కర్రగడ
– రెండుసార్లు రైతుసంఘాల ప్రతినిధులతో యాంటీ రూమ్‌లో సమావేశం
– ఒకసారి మార్కెటింగ్ అధికారులతో, ఇంకోసారి పేపర్ మిల్లుల ప్రతినిధులతో..
– ఐదుగురు మాట్లాడే రైతులు రావాలంటూ మార్కెటింగ్ శాఖ ఏడీ వినతి, రైతుల ఆగ్రహం
– ఆ తరువాత జాయింట్ కలెక్టర్ స్వయంగా వచ్చి విజ్ఞప్తి చేసినా పట్టుపీడని రైతులు
– అధికారుల తీరుపై మండిపడ్డ మార్కెట్ కమిటీల చైర్మన్లు
– కలెక్టర్ కోసం మూడు గంటలపాటు రైతులు ఎదురుచూపు
ఒంగోలు టౌన్: సుబాబుల్, జామాయిల్ రైతులతో కలెక్టర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశం రగడకు దారితీసింది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉదయం 10.30 గంటలకు స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ కోసం ఎదురు చూశారు. ఆమె కలెక్టర్ బంగ్లా నుంచి వచ్చిన వెంటనే సీపీఓ కాన్ఫరెన్స్ హాలు ఎదురుగా ఉన్న యాంటీ రూమ్‌కు చేరుకున్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్‌తో సుబాబుల్, జామాయిల్ కర్ర ధరల గురించి కొద్దిసేపు యాంటీ రూమ్‌లోనే చర్చించారు. అనంతరం రైతు సంఘాల ప్రతినిధులను యాంటీ రూమ్‌లోకి పిలిపించారు. వారితో మాట్లాడిన తర్వాత, మార్కెటింగ్ శాఖ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు. అనంతరం పేపర్ మిల్లుల ప్రతినిధులను పిలిపించి చర్చించారు. సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతులు మాత్రం కలెక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మార్కెటింగ్ శాఖ ఏడీ రఫీ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి బాగా మాట్లాడే ఐదుగురు రైతులు యాంటీ రూమ్‌లోకి రావాలని చెప్పడంతో అప్పటికే అసహనంతో ఉన్న రైతులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేం అక్కడకు రాము, ఏమున్నా ఇక్కడే తేల్చాలి’ అని పట్టుబట్టారు. దీంతో చేసేదేమీలేక మార్కెటింగ్ ఏడీ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు వివరించారు. కొన్ని నిముషాలకు జాయింట్ కలెక్టర్ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చి ‘జిల్లా కలెక్టర్ మాట్లాడాలని అంటున్నారు, కొంతమంది రైతులు రావాలని కోరగా, తాము వచ్చేది లేద’ని స్పష్టం చేశారు. అదే సమయంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పందంపై ఆరు నెలల నుంచి చర్చిస్తున్నారు. అయినా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. అధికారులు ఉంటారు వెళ్తారు. రైతులతో ఉండేది మేమే. ముందు ఔట్ పుట్ ప్రకటించాల’ని పట్టుబట్టారు. అంతకుముందు కనిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దారపునేని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘సుబాబుల్, జామాయిల్ ధర ఒప్పందంపై మాట్లాడాలని తమను పిలిపించారు. పదిన్నర గంటలకు ఇక్కడకు వచ్చాం. యాంటీ రూమ్‌లో మీరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మీరు అక్కడే కూర్చొని మాట్లాడే పనైతే మమ్మల్ని ఎందుకు పిలిచార’ని అధికారులను నిలదీశారు.
పురుగుల మందు డబ్బాలు పట్టుకుని తిరగాల్సి ఉంటుంది
సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పందం ధర అమలు చేయకుండా తమను దోచుకుంటున్నారని సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామానికి చెందిన రైతు నత్తల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వల్ల ఎలాంటి ఫలితం రాలేదని, జిల్లా కలెక్టర్‌తో నిర్వహించే సమావేశం ద్వారానైనా మేలు జరుగుతుందనుకుంటే గంటలకొద్దీ తమను కూర్చోపెట్టారన్నారు. కలెక్టర్ ఇక్కడకు వచ్చి మాట్లాడతారని ఎదురుచూస్తే పక్కన ఉన్న రూమ్‌లోకి ఐదుగురు రైతులు రావాలని కబురు పంపడమేంటని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారులు, ప్రభుత్వం ఇదేవిధంగా వ్యవహరిస్తే తాము పురుగుల మందు డబ్బాలు పట్టుకుని తిరగాల్సి ఉంటుందని వాపోయారు. ధరల విషయంలో న్యాయం చేయకుంటే రైతుల ఆత్మహత్యలు తప్పవని హెచ్చరించారు.
మీడియాను బయటకు పంపిన కలెక్టర్
సుబాబుల్, జామాయిల్ కర్ర ఒప్పంద ధర అమలు విషయమై రైతులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు భంగపాటు ఎదురైంది. సమావేశం ప్రారంభమవుతుందని రైతులతో కలిసి మీడియా ప్రతినిధులు కూడా సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లో ఎదురు చూశారు. అయితే, అప్పటికే యాంటీ రూమ్‌లో రెండు మూడుసార్లు సమావేశాలు నిర్వహించి ఒక కొలిక్కి రాకపోవడం, ఐదుగురితో మాట్లాడతామంటే రైతులు ఒప్పుకోకపోవడం, కలెక్టర్ తమ వద్దకు వచ్చి మాట్లాడాలని రైతులు తెగేసి చెప్పడంతో కలెక్టర్ సుజాతశర్మ తీవ్ర అసహనానికి గురయ్యారు. కలెక్టర్.. సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెడుతూనే అక్కడ ఉన్న మీడియాను బయటకు వెళ్లాలంటూ ఆదేశించారు. అంతటితో ఆగకుండా పోలీసులను పురమాయించి మీడియాను బయటకు పంపించారు. మీడియా ప్రతినిధులంతా సీపీఓ కాన్ఫరెన్స్ హాలు నుంచి బయటకు వచ్చే వరకు కలెక్టర్ బయటే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ చర్యను మీడియా ప్రతినిధులు ఖండించారు.
మీరు మంత్రితో మాట్లాడుకోండి..
మీడియా ప్రతినిధులను బయటకు పంపించిన తర్వాత కలెక్టర్ సీపీఓ కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చారు. ‘మీరంతా సంబంధిత మంత్రిని కలిసి మాట్లాడండి. నేను కూడా జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులతో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేయిస్తాను. ధర కోసం కాంక్రీట్ అగ్రిమెంట్(సంతకాలతో) చేయిస్తా’ అని చెప్పి కలెక్టర్ అక్కడ నుంచి వెళ్లిపోయారు.