tipparthi
-
పేలిన టైరు..మూడు పల్టీలు కొట్టిన కారు
నల్గొండ జిల్లా : తిప్పర్తి మండలం రామలింగాల గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కారు వెనుక టైరు పేలిపోవడం తో డివైడర్‌ను ఢీకొట్టి మూడు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా చెరుకుపల్లి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు చెరుకు పల్లి ఎస్సీ కాలనీకి చెందిన మామిడి రమేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులను విస్మరించిన ప్రభుత్వం
తిప్పర్తి : పూర్తిస్థాయి రుణమాఫీ చేయకుండా.. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించిందని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం తిప్పర్తి మండలం రాజుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. రైతులను పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధుల జీతాలు పెంచి ఏం ఘనకార్యం సాధించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. రెండేళ్లుగా రైతులు కరువుతో ఇబ్బందులు పడ్డ రైతుల కష్టాలను పట్టించుకునే దిక్కే లేకుండా అయ్యిందన్నారు. తనకు పదవీ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ పేదల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని.. ఇంత దరిద్రమైన పాలన ఎక్కడా, ఎప్పుడూ లేదన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, జూకురి రమేష్, వెంకట్రాంరెడ్డి, కోఆప్షన్ అబ్దుల్ రహీం, సంకు ధనలక్ష్మి, మెరుగు వెంకన్న, మర్రి యాదయ్య, జానయ్య, ప్రసాద్, శంకర పరశురాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నీటి సౌకర్యం ఉండేలా చూడాలి
తిప్పర్తి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా చూడాలని సర్వశిక్ష అభియాన్ ఈఈ వైద్యం భాస్కర్ సూచించారు. సోమవారం తిప్పర్తిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన తరగతి గదులను జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 513 పాఠశాలల్లో టాయిలెట్లకు, తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు.ఈ పనులను నెల రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల స్థానంలో కొత్తవాటిని నిర్మించేందుకు నివేదికలు పంపనున్నట్లు తెలిపారు. కేజీబీవీల్లో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ.. తరగతి గదుల నిర్మాణం కోసం తన సొంత నిధుల్లో పదిశాతం ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అరుణశ్రీ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సుంకరి బిక్షంగౌడ్, ఎస్ఎంసీ చైర్మన్ రఘు, యాదయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
తిప్పర్తి : కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు కృష్ణా జలాలు ఏ ఇబ్బందులు లేకుండా అందించామని, ప్రస్తుత ప్రభుత్వం ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా, కృష్ణా జలాల సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పెద్ద సూరారంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని నీటి శుద్ది కేంద్రాల్లో మోటార్లు పనిచేయడం లేదని, వాటిని మార్చాలని మార్చి నెలలో సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించినట్లు తెలిపారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా ఇస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, నీటి బిల్లుల పేరుతో లాగేసుకుంటుందని అన్నారు. ఏఎమ్మార్పీ ద్వారా తాగునీటితో పాటు చెరువులను నింపేందుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని, అదే విధంగా అనారోగ్యంతో మృతి చెందిన జాకటి మంగమ్మ కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డీసీసీబీ డైరెక్టర్పాశం సంపత్‌రెడ్డి, జూకూరు రమేష్, ఎంపీటీసీలు లొడంగి వెంకటేశ్వర్లు, కిన్నెర అంజి, నాయకులు ఎర్రమాద రత్నారెడ్డి, నారగోని భద్రయ్య, సురిగి రామకృష్ణగౌడ్, బద్దం సైదులు, నర్సిరెడ్డి, అంజయ్య, శ్రీరాములు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
తిప్పర్తి : ఎన్నికల హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు మాయమాటలు చెప్పి గద్దెను ఎక్కిన సీఎం కేసీఆర్ రుణమాఫీ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. మూడవ విడత రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు. అనంతరం సెప్టెంబర్–17న విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వంగూరు రవి, జానయ్య, మహేశ్, శివ, రాజు, శాంతికుమార్, రమేష్, సురేష్, తదితరులున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
తిప్పర్తి : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మాడ్గులపల్లిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి గాదె శ్రీను (40) తనకున్న ఒక ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని గత నాలుగు సంవత్సరాలుగా పంటలు సాగుచేస్తున్నాడు. ఈ క్రమంలో వరుస కరువుతో పంట దిగుబడులు రాకపోవడం, సాగుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి. ఈనెల 18న పత్తిచేను వద్దకు వెళ్లి ఎండుతున్న పంటను చూసి తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. సమీపంలోని రైతులు గమనించి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతు సోమవారం రాత్రి మృతి చెందాడు. సాగు కోసం రూ. 4లక్షల వరకు అప్పులు చేశాడని గ్రామస్తులు తెలిపాడు. మృతునికి భార్య సునితతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
తిప్పర్తి : ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని మాడ్గులపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తండు యాదయ్య (46) గీత వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే తాటి చెట్టు నుంచి కల్లు తేవడానికి ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో కల్లు తేవడానికి వెళ్లిన యాదయ్య రెండు గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తాటిచెట్టు వద్దకు వెళ్లి చూడగా కింద పడి ఉన్నాడు. పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా యాదయ్య మృతి చెందడంతో ఊరంతా విషాదం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ పరామర్శ... యాదయ్య కుటుంబాన్ని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. తక్షణ సహాయం కింద చంద్రం ఫౌండేషన్ ద్వారా రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్లెంల సైదులు తదితరులున్నారు. -
తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
తిప్పర్తి : ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి జారిపడి గీతకార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని మాడ్గులపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తండు యాదయ్య (46) గీత వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు మాదిరిగానే తాటి చెట్టు నుంచి కల్లు తేవడానికి ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో కల్లు తేవడానికి వెళ్లిన యాదయ్య రెండు గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తాటిచెట్టు వద్దకు వెళ్లి చూడగా కింద పడి ఉన్నాడు. పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. అందరితో కలుపుగోలుగా యాదయ్య మృతి చెందడంతో ఊరంతా విషాదం చోటు చేసుకుంది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ పరామర్శ... యాదయ్య కుటుంబాన్ని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. తక్షణ సహాయం కింద చంద్రం ఫౌండేషన్ ద్వారా రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్లెంల సైదులు తదితరులున్నారు. -
తిప్పర్తిలో దొంగల హల్చల్
తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. మంగళవారం రాత్రి గ్రామంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య నల్గొండలో నివాసం ఉంటున్నారు. ఇది గమనించిన కొందరు దుండగులు ఆయన ఇంట్లోని ఎల్సీడీ టీవీ, రూ. 3000 నగదును అపహరించుకు వెళ్లారు. పక్కనే ఉన్న మరొక ఇంట్లో ఎవరు లేకపోవడంతో.. ఆ ఇంట్లో నుంచి తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామ శివారులో ఉన్న మహ్మద్‌కు చెందిన బత్తాయితోట దగ్గరకు వెళ్లిన దుండగులు అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్‌తో తాము పోలీసులమని చెప్పి తోటలో పెంచుకుంటున్న 9 కుందేళ్లను ఎత్తుకెళ్లారు. అనంతరం రోడ్డు పై నుంచి వెళ్తున్న లారీలను అడ్డుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం దర్యాప్తు చస్తున్నారు.