తిరుమల శేషాచలంపై యాక్షన్ ప్లాన్-జవదేకర్
తిరుమల: తిరుమల శేషాచలంలోని విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడం, తిరిగి ఆ మొక్కల్ని పెంచటం, అగ్నిప్రమాదాలు అరికట్టడం కోసం ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తామని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందని, అందుకు కేంద్రం కూడా సహకరిస్తుందని తెలిపారు.
నిత్యం వేలాదిగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుమల సప్తగిరుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయన్నారు. భవిష్యత్లో కూడా తలెత్తే అన్ని సమస్యల్ని టీటీడీ, రిజర్వు ఫారెస్ట్ సంయుక్తంగా కట్టడి చేసేందుకు అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానని జవదేకర్ చెప్పారు.