అండీ? ఏమండీ?
పుస్తకంలోంచి...
మనం అనుక్షణం వాడే మాటలలో ఏమండీ అనేది ఒకటి. శబ్దరత్నాకరుడు ఈ అండీ పదానికి లోహ పాత్ర విశేషమని అర్థం చెప్పాడు గాని, సంబోధనార్థకమని అర్థం చెప్పలేదు. మనకు సంబోధన వాచక ప్రత్యయాలు ఓ, ఓరి, ఓసి, ఆ, ఆరా, ఊ అనేవి ఉన్నాయి. ఓ రామా, ఓరి వెధవా, ఓసి లక్ష్మీ, రామా, రాము లారా అనేవి ఉదాహరణలు. అతి ప్రాచీన వైయాకరణుడైన కేతన సంబోధన విభక్తి ప్రత్యయాలు ఆ, ఆరా అని చెప్పాడు. ఓ అని ప్రత్యయం విడిగా చెప్పకపోయినా ‘ఓ పురుషోత్తమ!’ అనే ఉదాహరణ మిచ్చాడు. ఉకారాంత పదాలు సంబోధనలో దీర్ఘాలవుతాయన్నాడు. సంబోధన వాచకంగా అండీ అనే పదంగాని ప్రత్యయంగాని చెప్పలేదు. కావ్యాలంకార చూడామణికారుడు గాని, ఛందో దర్పణకారుడు గాని, చివరకు ఆంధ్రశబ్ద చింతామణి కారుడు గాని అండీని చెప్పలేదు. మరి ఈ అండీ పదం నడమంత్రంగా వచ్చిందా?
ఈ అండీ ప్రత్యయం మూలమేమిటని వెదుకుతూ పోగా, ఇది క్రియారూపాలలో అర్థాంతరంలో మనకు సాక్షాత్కరిస్తుంది. లోట్ మధ్యమ పురుష బహువచన రూపంలో, చేయుఁడు, చేయుండు; తినుఁడు, తినుండు; వినుఁడు, వినుండు ఇత్యాదిగా. ఉదాహరణకు తిను ధాతువును తీసుకుందాం. నీవు తినుము- లోట్ మధ్యమ పురుష ఏకవచనం. మీరు తినుఁడు, మీరు తినుండు- లోట్ మధ్యమ పురుష బహువచనం. ఇలాగే చేయుఁడు, చేయుండు; పొమ్ము, పొండు; రమ్ము, రండు- ఇలా లోట్ మధ్యమ పురుష బహువచన ప్రత్యయమైన డు, ండు ఎదుటివారిని మర్యాదగా కోరడం గనుక, బహువచన ప్రత్యయాలన్నీ మర్యాదను తెలిపేవి గనుక, సంబోధనలోను గౌరవ వాచకాలుగా రూఢమయిపోయాయి. డు, ండు అభ్యర్థనార్థకంలో ఈతో కలిసి చేయుఁడీ, చేయుండీ; వ్రాయుఁడీ, వ్రాయుండీ ఇత్యాదిగా వ్యవహారంలోకి వచ్చాయి. లోట్ మధ్యమ పురుష ప్రయోగం నుంచి విడిపోయి సాధారణ సంబోధన వాచకాలుగా గౌరవార్థంలో వాడుకలోకి వచ్చాయి- ఏమండీ, ఎందుకండీ, చాలండీ, నిలవండీ ఇత్యాదిగా.
(తిరుమల రామచంద్ర ‘నుడి-నానుడి’లోంచి...)
1962లో తొలిసారి వెలువడిన తిరుమల రామచంద్ర ‘నుడి-నానుడి’ని నవచేతన పబ్లిషింగ్ హౌస్ పునర్ముద్రించింది. పేజీలు: 184; వెల: 130; ప్రతులకు: నవచేతన అన్ని బ్రాంచీలు. ఫోన్: 24224453. పై భాగం ఆ పుస్తకంలోని ‘అండీ? ఏమండీ?’ వ్యాసానికి సంక్షిప్త రూపం.