భారత పతాకంతో సునీల్ చావలి , విజయానందంలో త్రోబాల్ భారత్ పురుషులు, మహిళల జట్లు
తెనాలి: మూడు దేశాల అంతర్జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత పురుషులు, మహిళల జట్లు విజయదుందుభి మోగించాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు తెలుగు కుర్రోడు చావలి సునీల్ వైస్ కెప్టెన్‌గా సారథ్య బాధ్యతలు పంచుకోవటం విశేషం. లీగ్ పద్ధతిలో నిర్వహించిన ఈ పోటీల్లో భారత జట్టు తలపడిన ప్రతి పోటీలోనూ విజేతగా నిలిచి, అప్రతిహత విజయయాత్రను కొనసాగించింది.
కెప్టెన్ మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ సునీల్, గగన్, సద్దాంల ప్రతిభతో మరోసారి చాంపియన్‌గా భారత జట్టు అవతరించిందని త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ టీరామన్న ప్రకటించారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రం కొల్లిపరకు చెందిన సునీల్ పేద కుటుంబంలో జన్మించాడు. అటు చదువు, ఇటు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. చిన్నతనం నుంచి త్రోబాల్ క్రీడపై సాధన చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. జాతీయ స్థాయిలో 15, అంతర్జాతీయ పోటీల్లో నాలుగు బంగారు పతకాలను సాధించాడు. 2012, 2014, 2016లో జరిగిన మూడు దేశాల అంతర్జాతీయ త్రోబాల్ పోటీల్లో రెండు పర్యాయాలు కెప్టెన్‌గా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment