Three MLAs
-
ముగ్గురు రెబెల్స్‌పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ఆ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి
* టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు * ఇప్పటికైనా నోటీసులిచ్చి వారిని అనర్హులుగా ప్రకటించాలి * మీడియాతో పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్ సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్లో చేరిన తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మదన్‌లాల్, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుకు వెంటనే నోటీసులిచ్చి, అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఎస్.మధుసూదనాచారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ విజ్ఞప్తి చేసింది. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై చర్య తీసుకోవడంలో జాప్యం చేయొద్దని కోరింది. తమ పిటిషన్లో చేసిన ప్రధాన అభ్యర్థనకు అనుగుణంగా వారిపై అనర్హత వేటు వేయడంతో పాటు, మధ్యంతర ఉత్తర్వుల కోసం కోరిన విధంగా ఈ ముగ్గురు సభ్యులు శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండా వెంటనే సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీలోని కార్యాలయంలో స్పీకర్‌ను కలుసుకుని ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని కోరుతూ పార్టీ ప్రతినిధి బృందం స్పీకర్ ఫార్మాట్లో పిటిషన్లను సమర్పించింది. ఈ పిటిషన్లతో పాటు పార్టీ ఫిరాయింపులకు సాక్ష్యాలుగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, వీడియో సాక్ష్యాలు, సీడీలు, ఇతర ఆధారాలను అందజేసింది. ప్రతినిధి బృందంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, మహ్మద్ మతీన్ ముజాద్దాదీ, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, బండారు వెంకటరమణ, ఫజల్ అహ్మద్ ఉన్నారు. తాము సమర్పించిన పిటిషన్లపై స్పీకర్ స్పందిస్తూ సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారని వైఎస్సార్సీపీ నేతలు మీడియాకు తెలిపారు. ఎన్నికల్లో తనకు నచ్చిన పార్టీకి ఓటు వేసి తీర్పు చెప్పిన ఓటరు మనోభావాలను దెబ్బతీసేలా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. వారిపై అనర్హత వేటు వేయాలి: రాఘవరెడ్డి, శివకుమార్ ‘‘గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బీఫామ్‌పై గెలుపొంది.. టీఆర్ఎస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాల్సిందిగా ఇప్పటివరకు ఎనిమిది సార్లు పిటిషన్లు ఇచ్చాం. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో రకంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి కచ్చితంగా నోటీసులిచ్చి, ముగ్గురిపై అనర్హత వేటు వేయాలని కోరాం. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశాం. బహిరంగంగా సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పించుకుని వారు టీఆర్ఎస్లో చేరిన దానికి వీడియో, ఇతర ఆధారాలున్నాయి. పార్టీ ఫిరాయింపులపై చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవిపైనే మచ్చ పడుతుంది. తాము పార్టీపరంగా స్పీకర్‌కు పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోకపోగా, టీఆర్ఎస్లో విలీనమవుతున్నట్లు ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ ఇవ్వగానే స్పీకర్ కార్యాలయం ఆగమేఘాలపై విలీన బులెటిన్‌ను జారీ చేసింది. రాజకీయాల్లో పార్టీలు విలీనమవుతాయి తప్పించి, ఎమ్మెల్యేలు చేరితే పార్టీ విలీనమైనట్లు కాదన్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పటికే న్యాయస్థానాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై 28 సార్లు మొట్టికాయలు వేశాయి. ఈ పార్టీ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా స్పీకర్ వ్యవస్థ వెంటనే నోటీసులిచ్చి, వారిపై అనర్హత వేటు వేయాలని కోరాము’’ అని వైఎస్సార్సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ స్పీకర్‌ను కలసిన అనంతరం మీడియాకు చెప్పారు. -
గోవా వెళ్లిన వారికి టికెట్ లేదు
కొత్త వారి కోసం ఆప్ వేట న్యూఢిల్లీ: గోవా వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. గత సెప్టెంబర్‌లో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు గోవా వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి స్థానంలో కొత్తవారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాపురి ఎమ్మెల్యే ధర్మేంద్ర సింగ్ కోలీ, అంబేద్కర్ నగర్ శాసనసభ్యుడు అశోక్ కుమార్ చౌహాన్, దియోలీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌లు సెప్టెంబర్ 22న గోవా వెళ్లారు. వారు వెళ్లిన విషయం తెలియగానే పార్టీ అధిష్టానం వెంటనే తిరిగి వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో భేటీ అయ్యేందుకు వెళ్లినట్టు ఢిల్లీలో వార్తలు వెలువడ్డాయి. కానీ వారు కేవలం గోవాలో పర్యటించేందుకు మాత్రమే వెళ్లినట్లు అప్పట్లో ఆప్ నేతలు వివరణ ఇచ్చారు. కానీ, నిజానికి వీరు బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్షుడు షేర్సింగ్ డాగర్‌ను కలిసేందుకు వెళ్లినట్టు ఆ తరువాత వెల్లడైంది. ఆ ఉదంతం తమను తీవ్ర ఇబ్బందికి గురి చేసిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు షేర్సింగ్ డాగర్ ప్రయత్నిస్తుండగా, చిత్రీకరించిన వీడియోను ఆప్ నేతలు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజు ధింగన్ (త్రిలోక్‌పురి), వీణా ఆనంద్ (పటేల్‌నగర్)లకు కూడా ఈసారి టికెట్ లభించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే వారి విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆప్ నేతలు నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ధింగన్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారని, అయితే ఆయనకు మీడియో మాట్లాడటం చేతకాదని ఓ నాయకుడు అన్నారు. అయితే ధింగన్ చేసిన అభివృద్ధి పనులపై ఒక నివేదికను రూపొందించాలని ఆప్ నేతలు పార్టీ వాలంటీర్లు, కార్యకర్తలను ఆదేశించారని చెప్పారు. మరో డజను మంది ఎమ్మెల్యేలకు మాత్రమే రెండోసారి ఆప్ టికెట్ దక్కే అవకాశాలున్నాయని ఆ నాయకుడు తెలిపారు.