తిప్పర్తి: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. మంగళవారం రాత్రి గ్రామంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య నల్గొండలో నివాసం ఉంటున్నారు. ఇది గమనించిన కొందరు దుండగులు ఆయన ఇంట్లోని ఎల్‌సీడీ టీవీ, రూ. 3000 నగదును అపహరించుకు వెళ్లారు. పక్కనే ఉన్న మరొక ఇంట్లో ఎవరు లేకపోవడంతో.. ఆ ఇంట్లో నుంచి తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
గ్రామ శివారులో ఉన్న మహ్మద్‌కు చెందిన బత్తాయితోట దగ్గరకు వెళ్లిన దుండగులు అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్‌తో తాము పోలీసులమని చెప్పి తోటలో పెంచుకుంటున్న 9 కుందేళ్లను ఎత్తుకెళ్లారు. అనంతరం రోడ్డు పై నుంచి వెళ్తున్న లారీలను అడ్డుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ సంఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దొంగల ముఠా కోసం దర్యాప్తు చస్తున్నారు.