ఖతార్ ఎయిర్వేస్కు టోపీ.. రూ. 12.84 లక్షల మోసం
బంజారాహిల్స్: ఖతార్ ఎయిర్వేస్ను మోసం చేసిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పాతబస్తీకి చెందిన సయ్యద్ మోజంఅలీ బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 లోని ఖతార్ ఎయిర్వేస్లో టికెట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత ఆగస్టు 2 నుంచి 15వ తేదీల మధ్య ఆయన కొందరు ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేశారు. ఇందుకుగాను వారి నుంచి నగదు తీసుకొని టికెట్ ప్రింట్ కూడా ఇచ్చాడు.
అయితే ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ టికెట్లను కేన్సిల్ చేసి గంట తర్వాత తిరిగి మళ్లీ అవే సీట్లను వేరేవాళ్లకు విక్రయించేవాడు. ఈ సమయంలో టికెట్ల అసలు ధరను సున్నాగా చేసి సేవా పన్నులు మాత్రమే సంస్థకు చెల్లించేవాడు. మిగతా డబ్బు తన ఖాతాలో వేసుకునేవాడు. ఈ రకంగా సుమారు రూ. 12.84 లక్షలను జేబులో వేసుకున్నాడు. ఇటీవల ఖతార్ ఎయిర్వేస్ ఆడిటింగ్‌లో ఈ మోసం బట్టబయలైంది. దీంతో సంస్థ నిర్వాహకులు ఫిర్యాదు చేయగా బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.