మన మువ్వన్నెల జెండా ఆవిర్భవించింది ఏ రోజో తెలుసా!
‘‘ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా
ప్రతి మనసు ఉప్పొంగ మువ్వన్నెల మన జెండా
పుట్టింది నేడు మన జాతి గుర్తుగా ఏప్రియల్ 1 శుభదినము అనుచు’’
‘‘మన జెండా పుట్టిన రోజును భారతీయులుగా మనందరం పండుగ చేసుకుందాం’’ అని పిలుపునిస్తున్నారు కె.హెచ్.ఎస్. జగదంబ. రామ్‌నగర్ గుండులో నివసిస్తున్న ఈ జాతీయతావాది ఇంట్లో గోడలన్నీ దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టే బాధ్యతను మోస్తుంటాయి. ఎనభై ఆరేళ్ల వయసులో ఆమె టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురించి సేకరించిన విషయాలను పిల్లలకు అర్థమయ్యేటట్లు సరళంగా రాస్తూ ఉంటారు. స్త్రీ శక్తి పురస్కార గ్రహీత జగదంబ. ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నానికి చెందిన జగదంబ పెళ్లి చేసుకుని 1952లో హైదరాబాద్‌కి వచ్చారు.
అప్పటి నుంచి ఆమె హైదరాబాద్‌లో మహిళాసాధికారత కోసం పని చేశారు. యాభై ఏళ్ల కిందటే ఆమె ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టి మహిళలకు మార్గదర్శనం చేశారు. గడచిన పాతికేళ్లుగా ఆమె జాతీయ పతాక రూపశిల్పి, జాతీయ పతాకం రూపుదిద్దుకున్న వైనం పిల్లల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఆది, సోమవారాల్లో(మార్చి 31, ఏప్రిల్ 1న) తాను నిర్వహించనున్న జెండా పుట్టిన రోజు పండుగ కోసం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా సాక్షితో ఆమె తన మనోభావాలను పంచుకున్నారు.
పెన్షన్ తీసుకోమన్నారు!
‘‘పింగళి వెంకయ్య కుటుంబం అనేక ఇబ్బందులు పడుతున్న విషయం పాతికేళ్ల కిందట కాకతాళీయంగా నా దృష్టికి వచ్చింది. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్న సమయంలో నాకు తెలిసిన ఎవరో మా పరిశ్రమకు వచ్చి ఒక మాట చెప్పారు. ‘ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధులను గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలనుకుంటోంది. మీరు దరఖాస్తు చేసుకోండి’ అన్నారు. ‘మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికి నాకు పదేళ్లుంటాయో లేదో. నేను జాతీయోద్యమంలో పాల్గొనలేదు, అబద్ధపు దరఖాస్తు చేసుకోను’ అని చెప్పి పంపేశాను. అప్పుడు మా పరిశ్రమలో పని చేస్తున్న ఒక మహిళ నా దగ్గరకు వచ్చి తన పేరు రాయించమని అడిగింది. వివరాల్లోకి వెళితే ఆమె పింగళి వెంకయ్య గారి సమీప బంధువు.
జెండా రూపుదిద్దుకున్న రోజుకి గుర్తింపు ఏదీ..?
ఆమె మాత్రమే కాదు, పింగళి వెంకయ్య గారి పిల్లలు కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి నిర్ఘాంత పోయాను. ఆ క్షణంలోనే అనేక ప్రశ్నలుద్భవించాయి. భారత జాతిత్రయం! మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును వేడుక చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించుకుంటున్నాం. కానీ భారత జాతికి ప్రతీక, భారతీయులందరికీ గర్వకారణమైన జాతీయ పతాకం రూపొందించుకున్న రోజు ఎందుకు ప్రాముఖ్యత సంతరించుకోవడం లేదు. మన జాతిపిత గాంధీజీ పుట్టిన రోజును గుర్తు చేసుకుంటున్నాం. తొలి ప్రధాని నెహ్రూకి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాం. జాతీయ పతాక రూపకర్త పుట్టిన రోజును ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాం. ఇలా ప్రశ్నలతోపాటు నాలో ఆవేశం ఒక్క ఉదుటున తన్నుకొచ్చింది.
అప్పటి నుంచి పింగళి వెంకయ్య గారి సమగ్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ‘శ్రీ పింగళి వెంకయ్య ఛారిటబుల్ ట్రస్ట్ మరియు స్మారక సంస్థ’ స్థాపించి ఆయన పుట్టిన రోజు ఆగస్టు 2వ తేదీ, జాతీయ పతాకం పుట్టిన రోజు మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో స్కూలు పిల్లలకు జాతీయ పతాకం ప్రాధాన్యం, పతాకం రూపుదిద్దుకున్న వివరాలను తెలియచేయడంతోపాటు చిన్న చిన్న పోటీలు పెట్టి బహుమతులివ్వడం వంటి కార్యక్రమాలు మొదలు పెట్టాను. పార్లమెంట్లో తీర్మానం ప్రవేశ పెట్టించగలిగాను. పింగళి వెంకయ్య గారి సేవలను ప్రచారం చేసుకోవడానికి అనుమతి వచ్చింది. పోస్టల్ స్టాంపు విడుదల వరకు చేయంచగలిగాను. సెలవు ప్రకటించడం సాధ్యం కాదన్నారు. పర్వదినాలుగా ప్రకటన కోసం పోరాడుతున్నాను. నా వంతుగా ఏటా జెండా పుట్టిన రోజు వేడుకగా నిర్వహిస్తున్నాను.
మన జెండా పుట్టిన రోజు!
అది 1921 మార్చి 31వ తేదీ. విజయవాడ, గాంధీ నగర్లో రెండు రోజుల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు గాంధీజీ అధ్యక్షతన మొదలయ్యాయి. దేశనాయకులు, రాష్ట్ర నాయకులతోపాటు జాతీయోద్యమంలో పాల్గొంటున్న దేశభక్తులు దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. పింగళి వెంకయ్య లెక్చరర్‌గా బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉద్యోగం చేసేవారు. ఆయన కూడా ఆ సమావేశాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఆ సమయంలో గాంధీజీ ‘వెంకయ్య దేశదేశాల జాతీయ పతాకాల మీద అధ్యయనం చేసి ఉన్నారు. విద్యార్థులకు ఆయా దేశాల పతాకాల గురించి సమగ్రంగా వివరిస్తుంటారు. మనదేశం కోసం పతాకాన్ని రూపొందించే బాధ్యత చేపడితే బాగుంటుంది’ అన్నారు. అలా అడిగిన రోజు ఏప్రిల్ 1. గాంధీజీ అడిగిన మూడు గంటల్లో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి, రంగులకు భావాన్ని, భాష్యాన్ని చెప్పారు. సభ ఆమోదం పొందడం, అధికారికంగా ప్రకటించడం అదే రోజు జరిగిపోయాయి.
అలా 2021లో జెండా పుట్టిన వందేళ్ల పండుగ ఘనంగా నిర్వహించాను. ఈ ఏడాది ‘103వ జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సం’ వేడుకలను మార్చి 31వ తేదీన హైదరాబాద్, అంబర్‌పేట, వెంకటేశ్వర నగర్లో ఉన్న ‘పూర్ణ శాంతిశీల హోమ్స్’లో నిర్వహిస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఏప్రిల్ 1న కార్యక్రమాలను రామ్ నగర్ గుండులోని ట్రస్ట్ హెడ్ ఆఫీస్‌లో నిర్వహించనున్నాం’’ అని వివరించారు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జగదంబ.
గమనిక: ఇక ప్రతి ఏటా జూలై 22 జాతీయ పతాక దినోత్సవం జరుపుకుంటున్నాం. అది భారత జాతీయ జెండాగా స్వీకరించిన రోజు జులై 22,1947. ఇది జాతీయ పతాకం రూపుదిద్దుకున్న రోజు.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !)