Tirumala Ramachandra
-
అండీ? ఏమండీ?
పుస్తకంలోంచి... మనం అనుక్షణం వాడే మాటలలో ఏమండీ అనేది ఒకటి. శబ్దరత్నాకరుడు ఈ అండీ పదానికి లోహ పాత్ర విశేషమని అర్థం చెప్పాడు గాని, సంబోధనార్థకమని అర్థం చెప్పలేదు. మనకు సంబోధన వాచక ప్రత్యయాలు ఓ, ఓరి, ఓసి, ఆ, ఆరా, ఊ అనేవి ఉన్నాయి. ఓ రామా, ఓరి వెధవా, ఓసి లక్ష్మీ, రామా, రాము లారా అనేవి ఉదాహరణలు. అతి ప్రాచీన వైయాకరణుడైన కేతన సంబోధన విభక్తి ప్రత్యయాలు ఆ, ఆరా అని చెప్పాడు. ఓ అని ప్రత్యయం విడిగా చెప్పకపోయినా ‘ఓ పురుషోత్తమ!’ అనే ఉదాహరణ మిచ్చాడు. ఉకారాంత పదాలు సంబోధనలో దీర్ఘాలవుతాయన్నాడు. సంబోధన వాచకంగా అండీ అనే పదంగాని ప్రత్యయంగాని చెప్పలేదు. కావ్యాలంకార చూడామణికారుడు గాని, ఛందో దర్పణకారుడు గాని, చివరకు ఆంధ్రశబ్ద చింతామణి కారుడు గాని అండీని చెప్పలేదు. మరి ఈ అండీ పదం నడమంత్రంగా వచ్చిందా? ఈ అండీ ప్రత్యయం మూలమేమిటని వెదుకుతూ పోగా, ఇది క్రియారూపాలలో అర్థాంతరంలో మనకు సాక్షాత్కరిస్తుంది. లోట్ మధ్యమ పురుష బహువచన రూపంలో, చేయుఁడు, చేయుండు; తినుఁడు, తినుండు; వినుఁడు, వినుండు ఇత్యాదిగా. ఉదాహరణకు తిను ధాతువును తీసుకుందాం. నీవు తినుము- లోట్ మధ్యమ పురుష ఏకవచనం. మీరు తినుఁడు, మీరు తినుండు- లోట్ మధ్యమ పురుష బహువచనం. ఇలాగే చేయుఁడు, చేయుండు; పొమ్ము, పొండు; రమ్ము, రండు- ఇలా లోట్ మధ్యమ పురుష బహువచన ప్రత్యయమైన డు, ండు ఎదుటివారిని మర్యాదగా కోరడం గనుక, బహువచన ప్రత్యయాలన్నీ మర్యాదను తెలిపేవి గనుక, సంబోధనలోను గౌరవ వాచకాలుగా రూఢమయిపోయాయి. డు, ండు అభ్యర్థనార్థకంలో ఈతో కలిసి చేయుఁడీ, చేయుండీ; వ్రాయుఁడీ, వ్రాయుండీ ఇత్యాదిగా వ్యవహారంలోకి వచ్చాయి. లోట్ మధ్యమ పురుష ప్రయోగం నుంచి విడిపోయి సాధారణ సంబోధన వాచకాలుగా గౌరవార్థంలో వాడుకలోకి వచ్చాయి- ఏమండీ, ఎందుకండీ, చాలండీ, నిలవండీ ఇత్యాదిగా. (తిరుమల రామచంద్ర ‘నుడి-నానుడి’లోంచి...) 1962లో తొలిసారి వెలువడిన తిరుమల రామచంద్ర ‘నుడి-నానుడి’ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ పునర్ముద్రించింది. పేజీలు: 184; వెల: 130; ప్రతులకు: నవచేతన అన్ని బ్రాంచీలు. ఫోన్: 24224453. పై భాగం ఆ పుస్తకంలోని ‘అండీ? ఏమండీ?’ వ్యాసానికి సంక్షిప్త రూపం. -
తప్పనిసరి పలుకుబడి
‘మన ఉద్దేశం ఎదుటివారికి స్పష్టంగా తెలుపడం ముఖ్యమైనప్పుడు, భాష, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి గదా!’ అంటారు డాక్టర్ తిరుమల రామచంద్ర. ‘తాను ప్రయోగించే పదం తన అభిమతాన్ని వ్యక్త పరుస్తుందా లేదా అనే విషయం రచయితకు తెలియాలి’ అని కూడా మరోచోట అంటారాయనే. రామచంద్ర బహుముఖ ప్రజ్ఞాశీలి అయిన పత్రికా రచయిత. ఆయన స్వీయానుభవంతో చేసిన ఈ సూచనలను కాదనవలసిన అవసరం లేదు. ‘పలుకుబడి’ పేరుతో రామచంద్ర ఒక పత్రిక కోసం రాసిన వ్యాసాలను వయోధిక పాత్రికేయ సంఘం (హైదరాబాద్) ఇటీవల వెలువరించింది. ‘సమష్టి’- ‘సమిష్టి’, ‘నిరసన’-నిరశన’, ‘నిర్దిష్టం’-‘నిర్దుష్టం’, ‘చారిత్రక’-‘చారిత్రిక’.... వీటిలో రచయిత వ్యక్తం చేయదలుచుకున్న విషయానికి సందర్భోచితంగా ఏది ఉంటుంది? అదే సమయంలో ఏది ఒప్పయినది? ఇలాంటి ప్రశ్నలు రాసేవాళ్లంతా ఏదో దశలో ఎదుర్కొంటారు. ఇలాంటి వాటిని వివరించే పుస్తకమే ‘పలుకుబడి’. సరైన శబ్దాలు ఏమిటో చెప్పడం పండిత ప్రకర్షకైతే కాదు. ‘నిరసన’ అంటే నిరాకరించడం. ‘నిరశన’ అంటే అభోజనంగా ఉండడం. కానీ ఈ అర్థాలు తెలియక చాలామంది ఈ పదాలను తారుమారు చేసి అభాసుపాలవుతూ ఉంటారు. కానీ రామచంద్రగారే అన్నట్టు ఒకసారి పాతుకుపోయిన అభిప్రాయాలను వదల్చుకోవడానికి చాలా సంస్కారం కావాలి. భాష మీద ప్రేమ ఉన్నవాళ్లు ఈ మాత్రం సంస్కారం అలవరుచుకోవడానికి వెనుకాడకూడదు. అవసరమైతే సంధి సూత్రాలు ఇస్తూ, సందర్భం, సున్నిత హాస్యాలను మేళవించి ఇలాంటి పలుకుబడి పదాలను రామచంద్ర అందించారు. రాస్తున్న వారూ, రాయాలని కోరిక ఉన్నవాళ్లే కాదు, చదివే అలవాటు ఉన్నవాళ్లు కూడా ఆనందంగా చదువుకోదగ్గ పుస్తకం. ఎంతో ఉపయోగకరమైనది కూడా. ఇన్నాళ్లూ మనం చేసిన తప్పులను ఈ విధంగానైనా తెలుసుకోవచ్చు. సహృదయత ఉంటే నవ్వుకోవచ్చు కూడా. కానీ ఇలాంటి పుస్తకంలో కూడా ఉపోద్ఘాతాలలో లెక్కకు మిక్కిలి అచ్చుతప్పులు కనిపించడం బాధాకరం. పలుకుబడి, డాక్టర్ తిరుమల రామచంద్ర, ప్రతులకు: విశాలాంధ్ర; వెల రూ. 100/- కొండగాలీ కొత్త జీవితం ఇవన్నీ పాతరోజులు. సోవియెట్ యూనియన్ వల్ల ఆ ఛత్రం కింద దేశాలన్నీ ఏ మేరకు లాభపడ్డాయో లేదో కాని పుస్తక ప్రపంచం మాత్రం విపరీతంగా లాభపడింది. ప్రపంచమంతా సోవియెట్ సాహిత్యం శుభ్రమైన అట్టలతో నాణ్యమైన ఫాంట్‌తో పరిమళాలీనే కాగితంతో సాహితీ ప్రేమికుల ఒళ్లోకొచ్చి పడింది. రాదుగ, ప్రగతి ప్రచురణాలయాలు రాళ్లెత్తకపోయినా పుస్తకాలెత్తి ప్రపంచమంతా కొత్త సాంస్కృతిక సౌధాలను నిర్మించాడానికి కష్టపడ్డాయి. ‘కొండగాలీ కొత్తజీవితం’ 1979 నాటిది. ఇందులోని తొమ్మిది ఆర్మేనియన్ కథలు- ఆ ప్రశాంతమైన పర్వత ప్రాంత జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయి. ఒక దేశం గురించి, ఒక జాతి గురించి తెలియాలంటే ఆ జాతిని సరిగ్గా ప్రతిబింబించే సాహిత్యాన్ని చదవడమే మార్గం. కథ అంటే ఏమిటో జాతి కలిగిన కథ అంటే ఏమిటో ఈ పుస్తకం చదవి తెలుసుకున్నారు చాలామంది. ఆర్మేనియా- సోవియెట్ యూనియన్ కింద అంత సుఖంగా లేదన్నది వేరే విషయం. ప్రభుత్వం ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన ఫ్యాక్టరీల వల్ల తమ అందమైన దేశం కాలుష్యం బారిన పడుతోందని గగ్గోలు పెట్టింది. సోవియెట్ యూనియన్ పతనానికి ఒక సంవత్సరం ముందు- అంటే 1990లో అది స్వతంత్రం ప్రకటించుకుంది. ఇప్పుడు అక్కడి సాహిత్యం ఎలా ఉందో తెలియదు. మన దాకా చేరే మార్గం కూడా లేదు. కాని మిగిలిన ఇలాంటి అరాకొరా పుస్తకాలే దాచుకున్న గులాబీ రెమ్మలు. ఊహల్లో మిగిలిన ఆకుపచ్చ లోయలు.