త్యాగరాయనగర్‌లో బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: పచ్చటి పందిళ్లు, రంగుల రంగుల తోరణాలతో నాగోలు బండ్లగూడ త్యాగరాయ నగర్‌లోని శ్రీపద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. దేవస్థానంలో 21వ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించనున్నారు. అదే రోజు చెన్నైకి చెందిన దాసాన సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఉత్సవాల్లో భాగంగా ప్రఖ్యాత వాయిద్య కళాకారులను ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్‌తో పాటు పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.