Third phase counseling
-
ఈసారి ఎంసెట్ మూడో దశ కౌన్సెలింగ్!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఇన్నాళ్లు రెండు దశల కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహించిన ఉన్నత విద్యా మండలి.. ఇకపై మూడో దశ ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అగ్రికల్చర్, ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ లేకపోవడంతో టాప్ ర్యాంకర్లు కూడా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీల్లో చేరాల్సి వస్తోందని గుర్తించింది. అంతేకాదు వేల మంది విద్యార్థులు కాలేజీల్లో మిగిలిపోయే సీట్లలో స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా చేరడంతో టాప్ ర్యాంకర్లతోపాటు వారికి ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఇతర జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించే ఏడు దశల కౌన్సెలింగ్ నిర్వహణ పూర్తయ్యాక ఎంసెట్ మూడో దశ (చివరి దశ) ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. అందుకే జూలై చివరినాటికి జోసా ప్రవేశాలు పూర్తయ్యాక ఎంసెట్ ప్రవేశాలకు మూడో దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. -
ఏపీలోని 14 కాలేజీల్లో నిల్ అడ్మిషన్లు..
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ (ఇంజనీరింగ్) మూడో విడత కౌన్సెలింగ్ గురువారం పూర్తయింది. ఈ తుదివిడత కౌన్సెలింగ్‌లో 14 కాలేజీల్లో ఏ ఒక్కరూ చేరలేదు. రాష్ట్రంలో మొత్తం వందశాతం సీట్లు భర్తీ అయిన కాలేజీలు 47 ఉండగా, వందలోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 107 ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్, ఫార్మసీ కలిపి ఇంకా 40,436 సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా మిగిలిపోయాయి. ఈమేరకు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో 36,642 సీట్లు, ఫార్మా డీ కోర్సులో మరో 3,794 సీట్లు ఖాళీ ఉన్నట్టు ఏపీ ఎంసెట్ కన్వీనర్ బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్-2015 అడ్మిషన్లకు సంబంధించి తుదివిడత మంగళ, బుధవారాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్ వివరాలను గురువారం వెబ్సైట్లో పెట్టారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 4 లోపు ఆయా కాలేజీల్లో సర్టిఫికెట్లను అందజేసి చేరాలని కన్వీనర్ పేర్కొన్నారు.