throw ball championship
-
రాష్ట్ర త్రోబాల్ జట్టులో సమీనా, మాథ్యూ
హైదరాబాద్: జాతీయ జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. ఈ జట్టులో ఏఎస్‌రావునగర్ డివిజన్ జమ్మిగడ్డకు చెందిన షేక్ సమీనా యాస్మిన్ చోటు దక్కించుకుంది. హరియాణాలోని పానిపట్‌లో ఈనెల 23 నుంచి 25 వరకు జాతీయ జూనియర్ త్రోబాల్ చాంపియన్ షిప్ జరుగుతుంది. ఈ జట్లకు కోచ్‌గా అభిషేక్ సింగ్, మేనేజర్‌గా సరిత వ్యవహరించనున్నారు. రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ త్రోబాల్ సంఘం కార్యదర్శి సోమేశ్వర్, డీవైఎస్ఓ సుధాకర్ రావు స్పోర్ట్స్కిట్లను అందజేశారు. జట్ల వివరాలు బాలికలు: వి. నిహారిక, కె. శ్రీవర్ష, ఎన్. అపూర్వ, సమీనా యాస్మిన్, సొనాలి పాత్రో, కార్తీక తోట, కె. వసుధ, మేఘన, వినీత, డి. అఖిల, కారుణ్య, లక్ష్మీ జాన్వి, బి. పూజిత, ఎన్. ఆశ్రిత. బాలురు: మార్వెల్ పి. మాథ్యూ, నీరజ్ కుమార్, నవీన్ రాజ్, డి.శ్రీకాంత్, ఎం. తేజ సాయికృష్ణ, బి. అరుణ్ కుమార్, హెచ్. రంగ, సీహెచ్. మనోజ్, ఎం. శివసాయి, సాయికౌశిక్, రామకృష్ణ, జి. శ్రీనివాస్, బాలాజీ, జీవన్, పరమేశ్. -
మార్చి 2 నుంచి త్రోబాల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా సబ్ జూనియర్ త్రోబాల్ చాంపియన్‌షిప్ మార్చి 2, 3 తేదీల్లో జరుగనుంది. రంగారెడ్డి జిల్లా త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని ఎపిస్టెమో వికాస్ లీడర్షిప్ స్కూల్ వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తారు. అండర్–15 బాలబాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు కోము వెంకట్ (93478 11883)ను సంప్రదించవచ్చు. -
తెలంగాణ మహిళలకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతక పోరులో తెలంగాణ జట్టు 15–8, 15–11తో తమిళనాడుపై విజయం సాధించింది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన మహిళల జట్టు పోరాటం సెమీస్‌లో ముగిసింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై వరుస విజయాలతో తెలంగాణ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అక్కడ తెలంగాణ 13–15, 12–15తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో మరో సెమీస్‌లో ఓడిన తమిళనాడుతో మూడో స్థానం కోసం తలపడి విజయం సాధించింది. -
హైదరాబాద్ జట్లకు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు రాణించాయి. కొండాపూర్‌లో జరిగిన ఈ టోర్నీ బాలబాలికల విభాగాల్లో మూడో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో నిజామాబాద్, వరంగల్... బాలికల కేటగిరీలో వరంగల్, నిజామాబాద్ వరుసగా తొలి రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఆదివారం జరిగిన బాలుర ఫైనల్లో నిజామాబాద్ 15–9, 15–11తో వరంగల్‌పై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హైదరాబాద్ 15–9, 15–11తో కరీంనగర్‌ను ఓడించింది. బాలికల తుదిపోరులో వరంగల్ 15–8, 15–12తో నిజామాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్ 15–6, 15–8తో రంగారెడ్డిని ఓడించి మూడోస్థానాన్ని సాధించింది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో గచ్చిబౌలి ఏసీపీ ఎన్. శ్యామ్ ప్రసాద్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
తెనాలి కుర్రాడు.. సత్తా చాటాడు
తెనాలి: మూడు దేశాల అంతర్జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత పురుషులు, మహిళల జట్లు విజయదుందుభి మోగించాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు తెలుగు కుర్రోడు చావలి సునీల్ వైస్ కెప్టెన్‌గా సారథ్య బాధ్యతలు పంచుకోవటం విశేషం. లీగ్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీల్లో భారత జట్టు తలపడిన ప్రతి పోటీలోనూ విజేతగా నిలిచి, అప్రతిహత విజయయాత్రను కొనసాగించింది. కెప్టెన్ మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ సునీల్, గగన్, సద్దాంల ప్రతిభతో మరోసారి చాంపియన్‌గా భారత జట్టు అవతరించిందని త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ టీరామన్న ప్రకటించారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపరకు చెందిన సునీల్ పేద కుటుంబంలో జన్మించాడు. అటు చదువు, ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. చిన్నతనం నుంచి త్రోబాల్ క్రీడపై సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. జాతీయ స్థాయిలో 15, అంతర్జాతీయ పోటీల్లో నాలుగు బంగారు పతకాలను సాధించాడు. 2012, 2014, 2016లో జరిగిన మూడు దేశాల అంతర్జాతీయ త్రోబాల్ పోటీల్లో రెండు పర్యాయాలు కెప్టెన్‌గా వ్యవహరించారు. -
రన్నరప్ తెలంగాణ జట్లు
సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలబాలికల జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. బెంగళూరులో జరిగిన ఈ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచి రెండు టైటిళ్లను దక్కించుకున్నాయి. సోమవారం జరిగిన బాలుర టైటిల్ పోరులో కర్ణాటక జట్టు 25–21, 25–23తో తెలంగాణపై గెలుపొందింది. బాలికల తుదిపోరులోనూ కర్ణాటక 25–20, 25–22తో తెలంగాణను ఓడించింది. బాలుర జట్టు తరఫున బి. వేణుగోపాల్, బాలికల జట్టులో ఆర్. మౌనిక రాథోడ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వీరిద్దరికీ ‘బెస్ట్ అటాకర్’ అవార్డులు దక్కాయి. -
రంగారెడ్డి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా అండర్-19 త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జట్లు ఆకట్టుకున్నాయి. సరూర్‌నగర్‌లోని జడ్పీహెచ్ఎస్ మైదానంలో జరిగిన ఈ టోర్నీలో బాలుర విభాగంలో రంగారెడ్డి, బాలికల విభాగంలో హైదరాబాద్ జట్లు టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. బాలుర ఫైనల్లో రంగారెడ్డి 16-14, 13-15, 15-13తో నిజామాబాద్‌పై గెలుపొందింది. హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. బాలికల టైటిల్ పోరులో హైదరాబాద్ 15-12, 15-13 రంగారెడ్డిని ఓడించగా, ఖమ్మం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలను అందజేశారు. -
త్రోబాల్ టోర్నీ విజేత హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్లు ఆకట్టుకున్నాయి. కొండాపూర్‌లోని సంస్కృతి స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో టైటిల్‌ను గెలవడంతో పాటు మహిళల కేటగిరీలో రన్నరప్‌గా నిలిచాయి. ఆదివారం జరిగిన పురుషుల టైటిల్ పోరులో హైదరాబాద్ 15–11, 15–8తో రంగారెడ్డిపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో నిజామాబాద్ 15–11, 15–13తో కరీంనగర్‌పై గెలుపొందింది. మహిళల తుదిపోరులో ఖమ్మం 15–12, 16–14, 15–12తో హైదరాబాద్‌పై నెగ్గింది. రంగారెడ్డి జట్టు 15–11, 15–13తో కరీంనగర్‌ను ఓడించి మూడోస్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సంస్కృతి స్కూల్ డైరెక్టర్ ఎన్. రేవతి రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ త్రోబాల్ సంఘం కార్యదర్శి పి. జగన్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. -
భారత మహిళా జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక త్రోబాల్ టోర్నమెంట్లో టీమిండియా మహిళల జట్టు సత్తా చాటింది. శ్రీలంకలో జరిగిన ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచి టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన మహిళల పైనల్లో భారత్ (3 – 0) 25–9, 25–16, 25–8తో శ్రీలంకపై వరుస గేముల్లో విజయాన్ని సాధించింది. మరోవైపు భారత పురుషుల జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్లో భారత్ (2–3) 24–26, 25–22, 15–25, 25–22, 20–25తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ సిరీస్‌కు భవన్స్ శ్రీఅరబిందో జూనియర్ కాలేజి ఫిజికల్ డైరెక్టర్ రాము టెక్నికల్ రిఫరీగా వ్యవహరించారు. -
హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అంతర్ జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ బాలుర జట్టు గెలుపొందగా... బాలికల జట్టుకు పరాజయం ఎదురైంది. బాలుర విభాగంలో హైదరాబాద్ 15-6, 15-4తో మెదక్ జట్టుపై, ఆదిలాబాద్ 15-12, 15-8తో మహబూబ్‌నగర్ జట్టుపై, వరంగల్ 15-9, 15-6తో నల్లగొండ జట్టుపై, రంగారెడ్డి 15-1, 15-7తో ఖమ్మంపై విజయం సాధించాయి. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 12-15, 11-15తో నిజామాబాద్ చేతిలో ఓటమి పాలవగా... వరంగల్ 15-9, 15-6తో నల్లగొండపై, ఖమ్మం 15-8, 15-9తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి. అంతకుముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు టి. అనిత ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) ప్రిన్సిపల్ పద్మ జ్యోతి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్మోహన్, ప్రభుత్వ హైస్కూల్, బండ్లగూడ హెడ్మాస్టర్ శ్రీనివాసరావు, శాట్స్ అబ్జర్వర్ హరినాథ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ త్రోబాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతోన్న అంతర జిల్లా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో శుక్రవారం పురుషుల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 15-5, 15-8తో మెదక్ జట్టుపై విజయం సాధించగా... మహిళల విభాగంలో హైదరాబాద్ జట్టు 15-3, 15-2తో కరీంనగర్ జట్టును చిత్తుగా ఓడించింది. పురుషుల విభాగంలో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రంగారెడ్డి జట్టు 15-6, 15-4తో కరీంనగర్‌పై, ఆదిలాబాద్ జట్టు 15-8, 15-6తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ 15-5, 15-12తో నిజామాబాద్‌పై, రంగారెడ్డి 15-8, 15-13తో ఖమ్మంపై, వరంగల్ 15-8, 15-11తో నల్లగొండపై గెలుపొందాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి జట్టు 15-07, 15-04తో మెదక్‌పై, వరంగల్ జట్టు 15-09, 04-15, 15-11తో నల్లగొండపై, ఆదిలాబాద్ జట్టు 15-05, 15-07తో మహబూబ్‌నగర్‌పై, హైదరాబాద్ జట్టు 15-04, 15-02తో నిజామాబాద్ జట్లపై నె గ్గాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పద్మారావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే కనికారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర త్రోబాల్ సంఘం కార్యదర్శి జగన్ మోహన్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మల్క కొమురయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.