అసెంబ్లీ తేదీలపై సందిగ్ధత!
⇒ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిద్దాం?
⇒ ఇందుకు ఏవైనా నిబంధనలున్నాయా?
⇒ అధికారుల నుంచి స్పష్టత కోరిన ముఖ్యమంత్రి
⇒ మంచి ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావే శాలకు ఇంకా ముహూర్తం కుదరలేదు. ఈ నెల 8 నుంచి 10 మధ్య బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి... 11 లేదా 13న బడ్జెట్ ప్రవేశ పెట్టేలా షెడ్యూల్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఆ ఫైలును ముఖ్యమంత్రికి పంపించినా ఆమోదం రాలేదు. ‘అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ నిబంధనల ప్రకారం బడ్జెట్ ఆమోదం పొందేందుకు సభ ఎన్ని రోజులు జరగాలనే నిబంధనలేమైనా ఉన్నాయా..?’ అనే వివరణలు కోరుతూ సీఎం ఆ ఫైలును సాధారణ పరిపాలనా విభాగానికి పంపించి నట్లు తెలిసింది. దీంతో సమావేశాల తేదీలపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆలోగా ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదంతోపాటు గవర్నర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడం తప్పనిసరి.
ప్రత్యేక నిబంధనేమీ లేదు
గతేడాది మార్చిలో కొత్తగా రూపొందించిన తెలంగాణ అసెంబ్లీ రూల్స్ ప్రకారం... బడ్జెట్ సమావేశాలకు నిర్ణీత వ్యవధి అనేదేమీ లేదు. ఆ రూల్స్‌లోని 18వ అధ్యాయం 151 (3) నిబంధన ప్రకారం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ)తో సంప్రదింపుల మేరకు స్పీకర్ నిర్ణయిస్తారు. బడ్జెట్‌పై సాధారణ చర్చను ఎన్ని రోజులు కొనసాగించాలి, ఎన్ని రోజులు డిమాండ్లపై ఓటింగ్ నిర్వహించాలనేది స్పీకర్ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది.
అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏపీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం బడ్జెట్ సమావేశాలను కనీసం 24 రోజుల పాటు నిర్వహించాలనే నిబంధన ఉండేది. సాధారణ చర్చకు 6 రోజులు, డిమాండ్లపై ఓటింగ్‌కు 18 రోజులు కేటాయిం చాలని ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ రూల్స్‌లో ఆ నిబంధనను సవరించారు. బీఏసీతో సంప్రదింపుల మేరకు స్పీకర్ తీసుకునే నిర్ణయం ప్రకారం ఎన్ని రోజులైనా బడ్జెట్ సమావేశాలు నిర్వహించే వెసులు బాటు ఉంది. కానీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టాక సాధారణ చర్చను ప్రారంభించేందుకు మధ్య 48 గంటల వ్యవధి ఉండాలనే నిబంధ న మాత్రం యథాతథంగా అమల్లో ఉంది.
ముహూర్తం చూసుకునే బడ్జెట్!
ఆర్థిక ప్రణాళికను, వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పురోగతిని నిర్దేశించేది బడ్జెటే కావడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మంచి ముహూర్తం చూసుకుని బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఈసారి కూడా మంచి ముహూర్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వీలుగా సమావేశాల తేదీలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఈనెల 29న ఉగాది పండుగ ఉండటంతో ఆలోగానే సమావేశాలను ముగించాలని భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజున గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. అంటే సమావేశాలు ప్రారంభమైన మూడో రోజున బడ్జెట్ ప్రవేశపెట్టే వీలుంటుంది. తర్వాత ఒక రోజు సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నింటికి అనుగుణంగా సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు.