డ్రైవర్‌కే కండక్టర్ పని కుదరదు
టిమ్స్‌పై తీర్పు సవరణకు హైకోర్టు నో
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్లు టికెట్ల జారీ యంత్రాల(టిమ్స్)ను వినియోగిస్తూ కండక్టర్ల విధులను కూడా నిర్వర్తించడానికి వీల్లేదంటూ తామిచ్చిన తీర్పును సవరించేందుకు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. డ్రైవర్లు ఇలా కండక్టర్ విధులను కూడా నిర్వర్తిం చడం మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని మరోసారి గుర్తు చేసింది. ఆర్థిక భారం పేరుతో నిబంధనలను ఉల్లంఘించడం సరికాదని హితవు పలికింది.
కావాలంటే డ్రైవర్లకు టిమ్స్ అప్పగించి కండక్టర్ విధులను నిర్వర్తింప చేసేందుకు వీలుగా చట్టంలో నిర్దిష్ట నిబంధనలు రూపొందించుకోవచ్చునని మరోసారి స్పష్టం చేసింది. డ్రైవర్లతో కండక్టర్ విధులను నిర్వర్తించరాదంటూ గత ఏడాది డిసెంబర్ 1న ఇచ్చిన తీర్పును సవరించాలన్న ఆర్టీసీ యాజమాన్యం అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
దీంతో సవరణ నిమిత్తం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని యాజమాన్యం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ కోరటంతో కోర్టు ఆమోదించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
చట్టాలు చేసేవారే ఉల్లంఘిస్తారా?
టిమ్స్ బాధ్యతలు అప్పగించి కండక్టర్ విధులను కూడా నిర్వర్తించాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ కొందరు డ్రైవర్లు 2011లో హైకోర్టును ఆశ్రయించటం తెలిసిందే. బస్సులను నడిపేటప్పుడు డ్రైవర్లు ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై ఉందని, అందువల్ల కండక్టర్‌గా కూడా విధులను నిర్వర్తించాలనడం ఎంత మాత్రం సరికాదంటూ సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది.
కోర్టు తీర్పుతో కొత్తగా 7,200 మంది కండక్టర్లను నియమించాల్సి ఉంటుందని, ఆర్థిక భారం దృష్ట్యా తీర్పును సవరించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా ధర్మాసనం శుక్రవారం విచారించింది. అయితే ఆర్థిక భారం పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టాలు చేసే అధికారులే వాటిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది.