Thuglak
-
నా సినిమాకు థియేటర్స్ దొరకట్లేదు: ప్రముఖ నటుడి ఆవేదన
తమిళసినిమా: సంచలన నటుడు మన్సూర్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా ఈయన తన కొడుకు అలీఖాన్ తుగ్లక్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ కడమాన్‌పారై అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈయన కీలక పాత్రలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల విడుదలైన ధనుష్ చిత్రం తిరుచిట్రంఫలం ఇంకా థియేటర్లలో ప్రదర్శింపబడటం, గురువారం విజయ్‌దేవరకొండ హీరోగా నటించిన లైగర్ చిత్రం విడుదల కావడం, శుక్రవారం అరుళ్‌నిధి నటించిన డైరీ చిత్రం తెరపైకి రానుండంతో తన చిత్రానికి ఎక్కువగా థియేటర్లు దొరకలేదని మన్సూర్ అలీఖాన్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందులో చిత్ర ప్రచారానికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు, అయినా అనుకున్నట్లు చిత్రం విడుదల కాకపోవడంతో విరక్తికి గురైనట్లు తెలిపారు. దీంతో తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
‘జయం’ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ప్రణీత్ పండగ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తుగ్లక్’. రోహన్ సిద్ధార్థ, చైతన్య ప్రియ జంటగా బ్రహ్మానందం, చలపతిరావు, ‘సత్యం’ రాజేష్, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా గీతా టాకీస్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రణీత్ పండగ మాట్లాడుతూ– ‘‘మంచి లవ్ ఫీల్ కలిగిన స్టోరీతో ఉత్కంఠగా సాగే కథనంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తి కలిగించే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ‘తుగ్లక్’ పాత్రను ఓ ప్రముఖ నటుడు పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను ఇటీవల కులూ మనాలీలో అద్భుతమైన లొకేషన్స్‌లో తెరకెక్కించాం. పరమగీతగారి ఫుల్ సపోర్ట్ ఈ సినిమాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. హైదరాబాద్, రాజమండ్రిలో జరిగే ఆఖరి షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పరమ గీత, సహ నిర్మాతలు: గిరి, రజని, కెమెరా: రాహుల్ మాచినేని, సంగీతం: మహేష్ ధీర. -
సూపర్ స్టార్ రాజకీయాల్లోకి రావాలి
చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం గత లోక్‌సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ తాజాగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తుగ్లక్ మేగజైన్ ఎడిటర్‌గా కొత్తగా నియమితులైన ఎస్ గురుమూర్తి కోరారు. తుగ్లక్ మేగజైన్ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను కోరాను కాబట్టి రజనీకాంత్ రాజకీయాల్లో రాకూడదు. ఆయన సొంత నిర్ణయం తీసుకోవాలి. తమిళనాడుకు మంచి చేయగల వ్యక్తులు రాజకీయాల్లో రావాలి. రజనీ స్నేహితుడు, తుగ్లక్ మాజీ ఎడిటర్ చో రామస్వామి చాలాసార్లు ఆయనకు ఇదే విషయం చెప్పారు. తమిళనాడుకు రజనీ అవసరముందని, రాజకీయాల్లోకి రావాలని చో రామస్వామి కోరారు. తుగ్లక్ పత్రికది, నాది ఇదే అభిప్రాయం’ అని గురుమూర్తి చెప్పారు. తమిళనాడు రాజకీయాలకు, సిని రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ రంగానికి చెందినవారే తమిళ రాజకీయాలను శాసిస్తున్నారు. రజనీకాంత్‌కు కోట్లాదిమంది అభిమానులున్నారు. ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీపడుతుంటాయి. 1996 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఓ వ్యాఖ్య చేయడం తీవ్ర ప్రభావం చూపింది. జయలలితకు ఓటు వేస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడంటూ రజనీ వ్యాఖ్యానించడం డీఎంకే కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా రారా అన్నది తమిళనాడులో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. -
రోడ్డు ప్రమాదంలో నటుడి కుమారుడికి గాయాలు
చెన్నై : నటుడు మన్సూర్ ఆలీఖాన్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్ (17). బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు ముగించుకుని అడయారు వెళ్లారు. తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో సర్ధార్ పటేల్ రోడ్డు మీదుగా బైక్‌లో స్నేహితునితో కలిసి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం తుగ్లక్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వస్తున్న ఇద్దరు గాయపడ్డాడు. అడయారు ట్రాఫిక్ పోలీసులు తుగ్లక్తోపాటు అతడి స్నేహితుడిని సమీపంలోగల ఆస్పత్రిలో తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.