throw ball
-
ఆటలో మేటి.. నాట్య మయూరి
హిమాయత్‌నగర్: ఆమె ఆటలోకి దిగితే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేగాల్సిందే. స్టేజీపై భరతనాట్యం ప్రదర్శిస్తే ప్రేక్షకులు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఓ పక్క గేమ్‌లో బంగారు పతకాలను సాధిస్తూ.. ఇంకోపక్క నాట్యంలోనూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది రాజశ్రీ శెట్టి. పదేళ్ల వయసులో తల్లి చెప్పిన మాటలను శాసనంగా తీసుకున్న ఆ యువతి చేసిన కృషి ఇప్పుడు త్రోబాల్ గేమ్‌లోనూ, భరతనాట్యంలోను మేటిగా దూసుకెళుతోంది జూబ్లీహిల్స్‌కు చెందిన రాఘవేంద్రప్రసాద్, సునీతసాపూర్ల కుమార్తె రాజశ్రీ. ప్రస్తుతం సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బిఎస్సీ చదువుతున్న ఈమె స్కూల్ డేస్‌లోనే త్రోబాల్, భరతనాట్యంపై ఇష్టం పెంచుకుంది. అమ్మ కోసం నాట్యం రాజశ్రీ తల్లి సునీత సాపూర్కి భరతనాట్యమంటే ఇష్టం. ఆమె చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకున్న విధానాన్ని కూతురుకు చెప్పేది. అంతేకాదు.. భరతనాట్యం ప్రాముఖ్యతను సైతం వివరిస్తుండేది. ఆ మాటలే రాజశ్రీని నాట్యం వైపు నడిపించాయి. ‘‘అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా భరతనాట్యం నేర్చుకోవాలని. నాకు పదేళ్ల వయసప్పుడు ప్రముఖ భారతనాట్య గురువు హేమమాలిని ఆర్ని వద్ద నాట్యం నేర్చుకున్నాను. ఆమె నేర్పించే విధానం, చెబుతున్న తీరు అద్భుతం. అప్పటి వరకు మామూలుగా నేర్చుకుంటే పర్లేదనుకున్న నేను.. భరతనాట్యాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. ప్రస్తుతం హేమమాలిని ఆర్నీ శిష్యురాలైన కిరణ్మయి మదుపు వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకుంటున్నాను’ అని చెప్పింది రాజశ్రీ. స్కూల్ టు నేషనల్స్ సిటీలో 2017లో నేషనల్స్ జరిగాయి. ఈ పోటీల్లో చాలా రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద క్రీడాకారులు వచ్చారు. సిటీ నుంచి రాజశ్రీ టీం కూడా పాల్గొని ఉత్తమ ప్రతిభ చాటింది. ఫైనల్లో వీరి జట్టు ఢిల్లీతో తలపడి విజేతగా నిలిచింది. ‘‘స్కూల్ నుంచి మొదలైన నా త్రోబాల్ ప్రయాణం నేషనల్స్ వరకు వచ్చింది. చిన్న చిన్న పతకాల నుంచి బంగారు పతకాలను సైతం సాధించగలిగాను. అమ్మాయిలు త్రోబాల్ని ఇంతబాగా ఆడతారా! అని మేం నేషనల్స్ గెలిచినప్పుడు ప్రతి ఒక్కరూ కితాబివ్వడం నాకు ఇప్పటికీ గుర్తే’ అంటూ ఆ నాటి సంఘటనలు వివరించింది. సరదా కోసం అలా.. రాజశ్రీకి అమ్మ చెప్పిన మాటలతో నాట్యం వైపు అడుగులు వేస్తే.. సహజరంగా చిన్నప్పటి నుంచి ఆటలపై ప్రేమ పెంచుకుంది. స్కూల్లో ఫ్రెండ్స్ ఆడుతున్నప్పుడు చూసి ఎంజాయ్ చేసే ఆమె.. వారితో ఓసారి అడితే బాగుంటుందని అటువైపు అడుగులేసింది. ‘‘సరదాగా ఓసారి త్రోబాల్ ఆటలోకి దిగాను. ఫ్రెండ్స్, స్కూల్లో ఉన్న వారి మధ్య సరదా కోసం ఆడిన ఆటలో బాగా ఆడుతున్నానంటూ మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. 8వ తరగతి నుంచి గేమ్‌పై మరింత ఇంట్రస్ట్ పెరిగింది. అప్పుడే స్కూల్ లెవెల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను’ అని చెప్పింది. టీంతో పాటు బాగా ఆడి మంచి పేరు సంపాదించాక రాజశ్రీ జిల్లా, స్టేట్స్ లెవెల్లో కూడా ఆడుతూ ఈ క్రీడలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. చదువు.. ఉద్యోగం ఉండాలి ప్రస్తుతం డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఎమ్మెస్సీ చేస్తా. ఇదే క్రమంలో గేమ్‌పై కూడా మరింత శ్రద్ధ చూపిస్తాను. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి. భరతనాట్యం చేస్తూ..నా తోటివారిని ఈ సాంప్రదయానికి పరిచయం చేయాలి. భరతనాట్యంలో చెన్నై ప్రజల్ని మెప్పించగలిగితే చాలు.. అదే పెద్ద అచీవ్మెంట్. – రాజశ్రీ శెట్టి -
సునీల్‌ను ప్రోత్సహించాలి
ప్రజా సంకల్పయాత్ర బృందం: త్రోబాల్ క్రీడలో భారతదేశం తరఫున కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి బంగారు పతకాలు సాధించిన గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన నిరుపేద యువకుడు చావలి సునీల్‌కు ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని వైఎస్సార్సీపీ బాపట్ల వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నందిగం సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన సునీల్‌ను వెంట పెట్టుకుని వచ్చి యలమంచిలిలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇప్పటి వరకు సునీల్ వివిధ రాష్ట్రాల్లో బంగారు పతకాలు సాధించడమే కాకుండా 2012 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలను ఓడించి వరుస విజయాలతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సెప్టెంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న త్రోబాల్ పోటీలకు ఎంపికైనా అక్కడకు వెళ్లేందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. అత్యాధునిక సదుపాయాలతో క్రీడా మైదానాలు, క్రీడల్లో దేశంలోనే నంబర్ వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామంటున్న ప్రభుత్వం సునీల్ వంటి క్రీడాకారులను ప్రోత్సహించడంలేదన్నారు. వైఎస్సార్సీపీ ఇలాంటి బంగారు భవిష్యత్ ఉన్న క్రీడాకారులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు. -
రంగారెడ్డి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్లు ఆకట్టుకున్నాయి. నాదర్గుల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో బాలికల విభాగంలో రంగారెడ్డి జట్టు టైటిల్‌ను కై వసం చేసుకోగా... బాలుర విభాగంలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఆదివారం జరిగిన బాలికల ఫైనల్లో రంగారెడ్డి జట్టు 15-11, 11-15, 15-13తో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ జట్టు 15-10, 15-8తో ఖమ్మంపై గెలిచింది. మరోవైపు బాలుర ఫైనల్లో నిజామాబాద్ జట్టు 15-13, 8-15, 15-12తో వరంగల్‌పై నెగ్గి విజేతగా నిలిచింది. రంగారెడ్డి జట్టు 15-9, 15-10తో హైదరాబాద్‌పై గెలుపొంది మూడో స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో డీపీఎస్ ప్రిన్సిపల్ పద్మజ్యోతి ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శాట్స్ అబ్జర్వర్ ఎల్. హరినాథ్, త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. -
వరంగల్ ‘డబుల్’ ధమాక
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా త్రోబాల్ అండర్-14 చాంపియన్‌షిప్‌లో వరంగల్ జట్టు సత్తా చాటింది. రాయదుర్గ ఒయాసిస్ స్కూల్లో జరిగిన ఈ టోర్నమెంట్లో బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచి టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. బాలుర ఫైనల్లో వరంగల్ 16-5, 15-12తో రంగారెడ్డిపై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు 15-12, 14-16, 15-10తో నల్లగొండను ఓడించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో వరంగల్ 16-14, 15-12తో హైదరాబాద్‌పై గెలుపొంది విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో కరీంనగర్ జట్టు 15-11, 15-6తో రంగారెడ్డి జట్టుపై పైచేరుు సాధించింది. అనంతరం తెలంగాణ స్కూల్ గేమ్స్ అబ్జర్వర్ పి. జగన్మోహన్ రెడ్డి విజేత జట్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. -
హైదరాబాద్ బాలికలకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 స్కూల్ గేమ్స్ సమాఖ్య (జూనియర్ కాలేజి) త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సత్తాచాటుకున్నారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. బాలుర కేటగిరీలో హైదరాబాద్ రన్నరప్‌తో తృప్తిపడింది. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్ గ్రౌండ్సలో సోమవారం జరిగిన బాలికల ఫైనల్లో హైదరాబాద్ జిల్లా 15-8, 15-13తో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. దీంతో రంగారెడ్డి జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ 15-11, 15-10తో ఖమ్మంపై నెగ్గింది. బాలుర విభాగంలో కరీంనగర్ విజేతగా నిలిచింది. ఫైనల్లో కరీంనగర్ 15-12, 12-15, 15-5తో హైదరాబాద్‌ను కంగుతినిపించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15-13, 15-11తో రంగారెడ్డిపై నెగ్గింది. అనంతరం జరిగిన కార్యక్రమానికి ట్రావెల్ పాయించ్‌ఆర్ సొల్యూషన్స మేనేజింగ్ డెరైక్టర్ ఖాజీ నజీముద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఇందులో ఎస్‌జీఎఫ్‌టీఎస్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, పల్లవి స్కూల్ జీఎం గోపాల్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. లక్ష్మయ్య, ఉమ, హన్నీ, రాము గౌడ్, రాజేంద్రప్రసాద్, జగన్మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఆలిండియా త్రోబాల్ పోటీలు
– మహిళల విజేత తమిళనాడు, రన్నర్స్ ఢిల్లీ – పురుషుల విజేత ఢిల్లీ, రన్నర్స్ ఆంధ్రప్రదేశ్ – 3వ స్థానంలో మహిళల్లో కర్ణాటక, పురుషుల్లో హర్యానా కల్లూరు : కర్నూలులోని డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన ఆలిండియా మహిళల, పురుషుల త్రోబాల్ ఫెడరేషన్ కప్ పోటీలు ఆదివారం ముగిశాయి. మహిళల విభాగంలో జరిగిన మొదటి సెమీఫైనల్లో తమిళనాడు, కర్ణాటక జట్లు పోటీపడ్డాయి. 15–11, 15–13 పాయింట్ల తేడాతో తమిళనాడు జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండవ సెమీఫైనల్ మ్యాచ్ హర్యానా, ఢిల్లీ జట్ల మధ్య జరగ్గా 15–7, 15–12 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ, తమిళనాడు జట్లు పోటీపడగా 15–7, 15–5 పాయింట్ల తేడాతో సునాయసంగా తమిళనాడు జట్టు విజయకేతనం ఎగురవేసింది. సెమీఫైనల్స్‌లో ఓడిన కర్ణాటక, హర్యానా జట్ల మధ్య 3వ స్థానానికి జరిగిన పోటీలో 15–9, 15–10 పాయింట్ల తేడాతో హర్యానా జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో మొదటి సెమీఫైనల్లో ఢిల్లీ, హర్యానా జట్లు పోటీపడగా 15–13, 15–11 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు, రెండవ సెమీఫైనల్లో తమిళనాడు, ఏపీ జట్లు పోటీపడగా 15–13, 15–13 పాయింట్ల తేడాతో ఏపీ జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్నాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢీల్లీ, ఏపీ జట్ల మధ్య మూడు సెట్లలో పోటీ జరిగింది. 15–10, 6–15, 15–8 పాయింట్ల తేడాతో ఢిల్లీ జట్టు గెలుపొందింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హర్యానా, తమిళనాడు జట్లు పోటీపడగా 15–9, 15–9 పాయింట్ల తేడాతో తమిళనాడు జట్టు విజయ కేతనం ఎగురవేసింది. పారిశ్రామికవేత్త టీజీ శివరాజప్ప, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి విజేతలకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆలిండియా ఫెడరేషన్ చైర్మన్ కమల్గోస్వామి, ప్రధాన కార్యదర్శి నరేస్మన్, రాష్ట్ర సంఘం కార్యదర్శి సులోచన, జిల్లా ఒలంపిక్సంఘం కార్యదర్శి రామాంజనేయులు, పోటీల నిర్వాహక కార్యదర్శి కిరణ్‌కుమార్, సెపక్తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, నిర్వాహకులు కమల్‌బాషా పాల్గొన్నారు. -
తిరుమలగిరి కేవీదే హవా
ఎల్బీస్టేడియం, న్యూస్‌లైన్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) క్లస్టర్ స్థాయి క్రీడల్లో తిరుమలగిరి కేవీ స్కూల్ క్రీడాకారులు సత్తా చాటారు. ఇటీవల బొల్లారం, తిరుమలగిరి, హకీంపేట్ కేవీఎస్ క్లస్టర్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల్లో తిరుమలగిరి కేవీ జట్టు అండర్-19 బాలుర హాకీ, ఫుట్‌బాల్, ఖోఖో, కబడ్డీ టైటిల్స్‌ను గెలుచుకుంది. అండర్-19 బాలికల విభాగం కబడ్డీ టైటిల్‌ను గెలుచుకోగా, త్రోబాల్‌లో రన్నరప్‌గా నిలిచింది. అండర్-19 బాలుర జట్టు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ టైటిల్స్‌ను దక్కించుకున్నాయి. అండర్-14 బాలికల ఖోఖో టైటిల్‌ను గెలుచుకోగా, అండర్-14 బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్-16 బాలుర క్రికెట్ జట్టు టైటిల్‌ను గెలిచింది. పతకాలను గెలుచుకున్న క్రీడాకారిణి, క్రీడాకారులను తిరుమలగిరి కేవీ స్కూల్ ప్రిన్సిపల్ వి.మృదుల అభినందించారు. క్రీడాకారుల విజయాన్ని కృషి చేసిన పీఈటీలు రమేష్, వీరేంద్ర సింగ్, జి.బి.పద్మారావులపై ప్రశంసలు కురిపించారు.