బ్యాకప్ వ్యవస్థను తక్షణం ఎలా ప్రారంభించాలనేది.. భారతదేశంలోని అనుభవ రాహిత్య ఔట్సోర్సింగ్ సిబ్బందికి తెలియదని.. వారు బ్యాకప్ వ్యవస్థను తక్షణమే ప్రారంభించగలిగినట్లయితే సమస్య ఇంతగా పెరిగేది కాదని బీఏ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అయితే యూనియన్ విమర్శలను బ్రిటిష్ ఎయిర్వేస్ తిరస్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా పంపిణీ సంస్థలు ఐటీ సేవలను అందిస్తున్నాయని.. అన్నిరకాల పరిశ్రమలు, బ్రిటన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరించడం మామూలేనని పేర్కొంది. తమ సంస్థ ఐటీ వ్యవస్థల భద్రత విషయంలో రాజీ ఉండబోదని ఉద్ఘాటించింది.