ఇక రంగంలోకి మొబైల్ యూనిట్లు
సాక్షి, ముంబై: అత్యవసర సమయంలో ‘రెస్పాన్స్ టైం’ తగ్గించేందుకు నగరంలో 10 మొబైల్ యూనిట్లు ఏర్పాటుచేయాలని అగ్నిమాపక శాఖ నిర్ణయం తీసుకుంది. ఏదైన ప్రమాదం సంభవించినప్పుడు సమీపంలో ఉన్న ఈ మొబైల్ యూనిట్లు కేవలం ఏడు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటాయి. అక్కడ జరిగే ప్రాణ, ఆస్తి నష్టం నుంచి కాపాడతాయి. దూరం నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చి సహకరించనున్నాయి. అయితే సమీపంలో ఉండడంవల్ల ముందుగా ఈ యూనిట్లు చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తాయని బీఎంసీ అదనపు కమిషనర్ మోహన్ అడ్తాని చెప్పారు.
ఒక్కో మొబైల్ యూనిట్లో ఒక సహాయక కేంద్ర అధికారి, ఒక డ్రైవర్, ఇద్దరు అగ్నిమాపక జవాన్లు శాశ్వతంగా విధులు నిర్వహిస్తారన్నారు. కాగా, నగరంలో ట్రాఫిక్ జాం సమస్య విపరీతంగా పెరిగిపోయింది. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు, పోలీసు వ్యాన్లు, అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవాలంటే భారీ కసరత్తు చేయాలి. అయితే ఎలాంటి ప్రమాదం జరిగిన ముందుగా అక్కడికి చేరుకునేది అగ్నిమాపక వాహనాలే కావడంతో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 33 అగ్నిమాపక కేంద్రాలున్నాయి.
ఈ ట్రాఫిక్ జాంలో ఫైరింజన్లు దూరం నుంచి ఘటనాస్థలికి రావాలంటే కనీసం అరగంటకుపైనే సమయం పడుతుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీంతో నగర విస్తరణ, జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనంగా 26 కేంద్రాలను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగరంలో తగినంత స్థలం దొరక్కపోవడంతో మొబైల్ యూనిట్ల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. వీటిని ఫ్లైఓవర్ల కిందున్న ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేస్తారు.