three persons dead
-
శివయ్యా.. ఎంత ఘోరం జరిగిందయ్యా!
దేవనకొండ: శ్రీశైల మల్లన్నంటే వారికి ఎనలేని భక్తి. ఏటా ఉగాది సమయంలో వందల కిలోమీటర్లు నడిచి శ్రీశైలానికి వెళ్తుంటారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని వస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాదీ కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. అయితే..మార్గమధ్యంలో వారిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. విధి ఆడిన వింత నాటకంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బుధవారం కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని ఈదులదేవరబండ–కప్పట్రాళ్ల మధ్య చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా మోకా మండలంలోని ఎర్రగుడి ప్రాంతానికి చెందిన గడ్డం ఉలిగయ్య, గడ్డం పోతప్ప, గడ్డం శేఖతో పాటు మరి కొంతమంది రెండు రోజుల క్రితం పాదయాత్రగా శ్రీశైలానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి ఆస్పరి మండలం పుటకలమర్రి మోడల్ స్కూల్ వద్ద సేద తీరారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి నడక ప్రారంభించారు. దేవనకొండ దాటి ఈదులదేవరబండ –కప్పట్రాళ్ల మధ్య వెళ్తుండగా బళ్లారి నుంచి నంద్యాల వెళ్తున్న లారీ (ఏపీ21టీఈ0099) వెనుక వైపు నుంచి భక్తుల మీదుగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎర్రగుడి గ్రామానికి చెందిన గడ్డం ఉలిగయ్య(28), గడ్డం శేఖ(15), గడ్డం పోతప్ప(23) అక్కడికక్కడే మృతిచెందారు. గడ్డం గాదిలింగ, గడ్డం పోతులింగ, హాలహర్వి నాగరాజు, దేవేందర్‌రెడ్డి, గడ్డం బాలరాజు, గడ్డం పరశురాముడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు సర్వజనాసుపత్రికి తరలించారు. పోతులింగ, నాగరాజు, దేవేందర్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ చిన్నపీరయ్య ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కర్నూలుకు తరలించారు. మృతులు గడ్డం ఉలిగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె, గడ్డం పోతప్పకు ఒక కుమారుడు ఉన్నారు. కాగా.. లారీలకు ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అతివేగంగా రావడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మెటార్‌సైకిల్ బాంబు పేలి ముగ్గురు మృతి
బ్యాంకాక్: మోటార్ సైకిల్ బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో 19మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న తిరుగుబాటుదారుల ప్రాంతమైన యాలా పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డౌన్‌టౌన్‌లోని పంది మాంసం అమ్మే ఓ దుకాణం ముందు మోటార్ సైకిల్‌ను పార్కు చేసి ఉంచారని, అందులోని బాంబులు పేలడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట ఇలాంటి సంఘటనే మొదటగా మెజారిటీ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
మృత్యు పంజా
జిల్లాలో బుధవారం మృత్యువు పంజా విసిరింది. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఓ వ్యక్తి కాలువలో గల్లంతయ్యాడు. బాధిత కుటుంబాలు తీవ్రంగా రోదిస్తున్నాయి. లారీ ఢీకొని వృద్ధుడి మృతి ఉంగుటూరు : ఉంగుటూరులో లారీ ఢీకొని ఓ వృద్ధుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన బలమూడి కృష్ణ(60) బుధవారం జాతీయరహదారి దాటుతుండగా, సింగరాజుపాలెం నుంచి నారాయణపురం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కృష్ణ అక్కడికక్కడే మరణించాడు. చేబ్రోలు ఎస్సై చావా సురేష్ ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగిఉన్న లారీని ఢీకొన్న వ్యాన్ : యువకుడి దుర్మరణం భీమడోలు : పూళ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బుధవారం ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాల య్యాడు. మినీవ్యాన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాల య్యాయి. మరోవ్యక్తి స్పల్పంగా గాయపడ్డాడు. ఏలూరులోని బావిశెట్టి వారి పేటకు చెందిన జలపరెడ్డి దుర్గా రాంప్రసాద్(17), దెంటు సురేష్‌కుమార్ ఏలూరులోని ఓ ప్యాకర్స్ అండ్ మూవర్స్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరానికి చెందిన లారీ డ్రైవర్ మహేష్‌కు చెందిన మినీ వ్యాన్‌లో ఇంటి సామాన్లు దించేందుకు తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లారు. అక్కడ సామాన్లు దించి తిరిగి ఏలూరు వస్తుండగా.. మార్గమధ్యలో పూళ్ల వద్దకు వచ్చే సరికి మినీ వ్యాన్ డ్రైవర్ అతివేగాన్ని నియంత్రించలేక డివైడర్‌ను ఢీకొట్టాడు. అదుపుతప్పిన వ్యాన్ పక్కనే ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్న జలపరెడ్డి దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాం వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కుపోయి నుజ్జు నుజ్జయింది. వ్యాన్ డ్రైవర్ మహేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. సురేష్‌కుమార్ స్వల్పంగా గాయపడ్డాడు. దుర్గాప్రసాద్ మృతదేహాన్ని వ్యాన్ నుంచి బయటకు తీసేందుకు పోలీసులు, హైవే సిబ్బంది గంటపాటు శ్రమించారు. దీంతో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. తీవ్రగాయాలైన డ్రైవర్ మహేష్‌నూ ఏలూరు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్ అమీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి జారిపడి మరొకరు ఏలూరు అర్బన్ : రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మరణించాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు జారి దెందులూరు, ఏలూరు రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై పడి మృతిచెందాడు. ఈ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని వయసు 25 ఏళ్లు ఉండవచ్చని, బక్కపలుచని శరీరం కలిగి, 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ జి.నాగేశ్వరరావు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27572 నంబరుకు సమాచారం తెలపాలని కోరారు.