మంచి ‘గుజ్జూ’ గర్ల్
కృతీ కర్బందా కన్నడ అమ్మాయి. మంచి యాక్టర్. పెర్ఫార్మెన్స్ అదరగొడుతుంది. తెలుగు సినిమాలో కూడా ఆట ఆడించింది. నటన నడిపించింది. ఫ్యాన్స్ హృదయాలపై ఆటోగ్రాఫ్‌లు కొట్టింది. అలా.. అలా.. గ్రాఫ్ పెరిగింది. ఇప్పుడు హిందీ సినిమాల్లో.. ‘శిల్పాశెట్టి కంటే నేనేమైనా తక్కువా? ఆమె మంగళూరు మగువైతే, నేను బెంగళూరు భామ’ అని బాలీవుడ్ గుండెల మీద డ్యాన్స్ చేస్తోంది. ‘ఎర్లా పగ్లా దివానా ఫిర్ సే’ అనే హిందీ సినిమాలో మంచి పాత్ర కొట్టేసింది. తెలుగు సినిమాలు మీకు తెలిసే ఉంటాయి.
బోణీ, తీన్మార్, అలా మొదలైంది, బ్రూస్లీ లో కర్బందా కర్ర తిప్పడం చూసే ఉంటారు. ఇప్పుడా హిందీ సినిమాలో బాడీ తిప్పాలట! గుజ్జూ అనే పాటకు తిప్పాలట. మన నవరాత్రుల్లో చేస్తారు చూడండి.. గర్భ, దాండియా.. అదే పాటకు గంతులేయాలట. ‘చిన్నప్పుడు నవరాత్రి ఉత్సవాల్లో భలే డ్యాన్స్ చేసేవాళ్లం మేము. ఈ గుజ్జూ దాండియా ఇప్పుడు చేస్తే బాడీ మీద ఉన్న గుజ్జు కాస్తయినా కరుగుతుంది’ అని సంతోషపడిపోతోంది కర్బందా.